అమెరికాలో మళ్లీ లాక్‌డౌన్.. కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ఏమన్నారంటే..

అమెరికాలో మళ్లీ లాక్‌డౌన్.. కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ఏమన్నారంటే..

అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్( ఫైల్ ఫోటో)

Joe Biden: డొనాల్డ్ ట్రంప్ కరోనాను సీరియస్‌గా తీసుకోలేదని విమర్శించిన ఆ దేశ కొత్త అధ్యక్షుడు జో బైడెన్.. అధికారంలోకి వచ్చిన తరువాత కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

 • Share this:
  అధ్యక్ష ఎన్నికల హడావిడిలో పడి చాలామంది అమెరికాలో కరోనా కేసుల తీవ్రత గురించి పెద్దగా పట్టించుకోలేదు. అగ్రరాజ్యంలో ఆ మధ్య కొంత తగ్గినట్టు కనిపించిన కరోనా మహమ్మారి తీవ్రత మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. కొద్దిరోజులుగా మళ్లీ కరోనా కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఓ వైపు కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన ట్రయల్స్‌ వేగంగా జరుగుతున్నా.. వ్యాక్సిన్ ఎప్పటిలోగా ప్రజలకు అందుబాటులోకి వస్తుందనే విషయంలో మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో అమెరికాలో మళ్లీ లాక్‌డౌన్ విధించాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది.

  డొనాల్డ్ ట్రంప్ కరోనాను సీరియస్‌గా తీసుకోలేదని విమర్శించిన ఆ దేశ కొత్త అధ్యక్షుడు జో బైడెన్.. అధికారంలోకి వచ్చిన తరువాత కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే కరోనా కట్టడి కోసం ఆయన లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంటారేమో అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో ఈ అంశంపై జో బైడెన్ స్పందించారు. తాను మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి తనను ఈ ప్రశ్న అడుతున్నారని వ్యాఖ్యానించిన జో బైడెన్.. ఇది ఊహాజనితమైన ప్రశ్న అని అన్నారు.

  తాను సైన్స్‌ను ఫాలో అవుతానని జో బైడెన్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే ఆలోచన తనకు లేదని జో బైడెన్ స్పష్టం చేశారు. కరోనా ప్రతి ప్రాంతం, ప్రతి వర్గంలో భిన్నంగా ఉందని అన్నారు. అందుకే దేశవ్యాప్త లాక్‌డౌన్ అవసరం లేదని తాను భావిస్తున్నట్టు తెలిపారు. దీని కారణంగా మనం ఊహించిన దానికంటే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు కరోనా నియంత్రించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ సజావుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని గతంలో బైడెన్ అన్నారు.

  ఇదిలా ఉంటే అమెరికాలో కరోనా మృతుల సంఖ్య రికార్డు స్థాయిలో 2,50,000కు పెరిగింది. అగ్రరాజ్యంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరగడమే తప్ప తగ్గడం లేదు. కొన్ని వారాల క్రితం కంటే గత వారంలో కేసులు భారీగా పెరిగినట్లు జార్జ్‌ వాషింగ్టన్‌ యునివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ జోనథన్‌ రైనెర్‌ తెలిపారు.కొన్ని వారాల క్రితం వరకు రోజుకు 70 వేలు నుంచి 80 వేల వరకూ కొత్త కేసులు నమోదయితే, ఇప్పుడు రోజుకు లక్షా 55 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయన్నారు. మరణాలు కూడా రోజుకు 1,700 నుంచి 3 వేలకు పెరిగాయని తెలిపారు. పస్తుత శీతాకాల సమయంలో ప్రజలు మరింత దగ్గరగా, గుమిగూడి ఉండే అవకాశమున్నందున కేసులు మరింతగా పెరిగే ప్రమాదముందన్నారు. ప్రజలు నిబంధనలు పాటించాలని, మాస్కులను ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, జాన్స్‌ హోప్కిన్స్‌ యునివర్శిటీ నివేదిక ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 13,49,700 మంది మృతిచెందగా, 5,62,70,000 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు