news18-telugu
Updated: August 13, 2020, 9:13 AM IST
అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజు 9వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో 50 మందికి కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే ఆగస్టు 23 వరకు సత్యానారాయణ స్వామి ఆలయలో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇటీవల దేవస్థానం పనిచేసే 650 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 50 మందికి పాజిటివ్‌గా వచ్చింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆగష్టు 9 నుంచి 14 వరకు ఆలయంలో దర్శనాలను నిలిపివేశారు. ఆగస్టు 11న మరో 250 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్టులు రావాల్సి ఉంది. ఇవాళ మరికొంత మందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఆగస్టు 23 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో ప్రకటించారు. స్వామి వారికి వ్రతాలు, కల్యాణం, ఆయుష్య హోమాలు, త్రికాల పూజలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తామని తెలిపారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 2,54,146 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాను జయించి వీరిలో 1,61,425 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం 90,425 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 2,296 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం సాయంత్రం వరకు 26,49,767 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
Published by:
Shiva Kumar Addula
First published:
August 13, 2020, 9:10 AM IST