ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జనవరిలో వ్యాక్సిన్ పంపిణీ చేయనున్న నేపథ్యంలో తొలిదశలో ఎవరెవరికి ప్రాధాన్యం ఇవ్వాలనే అంశంపై చర్చిస్తున్నారు. తొలిదశలో ఎవరికి వేయాలి, ఎంతమంది ఉన్నారు అనేది నిర్ణయించారు. వ్యాక్సిన్ వచ్చే పరిమాణాన్ని బట్టి టీకా వేస్తారు. అవసరమైతే కోటి మందికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ వేసే సిబ్బందికి ట్రైనింగ్, వ్యాక్సిన్ నిల్వ, శాఖల సమన్వయానికి సంబంధించిన వంటి వాటిపై ప్రభుత్వం రోజువారీ సమీక్షలు జరుపుతోంది.మొదటి ప్రాధాన్యంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే వర్కర్లతో పాటు ఐసీడీఎస్ సిబ్బంది మొత్తం కలిపి 3.7 లక్షలమందికి టీకా వేస్తారు.
హెల్త్ వర్కర్స్ తర్వాత పోలీసు శాఖలో పనిచేసేవారు, ఆర్మడ్ ఫోర్స్, హోంగార్డులు, జైళ్లలో పనిచేసేవారు. ఎన్డీఆఎఎఫ్ లోని వివిధ విభాగాల్లో పనిచేసే వంలటీర్లు, రక్షణ శాఖ లో పనిచేసేవారు, మున్సిపల్ సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తారు. ఇలా మొత్తం 7 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక సాధారణ ప్రజల్లో దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా షుగర్, ఊపిరితిత్తులు, గుండె సంబధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు దాదాపు 90లక్ష మందికి వరకు ఉంటారు. వీరికి కూడా తొలిదశలో ప్రాధాన్యం లభించనుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ముందుగా స్టోరేజ్ సామర్ధ్యమే ముఖ్యమైనది. దీంతో రాష్ట్రంలో 3,76,148 లీటర్ల వ్యాక్సిన్‌ను నిల్వచేసేందుకు కోల్డ్ చైన్ ఏర్పాట్లు చేశారు. 1,677 స్టోరేజీ పాయింట్లు, 4,065 కోల్డ్‌చైన్ ఎక్విప్మెంట్ సిద్ధం చేశారు.
ఇప్పటికే ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళికల కోసం టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించింది. తాజాగా పట్టణ ప్రాంతాల్లో వ్యాక్సిన్ పంపిణీ కసరత్తు కోసం అర్బన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్‌శాఖ కమిషనర్ ఛైర్మన్ 9 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. టాస్క్ ఫోర్స్ కమిటీ ఉత్తర్వుల్లో కొన్ని మార్పులు చేసింది. స్టేట్ టాస్క్ ఫోర్స్ లో మరో ఆరుగురు సభ్యులకు స్థానం కల్పించింది. జిల్లా టాస్క్‌ఫోర్స్ లో మరో 31 మంది అధికారులు సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం పేర్కొంది. కొత్త సవరణలతో స్టేట్ టాస్క్‌ఫోర్స్ సభ్యులుగా 16 మంది, జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులుగా 34 మందిని నియమిస్తున్నట్లు ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది.