కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజూకీ పెరుగుతోంది. కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు విధించిన లాక్డౌన్.. దాదాపు అన్నిరంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా ఎంతోమంది తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. వీధుల్లో చిరువ్యాపారాలు చేసుకునే వారి దగ్గరి నుంచి ఏసీ గదుల్లో కూర్చుని హాయిగా పనిచేసుకునే వారి వరకు అందరిపైనా కరోనా ప్రభావం పడింది. విద్యాలయాలు.. దేవాలయాలు.. న్యాయస్థానాలనే తేడా లేకుండా అన్నీ మూతపడ్డాయి. అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించడం మినహా మిగతా కేసులన్నీ న్యాయస్థానాలు వాయిదా వేస్తున్నాయి. దీంతో చిన్నచితకా కేసులు వాదించుకుంటూ పొట్టపోసుకునే న్యాయవాదులకు పని లేకుండా పోయింది. దీంతో అనేకమంది రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో ఓ న్యాయవాది తన ఉపాధి పోయింది.. బతుకు భారమయ్యింది. నాకు బతికేందుకు ఉపాధి కల్పించాలంటూ ఏకంగా కోర్టు ముందే నగ్నంగా ధర్నాకు దిగాడో న్యాయవాది.
ఈ ఘటన తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. విరుదునగర్ జిల్లా ఆండాళ్పురానికి చెందిన మణికంఠన్(36) న్యాయవాదిగా సాత్తూరు కోర్టులో కేసులు వాదించుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో కోర్టు వ్యవహారాలు నిలిచిపోయాయి. ఫలితంగా అతడికి ఏ పనీ లేక ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. వేరే పని చేసేందుకు ప్రయత్నించినా.. ఎక్కడా పని లభించలేదు. దీంతో మణికంఠన్ ఏం చేయాలో తెలియక సాత్తూరు ప్రధానరోడ్డులోని కోర్టు ఎదుట గురువారం(జూలై 30న) నగ్నంగా కూర్చోని ఆందోళనకు దిగాడు.
న్యాయవాది నగ్నంగా ఆందోళన చేస్తున్నాడనే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. న్యాయవాది వద్దకు చేరుకుని సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. అయితే శుక్రవారం(జూలై 31)లోపు తనకు ఉపాధి కల్పించకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించాడు. అయితే దాదాపుగా లాయర్లందరీ పరిస్థితి ఇదే. వారంతా రోడ్డు ఎక్కితే పరిస్థితి ఏంటని పోలీసులు చర్చించుకుంటున్నారు.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.