ఎన్నికల హామీల్లో ప్రకటించిన విధంగా రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా పథకం కింది వరుసగా రెండో ఏడాది రూ.13,500 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మే 15వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా లబ్ధిదారులకు ఓ లేఖ రాశారు. కరోనా కష్టకాలంలోనూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. లేఖ చివరిలో రైతులకు సొమ్ము ముట్టినట్టుగా రశీదు ఉంది.
సీఎం వైఎస్ జగన్ లేఖ యధాతథంగా..
దేశ ప్రజలందరి ఆహారానికి అభయమిచ్చే రైతన్నకు ప్రభుత్వం తరపున భరోసా కల్పించాలనే ఆలోచనతోనే వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రైతు సంతోషమే రాష్ట్ర సంతోషమని నమ్మి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే ‘వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఏటా ఖరీఫ్‌కు ముందే మే నెలలోనే రైతు భరోసా సొమ్ము అందిస్తామనే మాటను నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో 49 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రైతు భరోసా సొమ్ము వరసగా రెండో ఏడాది వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.
చెప్పిన దానికంటే అదనంగా రూ.17,500 రైతు భరోసా
రైతు భరోసా ద్వారా ఏటా రూ.12,500 వంతున నాలుగేళ్లలో రూ.50 వేలు రైతు కుటుంబానికి అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. చెప్పిన దానికంటే మిన్నగా ప్రభుత్వం రైతు భరోసా అందిస్తోంది. ఏటా రూ.13,500 చొప్పున నాలుగేళ్లు కాకుండా ఐదేళ్లలో అక్షరాలా రూ.67,500 అర్హులైన ప్రతి రైతు కుటుంబానికీ రైతు భరోసా అందిస్తోంది. రూ.50 వేలకు బదులు రూ.67,500 ఇస్తోంది. తద్వారా ఐదేళ్లలో రూ.17,500 అధికంగా ఇస్తోంది.
రైతన్నలకు రికార్డు సాయం
రైతు భరోసా సొమ్మును మొదటి విడతగా మే నెలలో రూ.7,500, రెండో విడతగా అక్టోబర్‌లో రూ.4 వేలు, మూడో విడతగా రూ.2 వేలు చొప్పున ఇస్తున్నాం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కౌలు రైతులకు, దేవదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా అంతే మొత్తం సహాయాన్ని రైతు భరోసాగా అందించడం జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 46.69 లక్షల రైతు కుటుంబాలకు 2019–20లో రూ.6,534 కోట్లు సహాయంగా అందించాం. రైతుకు అండగా నిలబడడంలో దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు.
సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్ 1902
2020–21కి సంబంధించి ఇప్పటికే ఏప్రిల్‌లో రూ.2,000 రైతుల ఖాతాల్లో జమ చేసినందున మిగతా రూ.5,500 మే 15న జమ అవుతాయి. కరోనా విపత్తుతో ఆదాయం అడుగంటినా రైతన్నకు ఇచ్చిన మాట తప్పకుండా ఈ దఫా రూ.3,675 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కౌలు రైతులకు, దేవదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసాను అందిస్తున్నాం. రూ.7,500 ఖరీఫ్ ప్రారంభానికి ముందే వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. బ్యాంకులు పాత బకాయి కింద జమ చేసుకున్నా, తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినా రైతన్నలు హెల్ప్‌లైన్ 1902కు ఫోన్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.