ఒక్క వ్యాపారి వల్ల వందల మందికి కరోనా టెన్షన్... అందరికీ టెస్టులు...

కరోనాతో వచ్చిన అతి పెద్ద సమస్య... అది ఎవరి నుంచి ఎవరికి సోకుతుందనే అంశమే. ఈజీగా స్ప్రెడ్ అవుతున్న వైరస్... ఒకరికి సోకినా... చాలా మందికి టెస్టులు చెయ్యాల్సి వస్తోంది.

news18-telugu
Updated: June 29, 2020, 11:29 AM IST
ఒక్క వ్యాపారి వల్ల వందల మందికి కరోనా టెన్షన్... అందరికీ టెస్టులు...
ఒక్క వ్యాపారి వల్ల వందల మందికి కరోనా టెన్షన్... అందరికీ టెస్టులు...
  • Share this:
అసోంలో అతనో కూరగాయల వ్యాపారి. ఈమధ్య దగ్గు రావడం మొదలైంది. ఇంట్లో వాళ్లు అనుమానాస్పదంగా చూశారు. చట్నీతో అన్నం తిన్నాను కదా... కాస్త వేడి చేసినట్లుంది అన్నాడు. సరేలే జాగ్రత్త అన్నారు. నాకేం కాదు... అంటూ... కూరగాయలు అమ్మేందుకు బయల్దేరాడు. అలా అమ్ముతుంటే... ఓ చోట... పోలీసులు చూశారు. "ఏవయ్యా పెద్దాయన... దగ్గుతున్నావు... ఏమైంది... ఆరోగ్యం బాలేదా" అన్నారు. రెండ్రోజులుగా వేడి చేసి దగ్గు వస్తోంది అన్నాడు. "వేడా... మరి కరోనా టెస్టు చేయించుకున్నావా" అని అడిగితే... "లేదు సారూ... నాది మంచి శరీరం... నాకు రోగాలేవీ రావు. చూడండి... ఈ వయసులో కూడా దిట్టంగా ఉన్నా" అంటూ మళ్లీ దగ్గాడు.

కావచ్చు... ఆరోగ్యం బాగుంటే మంచిదే. కానీ... కంటిన్యూగా దగ్గు వస్తోంది కదా... పద... టెస్టు చేయిస్తా... అంటూ ఓ సెంటర్‌కి తీసుకెళ్లి... శాంపిల్ టెస్టు చేయించాడు. "ఓ మూడ్రోజులు కూరగాయలు అమ్మకు. టెస్టు రిజల్ట్ వచ్చే వరకూ ఇంట్లోనే ఉండు. రెస్టు తీసుకో" అని పోలీస్ మరీ మరీ చెప్పాడు. "సరే సారూ... అలాగే... మీరు నా మంచి కోసమేగా చెబుతున్నారు" అంటూ బండి వెనక్కి తిప్పాడు... ఇంటికి వెళ్తూ... దారిలో కూరగాయలు అమ్ముకుంటూ వెళ్లాడు.

మర్నాడు మళ్లీ కథ మామూలే. నాకేం కాదు అంటూ... "ఇంట్లోనే ఉంటే... కూరగాయలు పాడైపోతాయి. అదిగో... ఆ టమాటాలు చూడు... అప్పుడే మచ్చలొచ్చేస్తున్నాయ్" అంటూ బయల్దేరాడు. ఈసారి రోజూ వెళ్లేవైపు వెళ్లలేదు. అక్కడ పోలీస్ ఉన్నాడని... రూట్ మార్చి వేరేవైపు వెళ్లాడు. ఇలా రెండ్రోజులు చేశాడు.

మూడో రోజు రిపోర్ట్ వచ్చింది. కూరగాయల వ్యాపారికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ రిపోర్ట్ చూసిన పోలీసు షాక్ అయ్యారు. ఆఘమేఘాలపై ఆ కూరగాయల వ్యాపారి ఇంటికి వెళ్లి... ఇంట్లో రెస్టు తీసుకుంటున్నాడా అని అడిగితే... కూరగాయలు అమ్మేందుకు బయటకు వెళ్లాడని చెప్పారు. అంతే... పోలీసు మళ్లీ షాక్ అయ్యారు. ఆయనకు ఫోన్ చేసి... అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పారు. ఇంటికి వచ్చాక అసలు విషయం చెప్పారు. ఆయన్ని ఆస్పత్రిలో చేర్చారు.

ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే... ఆ మూడ్రోజుల్లో ఆయన... కొన్ని వందల మందికి కూరగాయలు అమ్మాడు. అసోంలో ఆదివారం రాత్రి నుంచి 14 రోజులు తిరిగి లాక్‌డౌన్ విధించడంతో... ఎక్కువ మంది కూరగాయలు కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్లలో ఎంత మందికి కరోనా వ్యాపించిందో అనే టెన్షన్ పోలీసులకు పట్టుకుంది. ఎక్కడెక్కడ అమ్మాడో మొత్తం వివరాలు తెలుసుకొని... టెస్టింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇందులో ఎవర్ని తప్పుపట్టాలి... పేదరికం ఆ పెద్దాయనను ఇంట్లో ఉండనివ్వలేదు. ఇటు చూస్తే కరోనా ఎవరికి సోకిందో అనే సమస్య. ఈ వైరస్ వల్ల ఇలాంటి ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి.
First published: June 29, 2020, 11:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading