Andhra Pradesh: థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సీఎం జగన్ యాక్షన్ ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు

వైఎస్ జగన్ (ఫైల్)

కరోన్ థర్డ్ వేవ్ (Corona Third Wave) హెచ్చరికలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Andhra Pradesh CM YS Jagan Mohan reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణకు పూర్తి అప్రమత్తతో పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ పై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా థర్డ్ వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపధ్యంలో సన్నద్ధంగా ఉండాలని.. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్‌ సూపర్‌ కేర్‌ ఆస్పత్రుల పనులను వేగవంతం చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. పోలీస్‌ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్‌ కేర్‌ ఎక్విప్‌మెంట్‌ ఏర్పాటుతో పాటు వైద్యులను నియమించాలన్నారు. కమ్యూనిటీ ఆస్పత్రులు స్ధాయివరకు ఆక్సిజన్‌ బెడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలని.., సబ్‌సెంటర్ల వరకు టెలీమెడిసిన్‌ సేవలు, ఇంటర్‌నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉండాలని తెలిపారు.

  కోవిడ్‌ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ కొనసాగించాలని సీఎం జగన్ ఆదేశించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని.. సడలింపుల సమయంలో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. సమర్ధవంతమైన నిర్వహణ ద్వారా రాష్ట్రంలో ఎక్కుమందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వగలిగామని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఇప్పటివరకు 1,80,82,390 వ్యాక్సిన్‌ డోసులు వస్తే.., ఇంకా 8,65,500 డోసులు వినియోగించాల్సి ఉందన్నారు. అలాగే ఇప్పటివరకు 1,82,49,851 డోసులు వేశామన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించడం వల్ల దాదాపుగా 11 లక్షల డోసులు ఆదా అయ్యాయన్నారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని.. విదేశాలకు వెళ్లే వారిలో ఇప్పటివరకు 31,796 మందికి వ్యాక్సినేషన్‌ వేసినట్లు వివరించారు.

  ఇది చదవండి: ఏపీలోని ఈ మండలాల్లో హై అలర్ట్.. లాక్ డౌన్ తప్పదేమో..!  45 సంవత్సరాల దాటిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాత ప్రయారిటీగా ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గడిచిన మే నెల నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు 35 లక్షల వ్యాక్సిన్ డోసులు కేటాయిస్తే అందులో కేవలం 4,63,590 డోసులు మాత్రమే వినియోగించారన్నారు. ఆ కోటాను రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. 50 పడకలు దాటి ఉన్న ప్రతి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు విషయంలో పురోగతిని సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్లు సంబంధిత జిల్లాల్లో ప్రైవేటు ఆస్పత్రులకు ఆదేశాలు ఇచ్చారని అధికారులు వివరించారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఇన్సెంటివ్‌ ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.

  ఇది చదవండి: ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్... జాబ్ పర్మినెంట్ కావాలంటే ఈ పరీక్షలు పాసవ్వాల్సిందే...!


  రాష్ట్రంలో 24,708 యాక్టివ్ కేసులున్నాయని.. 2.83 శాతం పాజిటివిటీ రేటు ఉన్నట్లు అధికారులు వివరించరు. 8 జిల్లాల్లో 3 కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉండగా.. 5 జిల్లాల్లో 3 నుంచి 5 శాతం మధ్యలో పాజిటివిటీ రేటు ఉందని..., రికవరీ రేటు 98.05 శాతం ఉందని వెల్లడించారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్లు 94.19 శాతం ఉండగా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న బెడ్లు 76.07 శాతం ఉన్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్ పాల్గొన్నారు.

  ఇది చదవండి: అక్టోబర్ లో ఏపీ ఇంటర్ పరీక్షలు... ప్రభుత్వం అనూహ్య నిర్ణయం...?

  Published by:Purna Chandra
  First published: