Andhra Pradesh: ఏపీలో పెళ్లిళ్లు, శుభకార్యాలపై కఠిన ఆంక్షలు.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొవిడ్ వ్యాక్సినేషన్ మరింత వేగంగా సాగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Chief Minister YS Jaganmohan Reddy) అధికారులను ఆదేశించారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో కొవిడ్ వ్యాక్సినేషన్ మరింత వేగంగా సాగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్ ఇతర అంశాలపై మంత్రులు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 45 ఏళ్లకు పైబడ్డవారు, గర్భిణీలు, టీచర్లకు వ్యాక్సినేషన్‌లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో కొవిడ్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ వస్తున్నందున పెద్ద ఎత్తున ప్రజలు ఒక చోటకు వచ్చే అవకాశాలున్నాయని, కోవిడ్‌ వ్యాప్తికి దారితీసే అవకాశాలున్నాయని సమావేశంలో ప్రస్తావించారు. పెళ్లిళ్ల సహా శుభకార్యాల్లో వీలైనంత తక్కువమంది ఉండేలా చూడాలని... పెళ్లిళ్లల్లో 150 మందికే పరిమితం చేయాలని సీఎం ఆదేశించారు. వీటితోపాటు ఊరేగింపులు, మతపరమైన కార్యక్రమాల్లో కూడా ఎక్కువ గుమిగూడకుండా చూడాలన్నారు. అధికారులు దీనిపై మార్గదర్శకాలు జారీచేయాలన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగేంతవరకూ జాగ్రత్తలు తప్పనిసరని.. వచ్చే రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు.

  కరోనా నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలని.. దీనివల్ల పరీక్షల్లో కచ్చితమైన నిర్ధారణలు వస్తాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఇంటింటికీ సర్వే కొనసాగాలని, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలన్నారు. 104 నంబర్‌ యంత్రాంగం సమర్థవంతగా సేవలందించేలా నిరంతరం తగిన పర్యవేక్షణ, సమీక్ష నిర్వహించాలన్నారు. విలేజ్‌ క్లినిక్స్‌ నిర్వహణపై వివరాలను అధికారులు సీఎంకు అందజేశారు. బీఎస్సీ నర్సింగ్, సీపీసీహెచ్‌ కోర్సు చేసిన ఎంఎల్‌హెచ్‌పీని విలేజ్‌క్లినిక్స్‌లో పెడతామని అధికారులు తెలిపారు. వీరితోపాటు ఏఎన్‌ఎం ఒకరిని విలేజ్‌క్లినిక్స్‌లో ఉంచుతామన్నారు. ఆశావర్కర్లు కూడా అక్కడే రిపోర్టు చేయాలని సీఎం ఆదేశించారు. విలేజీ క్లినిక్స్‌లో 12 రకాల ప్రాథమిక వైద్య సదుపాయాలు, 14 రకాల టెస్టులు, 65 రకాల మందులను అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. దీంతోపాటు టెలీమెడిసిన్‌ సేవలు కూడా అందుతాయన్నారు. అవుట్‌పేషెంట్‌ ఎగ్జామినేషన్‌ రూం, లేబొరేటరీ, ఫార్మసీ, వెయిటింగ్‌ హాల్, ఏఎన్‌ఎం క్వార్టర్స్‌ కూడా అక్కడే ఉంటాయని.. దీనివల్ల 24 గంటలపాటు ఏఎన్‌ఎం అందుబాటులో ఉండే అవకాశముందన్నారు.

  ఇది చదవండి: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇకపై జాబ్ అలర్ట్స్ చాలా ఈజీ..


  ప్రజారోగ్యంపై మ్యాపింగ్‌
  విలేజ్‌క్లినిక్స్‌ను పీహెచ్‌సీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అనుసంధానం చేయాలి అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. ల్యాబులతో కూడా వీటిని అనుసంధానం చేయాలన్నారు. గ్రామంలో ప్రజల ఆరోగ్య వివరాలపై మ్యాపింగ్‌ జరగాలని.. డిసెంబరు నాటికి విలేజ్‌ క్లినిక్‌లు పూర్తికావాలన్నారు. ఆరోగ్య శ్రీ కార్డుల ద్వారా సంబంధిత వ్యక్తి వివరాలన్నీ కూడా విలేజ్‌క్లినిక్స్‌కు అందుబాటులో ఉండాలన్నారు.
  ఆరోగ్య శ్రీ కార్డు క్యూ ఆర్‌కోడ్‌ ద్వారా ఈ వివరాలన్నీ కూడా వెంటనే తెలిసేలా చూడాలని స్పష్టం చేశారు.

  ఇది చదవండి: ఏపీలో తగ్గిన కరోనా కేసులు.., కారణం ఇదే...


  ఆస్పత్రుల్లో నాడు – నేడు
  నిర్దేశిత గడువులోగా ఆస్పత్రుల్లో నాడునేడు పనులు పనులు పూర్తి కావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్‌ కాలేజీల్లో పనుల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. పాడేరు, విజయనగరం, పిడుగురాళ్ల, మచిలీపట్నం కాలేజీల్లో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అనకాపల్లి, నంద్యాలలో మెడికల్‌కాలేజీ స్థలాలపై హైకోర్టులో పిల్స్‌ దాఖలు అయ్యాయని వివరించారు. అమలాపురం, రాజమండ్రి, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుగొండల్లో పనులు మొదలుపెట్టడానికి కాంట్రాక్టు సంస్థ సన్నాహాలు చేస్తోందని అధికారులు వివరించారు. అలాగే కర్నూలు జిల్లా ఆదోనిలో కూడా కాంట్రాక్ట్‌సంస్థకు పనులు అవార్డ్‌ చేశామని, వెంటనే పనులు కూడా మొదలవుతాయని తెలిపారు. వైద్యారోగ్య రంగంలో నాడు – నేడు పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. అన్ని వివరాలతో సమగ్రంగా ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ముందుకు రావాలన్నారు. మెడికల్ కాలజీల్లో కార్పొరేట్‌ తరహా వాతావరణం కనిపించాలన్నారు.

  ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, స్టేట్‌ కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్ ఇతర అధికారులు హాజరయ్యారు.
  Published by:Purna Chandra
  First published: