ANDHRA PRADESH GOVERNMENT STARTS FEVER SURVEY AS OMICRON SPREADING IN INDIA FULL DETAILS HERE PRN
Omicron Alert: ఏపీలో ఒమిక్రాన్ టెన్షన్.. ఇంటింటి సర్వేకి ప్రభుత్వం సిద్ధం..
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) కలవర పెడుతోంది. కొవిడ్ ఆంక్షలు (Covid Rules) సడలించడం, విదేశీ ప్రయాణికుల రాక పెరగడంతో ఎక్కడ కరొనా పాజిటివ్ కేసులు వచ్చినా అది ఒమిక్రాన్ అనే ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను ఒమిక్రాన్ వేరియంట్ (Omicron Variant) కలవర పెడుతోంది. కొవిడ్ ఆంక్షలు (Covid Rules) సడలించడం, విదేశీ ప్రయాణికుల రాక పెరగడంతో ఎక్కడ కరొనా పాజిటివ్ కేసులు వచ్చినా అది ఒమిక్రాన్ అనే ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒమిక్రాన్ నియంత్రణ కోసం కార్యాచరణ అమలు చేస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఇంటింటా ఫీవర్ సర్వేను నిర్వహిస్తోంది. సోమవారం నుంచి 34వ ఫీవర్ సర్వే ప్రారంభిచింది. వారానికి ఐదు రోజుల పాటు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ హైమావది ఆదేశాలు జారీ చేశారు. ఫీవర్ సర్వేలో ఆశావర్కర్లు, వాలంటీర్లు కూడా పాల్గొంటారు.
సర్వేలో భాగంగా ఎవరికైనా జ్వరంతో పాటు కొవిడ్ లక్షణాలుంటే సంబంధిత ఏఎన్ఎంతో పాటు మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తారు. బాధితులకు వెంటనే కొవిడ్ పరీక్షలు నిర్వహించి హోం ఐసోలేషన్ లో ఉంచుతారు. వారికి ఫ్రీగా మందుల కిట్ ఇవ్వడంతో పాటు నిరంతర వైద్య సలహాలు అందిస్తారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 33సార్లు ప్రభుత్వం ఇంటింటి ఫీవర్ సర్వేను నిర్వహించింది. దీని ద్వారా కొవిడ్ బాధితులను గుర్తించి వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసినట్లు ప్రజారోగ్య శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చేవారిపై రాష్ట్ర ప్రభుత్వం దృ,టి పెట్టింది. ఏపీకి ప్రతి రోజూ 1500 నుంచి 2వేల మంది వరకు విదేశీ ప్రయాణీకులు వస్తున్నారు. వీరిలో రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్లు కూడా ఉంటున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు 30వేల మంది ఏపీకి వచ్చారు. వీరికి ఎయిర్ పోర్టులతో పాటు స్వగ్రామాలకు వచ్చిన తర్వాత కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. కొవిడ్ ఉన్నవారి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్ సీసీఎంబీకి పంపిస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్ప్పటివరకు ఒక్కరికి మాత్రమే ఒమిక్రాన్ సోకినట్లు వెల్లడికాగా.. సదరు వ్యక్తికి కొన్ని రోజుల్లోనే కరోనా నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటివరకు తూర్పుగోదావరి, తిరుపతి గుంటూరుల్లో ఒమిక్రాన్ వేరియంట్ పై ప్రచారం జరిగినా అది కేవలం కరోనా మాత్రమేనని ఒమిక్రాన్ వేరియంట్ కాదని అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వేరియంట్ పై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు నమ్మవద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అసత్య ప్రచారాలు నమ్మి భయాందోళనకు గురికావొద్దని చెబుతున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.