హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Ap Corona Update: ఏపీ స్కూళ్లు.. కాలేజీల్లో కరోనా కలకలం: తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన: స్కూళ్లు మూసేది లేదంటున్న ప్రభుత్వం

Ap Corona Update: ఏపీ స్కూళ్లు.. కాలేజీల్లో కరోనా కలకలం: తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన: స్కూళ్లు మూసేది లేదంటున్న ప్రభుత్వం

ఏపీలో మళ్లీ కరోనా భయం

ఏపీలో మళ్లీ కరోనా భయం

ఏపీలో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చేలా ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెంతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా కరోనా బారిన పడుతుండడంతో .. స్కూళ్లు మూసేయాలని ఆన్ లైన్ క్లాసులే బెటరంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో ఏపీలోనూ అదే డిమాండ్ మొదలైంది.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతుండడంతో భయం పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పిల్లలను పంపించలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా తెలంగాణలో బడులు ముతపడ్డాయి. ఏపీలో కూడా కరోనా విజృంభించడంతో స్కూల్స్ మూసివేయాని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతోంది.

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కరోనా భూతం వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా విద్యాసంస్థలపై వైరస్‌ ప్రభావం అధికంగా ఉంటోంది. పెద్దసంఖ్యలో విద్యార్థులు కొవిడ్‌ బారిన పడుతున్నారు. అయితే పిల్లల్లో లక్షణాలు ఉంటే.. వారిని ఇళ్లకు పంపిస్తున్నారు తప్పా.. వారికి పరీక్షలు చేయించడంతో పాటు.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. అలాగే లక్షణాలు ఉన్నవారిని ఇంటికి పంపిస్తున్నారు.. వారికి హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం లేదంటున్నారు తల్లిదండ్రులు.

పిల్లల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి పరీక్షలు చేయడంతో పాటు.. వారికి సన్నిహితంగా ఉన్నవారిని పరీక్షలు చేయించుకోమని చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హాజరు తగ్గితే పరీక్షలకు అనుమతించరేమోనన్న భయంతో పిల్లలను బడికి పంపిస్తున్నారు. ముఖ్యంగా టెన్త్‌ విద్యార్థుల తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఎలాగూ సిలబస్‌ చాలావరకు పూర్తయింది కాబట్టి మిగిలిన బోధన ఆన్‌లైన్‌లో చేయిస్తే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని అంటున్నారు.

కరోనా విస్తృతి నేపథ్యంలో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో.. మరి ఏపీలోని స్కూళ్ల సంగతేంటన్న ఉత్కంఠ తల్లిదండ్రుల్లో నెలకొంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల పాఠశాలలకూ చాపకింద నీరులా ఈ మహమ్మారి విస్తరిస్తోంది. కరోనా తీవ్రతతో అప్రమత్తమైన కేంద్రం ఏప్రిల్‌ నెలాఖరు వరకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. కానీ ఏపీలోని విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు మాస్కులు ధరించలేక పిల్లలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోనీ మాస్కు తీసేద్దామనుకుంటే భౌతిక దూరం నిబంధన కూడా పాటించడం లేదు. తరగతి గదుల్లో ఒక్కో బెంచ్‌కి నలుగురు, ఐదుగురు చిన్నారులను కూర్చోబెడుతున్నారు. శానిటైజేషన్‌ చేయడం లేదు. బడికి వెళ్లకపోతే హాజరు సమస్య, వెళితే కరోనా భయం.. ఈ రెండింటి మధ్య చిన్నారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

తాజాగా విజయనగరం జిల్లాలోని సీతానగరం మండలం నిడగల్లు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో విద్యార్థులు కూడా భారీగానే కరోనా బారిన పడుతుండడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మొన్న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కాతేరులోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో 167 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కళాశాలలోనే ఐసోలేషన్ రూమ్ లు ఏర్పాటు చేసి పాజిటివ్ విద్యార్థులు అందరికీ వైద్య సేవలు అందిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులకి కరోనా లక్షణాలు ఏమీ లేవని తల్లిదండ్రులు చెబుతున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అంటున్నారు. ఇక ఈ క్రమంలో కళాశాలలో 700 మందికి కరోనా పరీక్షలు చేయగా మిగిలిన వారందరికీ నెగిటివ్ అని తేలింది. ఒకే బ్లాక్ లో ఉన్న విద్యార్థులకే కరోనా సోకినట్టు తెలియడంతో మిగిలిన బ్లాక్ లోని విద్యార్థులు అందరిని కళాశాల యాజమాన్యం ఇంటికి పంపి వేసింది. కళాశాల ప్రాంగణం అంతా కంటైన్ మెంట్ జోన్ ఏర్పాటు చేశారు.

అయితే ప్రస్తుతం కాలేజీకి సెలవులు ప్రకటించినా.. విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ ఆవరణలో ఆందోళనకు దిగారు. కొంతమంది గేటు దూకి లోపలికి చొచ్చుకెళ్లినట్టు కూడా తెలుస్తోంది. దీంతో కాలేజీ దగ్గర ఉద్రిక్త పరిస్తితి కనిపిస్తోంది. మరోవైపు ఆ కాలేజీ ఘటనతో.. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల్లో భయం పెరుగుతోంది. తమ పిల్లలకు ఏదైనా అయితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు..

ఏపీ ప్రభుత్వం మాత్రం స్కూళ్లు మూసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. కరోనా విజృంభణ నేపథ్యంల ఏప్రిల్ 1నుంచి ఒంటిపూట బడులు పెట్టాలని నిర్ణయించింది. మే 14 వరకు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు పాఠశాలలు పనిచేసేలా షెడ్యూల్‌ విడుదల చేసింది. అలాగే మే 15 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. ఏప్రిల్‌ 30 వరకు సిలబస్‌ పూర్తి కానుండగా, మే 1-10 తేదీల్లో సమ్మేటివ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. మే 11 నుంచి 15 వరకు మార్కుల అప్‌లోడింగ్‌, ప్రమోషన్‌ జాబితా తయారు చేస్తారు. మే 15 నుంచి వేసవి సెలవులు ఇస్తారు. కాగా, ఎస్‌సీఈఆర్‌టీ షెడ్యూల్ ప్రకారం టెన్త్ విద్యార్థులు, టీచర్లకు వేసవి సెలవులు లేవని ప్రకటించింది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Corona, Corona Possitive, Corona virus, Visakha, Visakhapatnam, Vizag

ఉత్తమ కథలు