కూలీల కోసం బస్సులు కాదు, ఏకంగా విమానం బుక్ చేసిన సోనూ సూద్

కేరళలో ఉన్న వలస కూలీలను ఒడిశాలోని సొంత గ్రామాలకు చేర్చడం కోసం సోనూ సూద్ ఏకంగా ఓ విమానాన్ని ఏర్పాటు చేశాడు.

news18-telugu
Updated: May 29, 2020, 3:26 PM IST
కూలీల కోసం బస్సులు కాదు, ఏకంగా విమానం బుక్ చేసిన సోనూ సూద్
సోనూ సూద్ (Twitter/Sonu Sood)
  • Share this:
నటుడు సోనూసూద్ అంటే వలస కూలీల పాలిట ఓ హీరో. అన్నా.. మేం ఫలానా చోట చిక్కుకుపోయాం అని అతడికి సమాచారం అందిస్తే చాలు ఎలాగైనా వారిని ఇంటికి చేరుస్తూ వారి పాలిట దైవంలా మారుతున్నాడు. వలస కూలీలను ప్రత్యేక బస్సుల్లో వారి సొంత గ్రామాలకు చేరుస్తున్నాడు. ఈ క్రమంలో సోనూ సూద్ గురించి సోషల్ మీడియా మొత్తం పొగడ్తల్లో ముంచెత్తుతోంది. తాజాగా సోనూసూద్ చేసిన పని చూసి మరింత ముక్కున వేలు వేసుకోవాలి. ఎందుకంటే, వలస కూలీలను సొంత గ్రామాలకు చేర్చడం కోసం అతడు ఏకంగా ఓ విమానాన్ని ఏర్పాటు చేశాడు. కేరళలోని ఎర్నాకుళంలో ఓ కుట్టుమిషన్ల కంపెనీలో పనిచేస్తున్న 177 మంది మహిళలు తమ సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లాలంటూ సోనూసూద్‌ను సాయం కోరారు. ఆ విషయం తెలిసిన వెంటనే వారి కోసం ఓ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశాడు. ‘తెలిసిన వారి ద్వారా మహిళలు చిక్కుకుపోయిన విషయం నా దృష్టికి వచ్చింది. నేను వారికి సాయం చేయగలనని అర్థమైంది. అందుకు ఉన్న ఒకే మార్గం ఏంటంటే, వారిని విమానంలో తరలించడం.’ అని సోనూసూద్ సీఎన్ఎన్ న్యూస్ 18కి తెలిపాడు.

కరోనా వైరస్ కారణంగా విమానాశ్రయాల్లో కూడా ప్రయాణికుల సంఖ్యపై పరిమితులు విధిస్తున్నారు. అది మరో ఆటంకంగా మారింది. సోనూ సూద్‌కు తెలిసిన నీతి గోయల్ అనే వ్యక్తి ద్వారా కేరళ, ఒడిశా ప్రభుత్వాలతో మాట్లాడి కొచ్చి, భువనేశ్వర్ విమానాశ్రయాల్లో విమానం ఎక్కి, దిగే ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు సోనూసూద్ ప్రత్యేకంగా బుక్ చేసిన ఎయిర్ ఏసియా విమానం బెంగళూరు నుంచి కోచి వెళ్లింది. అక్కడి నుంచి 177 మంది మహిళలను తీసుకుని భువనేశ్వర్‌లో దింపింది. ఆ తర్వాత వారు అక్కడి నుంచి కేంద్రపార జిల్లాలో తమ తమ సొంత గ్రామాలకు వెళ్లే ఏర్పాట్లు కూడా చేశారు. 180 సీట్ల విమానం బుక్ చేయడానికి కనీసం రూ.20 లక్షలు ఖర్చు అవుతుందని విమానయాన వర్గాలు చెప్పాయి.
First published: May 29, 2020, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading