దేశవ్యాప్తంగా ప్రజలందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సినేషన్ కు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఈనెల 16వ తేదీ నుంచి టీకా వేసేందుకు రంగం సిద్ధంచేస్తోంది. తొలి దశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బంది కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించిన డ్రైరన్ ను నిర్వహించింది. వ్యాక్సినేషన్ ప్రకియలో ఎదురయ్యే సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనం చేశారు. అలాగే వ్యాక్సిన్ కోసం రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలోని పూణే ల్యాబ్ నుంచి వ్యాక్సిన్ వైల్స్ ను స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చిన అధికారులు.., గన్నవంలోనే వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్ కు తరలించారు.
గన్నవరం స్టోరేజ్ సెంటర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు వ్యాక్సిన్ ను పంపిణీ చేయనున్నారు. తొలి విడతలో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, పోలీసులకి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వీరిలో మొదటగా ఆరోగ్య సిబ్బందికి కోవిడ్ టీకాలు వేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి మొత్తం 3,87,983 మందిని గుర్తించారు.
జిల్లాల వారీగా జాబితాలు సిద్ధం
కొవిడ్ వ్యాక్సినేషన్ కు ప్రభుత్వం జిల్లాల వారీగా జాబితాను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిద్ధం చేసారు. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో.., అత్యల్పంగా విజయనగరం జిల్లాలో వ్యాక్సిన్ ఇవ్వాల్సిన వారిని గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకునేవారికి కొవిన్ యాప్ ద్వారా ప్రభుత్వం ఎస్ఎంఎస్ లు పంపనుంది. జిల్లాల వారీగా చూస్తే..,అనంతపురం జిల్లాలో 29,065, చిత్తూరు జిల్లాలో 33,773, తూర్పు గోదావరి జిల్లాలో 38,128, గుంటూరు జిల్లాలో 35,389, కృష్ణా జిల్లాలో 34,813, కర్నూలు జిల్లా లో 33,279, ప్రకాశం జిల్లాలో 25,383, నెల్లూరు జిల్లాలో 31,346, శ్రీకాకుళం జిల్లాలో 21,934, విశాఖపట్నం జిల్లాలో 36,694, విజయనగరం జిల్లాలో 17,465, పశ్చిమగోదావరి జిల్లాలో 27,323, వైఎస్ఆర్ కడప జిల్లాలో 23,391 మందిని అధికారులు గుర్తించారు.
రాష్ట్రంలో అతి పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావరిలో ఎక్కువ వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 190 వ్యాక్సినేషన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తొలిరోజు 33 కేంద్రాల్లో వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు. ఒక్కో కేంద్రంలో 100మందికి టీకా వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటలకు టీకా ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలి దశలో వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్న ప్రభుత్వం.. రెండో దశలో పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనుంది. రెండో విడతలో టీకా వేయించుకునేవారి జాబితాను ఈనెల 21లోగా ప్రభుత్వానికి అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Corona Vaccine, Corona virus, Covaxin, Covid-19, COVID-19 vaccine, Covishield