కరోనా వైరస్ గురించి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. కేవలం కరోనాకు వ్యాక్సిన్‌ను తీసుకురావడానికి ప్రయోగాలు మాత్రమే కాకుండా వైరస్ వ్యాప్తి, నియంత్రణ.. ఇలా చాలా రకాలు పరిశోధనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో కరోనా బారినుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినవారి ఆరోగ్యం భవిష్యత్తులో ఎలా ఉంటుందనే దానిపై కూడా పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. యూకేకు చెందిన పరిశోధకులు చేసిన చిన్నపాటి అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. కరోనా నుంచి కోలుకున్నవారిలో సగానికిపైగా కొన్ని నెలలపాటు వైరస్ లక్షణాలను అనుభవిస్తున్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు. శ్వాసతీసుకోవడం, అలసట, ఆందోళన, నిరాశ వంటి లక్షణాలు వారిలో కనిపిస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ పరిశోధనను ఇతర శాస్త్రవేత్తలు సమీక్షించకపోయినప్పటికీ.. సమీక్షకు ముందే మెడ్‌రెక్సివ్ వెబ్సైట్లో ప్రచురించారు.
58 మంది పెషేంట్లలో కరోనా వైరస్ ప్రభావం చాలా కాలం ఉందని బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల తెలిపారు. కరోనా బారిన పడ్డ పెషేంట్ల పలు అవయవాల్లో అసమానతలు ఉన్నట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు.. కొన్ని నెలలపాటు వారు సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఈ పరిశోధనలు.. కోవిడ్-19 బారినపడిన శారీరక ప్రక్రియలను మరింత అన్వేషించాల్సిన అవసరాన్ని తెలిపాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రాడ్‌క్లిఫ్ విభాగానికి చెందిన బెట్టి రామన్ అన్నారు. కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన పెషేంట్లు పాటించాల్సిన సమగ్రమైన క్లినికల్ కేర్‌ను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.
ఇక, ఆక్స్ఫర్డ్ స్టడీ ఫలితాల్లో.. కరోనా సోకిన రెండు నుంచి మూడు నెలల తర్వాత కూడా.. 64 శాతం మంది శ్వాస తీసుకోవడం ఇబ్బందులు పడుతున్నారని, 55 శాతం మంది తీవ్ర అలసటకు గురవుతున్నారని తేలింది. అలాగే కోవిడ్ రోగుల ఎంఆర్ఐ స్కానింగ్స్‌లో 64 శాతం మంది ఊపిరితిత్తులలో, 29 శాతం మందికి కిడ్నీలలో, 26 శాతం మందికి హృదయాల్లో, 10 శాతం మందికి కాలేయంలో అసాధారణ ఫలితాలు వచ్చాయని పేర్కొంది. ఈ అసాధారణ ఫలితాల బట్టి చూస్తే.. కరోనా అవయవాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని అర్థమవుతుందని రామన్ అన్నారు. ఇది దీర్ఘకాలిక నష్టాన్ని చేకూర్చే సంభావ్యతను సూచిస్తుందని తెలిపారు.
గత వారం బ్రిటన్‌లోని నేషన్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ రీసెర్చ్ ప్రచురించిన నివేదిక కూడా ఇదే రకమైన విషయాన్ని తెలిపింది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. దీనిని లాంగ్ కోవిడ్ అంటారని చెప్పింది. కరోనా లక్షణాలు శరీరంలోని అవయవాలు, మైండ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడింది.