కరోనా మహమ్మారి ప్రభావం తగ్గకపోవడంతో.. సాధ్యమైనంత తొందరగా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు అన్ని దేశాల్లోనూ జరుగుతున్నాయి. ఇప్పటికే కోట్లాదిమంది కరోనా బారిన పడ్డారు. లక్షలాది మంది మృతి చెందారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వైరస్ మహమ్మారికి అడ్డుకట్ట వెయ్యొచ్చని భావిస్తున్న ప్రపంచదేశాలు.. పలు వ్యాక్సిన్లకు తమ దేశాల్లో అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపాయి. ఈ జాబితాలో మొదటగా నిలిచింది బ్రిటన్. ఓ వైపు కొత్త రకం కరోనా వైరస్ దెబ్బకు విలవిల్లాడుతున్న బ్రిటన్.. ఫైజర్ వ్యాక్సిన్‌కు మొదటగా అత్యవసర అనుమతి ఇచ్చింది. ఫైజర్ టీకాకు అత్యవసర అనుమతి ఇవ్వడంతో ఆ దేశంలో డిసెంబర్ 8 నుంచి వ్యాక్సినేషన్ చేయడం మొదలుపెట్టారు.
ఆ తరువాత అమెరికాలో వ్యాక్సినేషన్‌కు అనుమతి లభించింది. అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్‌తో పాటుగా మోడెర్నా టీకాకు కూడా అనుమతులు లభించాయి. వీటితోపాటు కెనడా, రష్యా, ఇజ్రాయిల్, మెక్సికో, బహ్రెయిన్, చైనా, స్విట్జర్లాండ్, ఈయూ లు అత్యవసర అనుమతి కింద వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చాయి. అయితే మనదేశంలో ఇంకా వ్యాక్సిన్ లకు అత్యవసర వినియోగం కింద అనుమతులు లభించలేదు. సీరమ్, భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు ఇండియాలో కరోనా టీకా అత్యవసర వినియోగానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నెలాఖరు నాటికి వీటికి అనుమతి లభించవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే జనవరి నుంచి ఇండియాలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా.. అమెరికాలో ఇప్పటి వరకు పది లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ తెలిపారు. పది రోజలు కిందట టీకా పంపిణీ ప్రారంభం కాగా.. మొదటి విడత మోతాదును మిలియన్ జనాభాకు వేసినట్లు రెడ్‌ఫీల్డ్ బుధవారం తెలిపారు. అదే సమయంలో టీకా అందరికీ అందుబాటులోకి వచ్చే వరకు ఫేస్‌మాస్క్‌లు ధరించడంతో పాటు నిబంధనలు పాటించాలని ఆయన అమెరిక్లను కోరారు.
ఇటీవల ఎఫ్‌డీఏ ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివరి వరకు పది మిలియన్ల జనాభాకు రెండు వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని యూఎస్ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఫైజర్, మోడెర్నా నుంచి వందల మిలియన్ల మోతాదులను ఆర్డర్ చేశారు. ప్రస్తుతం మొదటి విడత డోసు ఇస్తుండగా.. కొద్ది రోజుల తర్వాత బూస్టర్ డోసు ఇవ్వనున్నారు.