ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్లాన్ ఒక్కటే.. అలాగే సమస్య కూడా ఒక్కటే..

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల ప్లాన్ ఒక్కటే.. అలాగే సమస్య కూడా ఒక్కటే..

కేసీఆర్, వైఎస్ జగన్

జూన్ చివరి వరకు రెండు వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి రాష్ట్రాలకు దాదాపు ఐదు కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇవి రాష్ట్రాల అవసరాలకు ఏమాత్రం సరిపోవు.

  • Share this:
భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దేశవ్యాప్తంగా టీకాలకు కొరత ఏర్పడింది. దీంతో వివిధ రాష్ట్రాలు వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి నేరుగా టీకాలు కొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా గత రెండు వారాల నుంచి వివిధ రాష్ట్రాలు మొత్తం 21 కోట్ల వ్యాక్సిన్ డోసుల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాయి. స్టాక్‌ను బ్యాచ్‌ల వారీగా పంపిణీ చేయడానికి మూడు నుంచి ఆరు నెలల గడువును నిర్ణయించాయి. అయితే వ్యాక్సిన్‌లను ఇప్పటికే ప్రపంచ దేశాలు బుకింగ్ చేసుకుంటున్న నేపథ్యంలో, రాష్ట్రాలకు డోసులు అనుకున్నంత త్వరగా దొరికే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

దేశంలో 18ఏళ్లు నిండిన అందరికీ మే1 నుంచి వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండో దశ కరోనా విజృంభణతో ఎక్కువ మంది టీకాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఫలితంగా ప్రజల నుంచి ఎదురయ్యే ఒత్తిడి, ప్రతికూలతలను తట్టుకోలేక రాష్ట్రాలు డోసుల కోసం గ్లోబల్ టెండర్లను పిలిచాయి.

మొత్తం తొమ్మిది రాష్ట్రాలు
ఇప్పటివరకు కనీసం తొమ్మిది రాష్ట్రాలు వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు జారీ చేశాయి. జులై వరకు 30 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్రం చెబుతోంది. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు 216 కోట్ల డోసులు లభ్యమవుతాయని ప్రకటించినప్పటికీ, రాష్ట్రాలు మాత్రం అప్పటి వరకు వేచి చూడకుండా, బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి.

ఏయే రాష్ట్రాలు ఎన్ని డోసులకు టెండర్లు ఇచ్చాయి?
జూన్ చివరి వరకు రెండు వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి రాష్ట్రాలకు దాదాపు ఐదు కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇవి రాష్ట్రాల అవసరాలకు ఏమాత్రం సరిపోవు. అందువల్ల ఉత్తరప్రదేశ్ నాలుగు కోట్ల డోసులకు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది. తమిళనాడు ఐదు కోట్ల డోసులకు, ఒడిశా 3.8 కోట్ల డోసులకు, కేరళ మూడు కోట్ల డోసులకు, కొన్ని చిన్న రాష్ట్రాలు ఒకటి నుంచి రెండు కోట్ల డోసులకు బిడ్లు ఇచ్చాయి.

18 ఏళ్లు అందరికీ ఇప్పట్లో కష్టమే..
దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 28న ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి సుమారు 6.5 కోట్ల మంది వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్నారు. కానీ వీరిలో ఇప్పటివరకు కేవలం 10 శాతం మందికి మాత్రమే టీకాలు వచ్చాయి. 18-44 కేటగిరీలో గురువారం నాటికి సుమారు 70 లక్షల మందికి మాత్రమే టీకాలు ఇచ్చారు. అంటే ఈ విభాగంలో దాదాపు ఆరు కోట్ల మంది రిజిస్టర్డ్ వ్యక్తులు మొదటి డోస్ కోసం వేచి చూస్తున్నారు. రోజుకు దాదాపు 20 లక్షల మంది వ్యాక్సిన్ మొదటి డోసు కోసం కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.

ఈ లెక్కన చూస్తే.. జులై నాటికి 18-44 ఏజ్ గ్రూపులో మొత్తం రిజిస్ట్రేషన్లు 20 కోట్ల వరకు ఉండవచ్చు. అయితే జులై చివరి నాటికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న టీకాల్లో మొత్తం 13 కోట్ల వరకు మాత్రమే రాష్ట్రాలకు చేరే అవకాశం ఉంది. వీటి ఆధారంగా చూస్తే.. రాష్ట్రాలు 45 పైబడిన వారికి రెండో డోసు ఇవ్వడానికి, 18 ఏళ్లు నిండిన అందరికీ మొదటి డోసు ఇవ్వడానికి చాలా కాలం పడుతుంది. ఈ డిమాండ్‌ను తట్టుకోలేక గ్లోబల్ టెండర్లు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

గత మూడు రోజుల్లో దేశంలో మొత్తం 39 లక్షల మందికి టీకాలు వేశారు. వీరిలో 17 లక్షల మంది (44 శాతం) 18-44 మధ్య వయసు ఉన్నవారే కావడం విశేషం. రెండు డోసుల మధ్య సమయాన్ని కేంద్రం పెంచిన తరువాత, రెండో డోసు కోసం వస్తున్న వారి సంఖ్య తగ్గిపోయింది. ఫలితంగా 45 ఏళ్లు పైబడిన వారికి రెండో డోసు ఇచ్చేందుకు రాష్ట్రాల వద్ద తగిన కోవిషీల్డ్ నిల్వలు ఉన్నాయి. కానీ 18-44 ఏళ్ల వారికి మాత్రం డోసులు అందుబాటులో లేవు. దీనికి తోడు రెండో డోసు కోసం ఇచ్చిన వ్యాక్సిన్లను 18-44 ఏజ్ గ్రూప్ వారికి ఇచ్చేందుకు సైతం కేంద్రం అనుమతించదు. అందువల్ల వీరి కోసం నేరుగా ప్రపంచ మార్కెట్ల నుంచి టీకాలు కొనాలని రాష్ట్రాలు నిర్ణయించాయి.

రాష్ట్రాలపై ఒత్తిడే కారణమా?
18-44 ఏళ్ల విభాగం వరకు మాత్రమే చూస్తే.. తమిళనాడులో ఇప్పటి వరకు కేవలం 41,319 మందికి మాత్రమే టీకాలు వేశారు. కేరళలో ఈ సంఖ్య 7,401గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 4,605 మందికి, తెలంగాణలో 500 మందికి మాత్రమే టీకాలు ఇచ్చారు. ఈ రాష్ట్రాల్లో 18-44 ఏళ్ల మధ్య వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. కానీ ఇప్పట్లో టీకాలు వచ్చే పరిస్థితులు లేవు. అందువల్ల రాష్ట్రాలు తమ ప్రజల కోసం పనిచేస్తున్నాయని చెప్పుకునేందుకు గ్లోబల్ టెండర్లను పిలిచాయని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

దీనికి తోడు వివిధ రాష్ట్రాల మధ్య నెలకొన్న పోటీ వాతావరణం సైతం టెండర్లకు దారితీసినట్లు స్పష్టమవుతోంది. వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలుస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం గత వారం ప్రకటించింది. ఆ తరువాత పంజాబ్‌లో కూడా టెండర్లు పిలవాలని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. తెలంగాణ టెండర్లు పిలిచిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌ కూడా కోటి వ్యాక్సిన్ డోసులకు బిడ్లు ఇచ్చింది. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో చేరాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published:

అగ్ర కథనాలు