ANTI VAX CZECH REPUBLIC FOLK SINGER HANA HORKA HAS DIED AFTER SHE DELIBERATELY CONTRACTED COVID SK
Singer Death: కావాలని కరోనా అంటించుకున్న సింగర్.. పాపం.. చివరకు దానికే బలి
(Imaget: Twitter/Cleavon_MD)
Czech Republic Singer died: వ్యాక్సిన్ అనేది కార్పొరేట్ల కుట్ర అని ముందు నుంచీ గళం విప్పుతున్న ఆమె.. కావాలనే ఉద్దేశపూర్వకంగా కోవిడ్ బారినపడ్డారు. కరోనా సోకిన కుమారుడు, తండ్రికి దగ్గరగా మెలగడంతో ఆమెకు కూడా కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయింది.
ప్రపంచమంతటా ఒమిక్రాన్ వేరియెంట్ (Omicron Variant) టెన్షన్ నెలకొంది. భారత్‌తో పాటు చాలా దేశాల్లో కరోనా మళ్లీ విరుచుకుపడుతోంది. లక్షల్లో కొత్త కేసుల వస్తున్నాయి. ప్రజలంతా కోవిడ్ నిబంధనలను పాటించాలని.. వ్యాక్సిన్లు వేసుకోవాలని.. ప్రభుత్వాలు,వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ కొందరు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. చెక్ రిపబ్లిక్ (Czech Republic) దేశానికి చెందిన ఓ జానపద గాయని కూడా ఇలానే అశ్రద్ధ వహించి.. ప్రాణాలు పోగొట్టుకున్నారు. ముందు నుంచీ వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన ఆమె.. కావాలని కరోనా బారినపడి.. చివరకు దాని చేతుల్లోనే బలయ్యారు.
చెక్ రిపబ్లిక్కు చెందిన ఫోక్ సింగర్ హనా హొర్కా (Hana Horka) కోవిడ్ (Covid-19) బారిన పడి మరణించారు. 57 ఏళ్ల వయసున్న ఆమె ఇప్పటి వరకు ఒక్క డోస్ కూడా కోవిడ్ వ్యాక్సీన్ (Corona Vaccine) తీసుకోలేదు. కోవిడ్ సోకిన రెండు రోజుల తర్వాత ఆమె కోలుకుంటున్నారని అంతా అనుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా అదే భావించారు. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. అనూహ్యంగా ఆమె గత ఆదివారం కన్నుమూశారు.
హనా హొర్కా తండ్రి, కుమారుడికి ఇటీవల వైరస్ సోకింది. వారు ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ కరోనా బారినపడ్డారు. కుటుంబంలో కరోనా కల్లోలం రేపినా, హనా హోర్కా మాత్రం జాగ్రత్తలు పాటించలేదు. దూరంగా ఉండకుండా.. వారితోనే గడిపింది. వ్యాక్సిన్ అనేది కార్పొరేట్ల కుట్ర అని ముందు నుంచీ గళం విప్పుతున్న ఆమె.. కావాలనే ఉద్దేశపూర్వకంగా కోవిడ్ బారినపడ్డారు. కోవిడ్ సోకిన తన కుమారుడు, తండ్రికి దగ్గరగా మెలగడంతో ఆమెకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వ్యాక్సిన్ తీసుకోవడం కన్నా.. కరోనా వ్యాధితో పోరాడడం ఉత్తమమని ఆమె నమ్మేవారు. ఈ క్రమంలోనే అదే కరోనా వైరస్‌కు ఆమె బలయ్యారు.
చనిపోవడానికి ముందు కూడా తన తల్లి ఆరోగ్యం బాగానే ఉందని హనా హోర్కా కుమారుడు జాన్ రెక్ చెప్పారు. వాకింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యారని.. కానీ ఇంతలో నడుం నొప్పి విపరీతంగా రావడంతో బెడ్ రూమ్‌లో నడుం వాల్చారని తెలిపారు. ఏ జరిగిందో తెలియదు.. ఆ తర్వాత 10 నిమిషాల్లోనే ఆమె మరణించారని కన్నీరు పెట్టుకున్నారు.
చెక్ రిపబ్లిక్లో సినిమాలు, బార్లు, ఇతర సాంస్కృతిక కేంద్రాలకు వెళ్లాలంటే వ్యాక్సిన్ వేసుకున్నట్లు సర్టిఫికెట్ గానీ.. ఇటీవల వైరస్ బారినపడి కోలుకున్నట్లు పత్రాలు కాని చూపించాలి. టీకాలు తీసుకున్న వారిని, కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిని మాత్రమే ఇలాంటి ప్రదేశాల్లోకి రానిస్తారు. అక్కడ ఇది రూల్. హనా హోర్కా.. అసోనాన్స్ అనే జానపద బృందంలో సభ్యురాలిగా ఉన్నారు. తాను పాటలు పాడేందుకు వెళ్లాలంటే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అయినా చూపించాలి.. లేదంటే కరోనా నుంచి కోలుకొనైనా ఉండాలి. వ్యాక్సిన్ వేసుకోవడం ఆమె ముందు నుంచీ ఇష్టం లేదు. అందుకే కరోనా బారిన పడి..దాని నుంచి కోలుకొని..ఆ పత్రాలను చూపించాలని అనుకున్నారు. అందుకే ఉద్దేశ్యపూర్వకంగా కోవిడ్ బారినపడ్డారు. దాని నుంచి కోలుకుంటున్నారని.. అంతా అనుకుంటున్న క్రమంలోనే ఆమె కన్నుమూశారు.
హనా హోర్కా మృతికి స్థానిక యాంటీ వ్యాక్సినేషన్ మూవ్‌మెంటే కారణమని ఆమె కుమారుడు ఆరోపిస్తున్నారు. వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు తన తల్లిని కొందరు ఒప్పించారని.. వారే ఆమె మృతికి బాధ్యత వహించాలని అంటున్నారు. ఇక నుంచైనా అందరూ వ్యాక్సిన్లు తీసుకోవాలని.. టీకాలవకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. టీకాల పట్ల విముఖత చూపేవారిని టీకాలు తీసుకునేందుకు ఒప్పించవచ్చనే ఉద్దేశ్యంతో.. తమ అనుభవాన్ని అందరితోనూ పంచుకుంటున్నట్లు జాన్ రెక్ చెప్పారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.