వైసీపీలో కరోనా కల్లోలం.. అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్

ఏపీలో ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మరో ఏడుగురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది.

news18-telugu
Updated: July 22, 2020, 4:01 PM IST
వైసీపీలో కరోనా కల్లోలం.. అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్
అంబటి రాంబాబు (File Photo)
  • Share this:
ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నేతలు సైతం కరోనా బారినపడుతున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీలో ఇప్పటికే పలువురు ప్రజా ప్రతినిధులకు కోవిడ్ సోకగా.. తాజాగా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అంబటి రాంబాబును కలిసిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు వారందరికీ కరోనా పరీక్షలు చేయనున్నారు.

సోమవారం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. విజయసాయితో పాటు ఆయన పీఏకు కూడా కరోనా సోకింది. పది రోజుల వరకు హోం క్వారంటైన్‌లో ఉంటున్నానని.. అత్యవసరమైతే టెలిఫోన్‌లో అందుబాటులో ఉంటానని ఆయన చెప్పారు. కానీ ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కరోనా బారినపడ్డారు. ప్రజాప్రతినిధులకు కరోనా పాజటివ్ నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో.. మిగతా నేతలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

కాగా, మంగళవారం వరకు ఏపీలో 58,668 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 25,574 మంది డిశ్చార్జి కాగా.. 758 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 32,336 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 13,86,274 కరోనా పరీక్షలు చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
Published by: Shiva Kumar Addula
First published: July 22, 2020, 2:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading