RRR: ఎంపీని కొట్టిన ఆధారాల్లేవు.. పోలీసులపై హైకోర్టు సీరియస్.. ఆస్పత్రికి తరలించాలని ఆదేశం

ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్

  • Share this:
    ఎంపీ రఘురామ కృష్ణంరాజును కొట్టినట్టు ఎలాంటి ఆధారాలు లేవని వైద్యులు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను డివిజన్ బెంచ్ చదివి వినిపించింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల సమయంలో ఏపీ సీఐడి పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  వైద్య పరీక్షల తరువాత ఎంపీని ప్రైవేటు ఆస్పత్రికి తరలించకుండా.. కోర్టు అనుమతి లేకుండా రఘురామను జైలుకు తరలించారంటూ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామకు జైలులో ప్రాణ హాని ఉందని ఆయన తరపున న్యాయవాది వాదించారు. హైకోర్టు ఆదేశాలతో పాటు సీఐడీ ఆదేశాలను కూడా ప్రభుత్వం బేఖాతర్ చేసిందని పేర్కొన్నారు. అయితే రఘురామ తరపు న్యాయవాది వాదనలను రికార్డ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. సీఐడీ కోర్టు, ఏపీ హైకోర్టు ఉత్తర్వుల్లోని కొన్ని అంశాలను మాత్రమే ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వులను సీఐడీ కోర్టు దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. మెడికల్ రిపోర్టును పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయి అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని రఘురామ తరపున న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఎంపీ రఘురామను జైలుకు తీసుకెళ్లకుండా.. గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

    దీనిపై ఏపీ ఏఏజీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేష్ ఆస్పత్రిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని.. అక్కడికి తీసుకెళ్తే ఆయన్ను టీడీపీ ఆఫీసుకు తీసుకెళ్లినట్టే అంటూ కోర్టుకు చెప్పారు. అయితే అంభ్యంతరాలతో కూడిన అఫిడవిట్ అందచేయాలని ఏఏజీకి కోర్టు సూచించింది. అలాగే పోలీసులు ఇచ్చిన వైద్య నివేదికపైనా అభ్యంతరాలు తెలుపుతూ కోర్టులో అఫిడవిట్ ఇవ్వాలని రఘురామ తరపున న్యాయవాదులకు సూచించింది. ప్రస్తుతం పరిస్థితుల్లో రఘురమాను జైలు కాకుండా.. ఆస్పత్రికి తరలించి.. వైద్య పరీక్షలు చేయాలని సూచించింది కోర్టు..

    అంతకుముందు జైలుకు తీసుకెళ్లారు అంటూ రఘురామ తరుపు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. దీనిపై స్పందించిన కోర్టు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కోర్టు తీర్పును కూడా పట్టించుకోరా అని ప్రశ్నించినట్టు సమాచారం. అయితే సీఐడీ కోర్టు చెప్పడంతోనే జైలుకు తరలించామని పోలీసులు సమాధానం చెప్పారు. ఆ సమాధానంపై కలుగుజేసుకున్న ధర్మాసనం.. ముందు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందా.. లేదా సీఐడీ కోర్టా అంటూ ప్రశ్నించింది. దీంతో హైకోర్టు తీర్పు కంటే ముందు సీఐడీ కోర్టు చెప్పిన ప్రకారం జైలుకు తీసుకెళ్లారంటూ చెప్పారు రఘురామ న్యాయవాదులు.. దీంతో పోలీసుల తీరుపై తీవ్రంగా కోర్టు మండిపడినట్టు తెలుస్తోంది. అలాగే మెడికల్ రిపోర్ట్స్ సమయంలో సీఐడీ చీఫ్ అక్కడకు వెళ్లడంపైనా రఘురామ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.. అసలు మెడికల్ రిపోర్ట్స్ ఇస్తున్న సమయంలో పోలీసులను మెడికల్ బోర్డు ఎలా అనుమతించారని కోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

    మరోవైపు జగన్ సర్కార్‌పై ఎంపీ రఘురామ రాజు సతీమణి రమాదేవి సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు తన భర్తను బాగా కొట్టారని ఆరోపించారు. కోర్టు నిబంధనలు పట్టించుకోరా అని ఆమె ప్రశ్నించారు. రమేశ్ ఆస్పత్రికి తరలించాలని కోరితే.. పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ రోజు రాత్రి తన భర్తను చంపాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అసలేం జరుగుతోందో తనకు అర్థం కావడం లేదని, హత్యలు చేసేవారు రోడ్లపై తిరుగుతున్నారని.. ప్రజా సమస్యలపై ప్రశ్నించేవాళ్లని జైల్లో పెడతారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
    Published by:Nagesh Paina
    First published: