కరోనా మహమ్మారిపై భారత్ యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు ముందు వరుసలో ఉండి పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావంగా మోదీ పిలుపు మేరకు చప్పట్లు కొట్టి దేశ ప్రజలు అభినందించారు. తాజాగా దేశ త్రివిధ దళాలు సైతం కరోనా పోరాట యోధులకు సంఘీభావంగా ఈ ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతోంది. శుక్రవారం త్రివిధ దళాధిపతులతో కలిసి మీడియాతో మాట్లాడిన చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) బిపిన్ రావత్.. కరోనా పోరాట యోధులకు ధన్యవాదాలు తెలిపారు. కలసికట్టుగా మనమంతా కరోనాపై గెలుస్తామన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. అనంతరం ఆదివారం నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమాలను ప్రకటించారు.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. కరోనా పోరాట యోధులకు సంఘీభావంగా మే 3న ఎయిర్‌ఫోర్స్ విమానాలు శ్రీనగర్ నుంచి తిరువనంతపురం.. అస్సాంలోని డిబ్రూగఢ్ నుంచి గుజరాత్‌లోని కచ్ వరకు చక్కర్లు కొట్టి పలు ప్రాంతాల్లో పూలు జల్లుతాయి. మే 3న సాయంత్రం దేశ తీరాల్లో యుద్ధ నౌకలపై దీపాలు వెలిగిస్తారు. నేవీ హెలికాప్టర్లు ఆకాశం నుంచి కోవిడ్ ఆస్పత్రులపై పూలు జల్లుతాయి. అంతేకాదు కోవిడ్ వారియర్స్‌కు సంఘీభావంగా ఆర్మీ మౌంటెయిన్ బ్యాండ్ మోగిస్తారు. మే 3న పోలీస్ స్మారకాల వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఇక రెడ్ జోన్స్‌లో పోలీసులు బాగా పనిచేస్తున్నారని.. ప్రస్తుతానికి ఆర్మీని మోహరించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు CDS బిపిన్ రావత్.
Published by:Shiva Kumar Addula
First published:May 01, 2020, 20:05 IST