కరోనా వైరస్ వచ్చిన కొత్తలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చిన్నప్పుడు బయటకు వెళ్తే బూచోడు వచ్చి పట్టుకుని వెళ్లిపోతాడంటూ అమ్మ చెప్పిన కథలను గుర్తు చేసేలా, అమ్మో బయటకు వెళితే కరోనా బూచి పట్టేస్తుందంటూ ఇళ్లలోనే గడిపారు. కానీ, కాలక్రమం గడిచేకొద్దీ మనుషుల్లో ధైర్యం వచ్చింది. కరోనా అంటే భయం పోయింది. కరోనా గురించి భయపడకపోవడం మంచిదే. ఆ మాత్రం ధైర్యం ఉంటేనే మనం బతకగలం. కానీ, కరోనాను లైట్ తీసుకుంటే మాత్రం డేంజర్. ఎంత డేంజర్ అనేది ఈ స్టోరీ చదివితే మీకు అర్థం అవుతుంది.
కరోనా లాక్ డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత హోటళ్లు కూడా తెరుచుకోవడం ప్రారంభమయ్యాయి. ప్రజలు కూడా నెలల తరబడి ఇంటి ఫుడ్ తినీ తినీ బోర్ కొట్టిన వారు సరదాగా అలా బయటకు వెళ్లి లంచ్ చేద్దాం, డిన్నర్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు కూడా అలాగే చేస్తున్నారా? బయటకు వెళ్లి హోటళ్లలో ఎంజాయ్ చేస్తున్నారా? అయితే, మీరు డేంజర్లో పడతారు. ఎందుకంటే, తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో ఓ కొత్త విషయం వెలుగుచూసింది. అదేంటంటే, విమానంలో తిరగడం కంటే బయట హోటళ్లు, రెస్టారెంట్లలో డిన్నర్లు చేయడం డేంజర్. దాని వల్ల కరోనా వ్యాపించే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంది.
విమానాల్లో ప్రయాణించే వారిని తప్పకుండా కరోనా నివారణ చర్యలు పాటించేలా చేస్తే వారికి కోవిడ్ 19 వైరస్ వ్యాపించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ, హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లే వారి విషయంలో ఆ వైరస్ సంక్రమించే అవకాశాలు కొంచెం ఎక్కువే. విమానాల్లో ప్రయాణించే వారి కంటే హోటళ్లు, రెస్టారెంట్లలో డిన్నర్లు చేసే వారికి కరోనా సోకే అవకాశాలు ఎక్కువని హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు తెలిపారు.
తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడం, మాస్క్ పెట్టుకోవడం లాంటివాటిని విమాన ప్రయాణికులకు కచ్చితంగా అమలు చేసినట్టు హార్వర్డ్ సర్వేలో గుర్తించారు. అలాగే, విమానంలోకి స్వచ్ఛమైన గాలి వచ్చేలా, వెంటలేషన్ ఉండేలా చూశారు. అలాగే, విమానాశ్రయాలను శుభ్రం చేయడం ద్వారా కరోనాను నియంత్రించారు. ప్రజలకు కరోనా వైరస్ గురించి తెలిసేలా చెప్పడం వారిలో అవగాహన పెంచడం ద్వారా కూడా కరోనాను నియంత్రించారు. కాబట్టి, ఈసారి బయటకు వెళ్లి లంచ్‌లు, డిన్నర్లు చేయాలనుకుంటే మాత్రం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బయట భోజనం చేయడం కంటే విమానంలో ప్రయాణం చేయడం సురక్షితంగా మారింది.
భారత్‌లో కరోనా వైరస్ విజృంభించిన సమయంలో మే 23 నుంచి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించలేదు. కానీ, విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకుని వచ్చేందుకు మాత్రం ప్రత్యేక సర్వీసులను నడిపింది. అయితే, కరోనా వైరస్ లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా డొమెస్టిక్ విమాన సర్వీసులను మాత్రం పునరుద్ధరించింది. భారతదేశంలో ప్రజలు విమానప్రయాణాలు చేయడానికి అవకాశం కల్పించింది.
ఇక ఇండియాలో నిన్న 48,268 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 81,37,119కి చేరింది. అలాగే నిన్న కరోనాతో 551 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,21,641కి చేరింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంది.