కోవిడ్-19 పరీక్షలో అపశ్రుతి... మహిళ మెదడు స్రావాలు లీక్

కోవిడ్-19 పరీక్షలో అపశ్రుతి... మహిళ మెదడు స్రావాలు లీక్

ప్రతీకాత్మక చిత్రం

కరోనా పరీక్షల సామర్థ్యంపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు నెలకొన్నాయి. సరైన శిక్షణ లేని ఆరోగ్య కార్యకర్తలతో పరీక్షలు చేపిస్తుండటంతో ఫలితాల్లో తేడాలు వస్తున్నాయని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

  • Share this:
కరోనా పరీక్షల సామర్థ్యంపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు నెలకొన్నాయి. సరైన శిక్షణ లేని ఆరోగ్య కార్యకర్తలతో పరీక్షలు చేపిస్తుండటంతో ఫలితాల్లో తేడాలు వస్తున్నాయని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో కరోనా టెస్ట్ చేపించుకునేందుకు వెళ్లిన ఒక మహిళకు అనుకోని ప్రమాదం జరిగింది. ఆమె ముక్కు నుంచి శాంపిల్స్ తీస్తున్న క్రమంలో స్వాబ్ మెదడు పొరకు తగిలింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మెడికల్ జర్నల్ గురువారం ప్రచురించింది.

మహిళ ముక్కు నుంచి లోతుకు వెళ్లిన స్వాబ్ దురదృష్టవశాత్తూ మెదడు పొరను పంక్చర్ చేసింది. దీంతో ఆమె ముక్కు నుంచి మెదడులో ఉండే స్రావాలు బయటకు వచ్చాయి. ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. 40ల మధ్య వయసు ఉన్న ఆ మహిళ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు అంచనా వేయలేకపోతున్నరు. కరోనా టెస్టింగ్ స్వాబ్ వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగడం చాలా అరుదు అని వారు పేర్కొన్నారు.

జాగ్రత్తలు తీసుకోవాలి
హెల్త్ కేర్ కార్యకర్తలు కరోనా టెస్ట్ ప్రోటోకాల్స్‌పై జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సైనస్ సమస్య ఉన్నవారు, స్కల్ బేస్ సర్జరీ చేయించుకున్న వ్యక్తులు ముక్కు నుంచి తీసే స్వాబ్ టెస్ట్లకు బదులుగా నోటి నుంచి శాంపుల్స్ తీసుకునే పరీక్షలు చేయించుకోవాలని మెడికల్ జర్నల్ సీనియర్ ఆథర్ జర్రెట్ వాల్ష్ సూచిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ అయోవా హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్న వాల్ష్ బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. కరోనా పరీక్షలు చేసేవారికి తగిన శిక్షణ ఇవ్వాలని న్యూయార్క్ కు చెందిన ఈఎన్టీ నిపుణుడు డెన్నిస్ క్రాస్ తెలిపారు. కరోనా టెస్ట్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ప్రమాదం ఎలా జరిగింది?
ఎలిక్టివ్ హెర్నియా సర్జరీ చేయించుకోవాలనుకున్న సదరు మహిళ... కరోనా పరీక్షల కోసం వెళ్లిందని డాక్టర్ వాల్ష్ చెబుతున్నారు. ఆ సమయంలో జరిగిన ప్రమాదం వల్ల ఆమె ముక్కుకు ఒక వైపు రంధ్రం నుంచి ద్రవం వచ్చిందని ఆయన వివరించారు. ఆ తరువాత తలనొప్పి, వాంతులు, మెడ కండరాలు గట్టిపడటం, కాంతిని చూడలేకపోవడం వంటి సమస్యలతో బాధ పడింది. మొదటి సారి శాంపిల్స్ కోసం స్వాబ్ తీసుకున్నప్పుడు ప్రమాదం జరగలేదని ఆ మహిళ చెబుతోంది. రెండవ సారి శాంపిల్స్ సేకరిస్తున్నప్పుడు స్వాబ్ను ఆమె ముక్కు నుంచి బలంగా లోపలికి నొక్కినట్టు తెలుస్తోందని వాల్ష్ వివరించారు.

ఇంతకు ముందే సమస్యలున్నాయా?
గతంలోనే బాధితురాలికి ఇంట్రాక్రానియల్ హైపర్టెన్షన్ కోసం చికిత్స చేశారు. ఈ సమస్య ఉన్నవారిలో మెదడును రక్షించే సెరెబ్రోస్పానియల్ ద్రవం నుంచి ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. చికిత్సలో భాగంగా షెంట్ టెక్నిక్ ద్వారా వైద్యులు కొంత ద్రవాన్ని తీసివేశారు. ఆ తరువాత ఆమె పరిస్థితి మెరుగుపడింది. కానీ దీని ద్వారా ఆమెకు ఎన్సెఫలోసెల్ అనే కొత్త సమస్య ఎదురైంది. ఈ సమస్య వల్ల మెదడు పొర ముక్కులోకి పొడుచుకువస్తుంది. దీంతో ఇలాంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువ. జూలైలో ఈ లోపాన్ని గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆ తరువాత ఆమె పూర్తిగా కోలుకుంది.

ఆమె ఆరోగ్యం ఎలా ఉంది?
తాజాగా ఆమెకు మరోసారి ప్రమాదం జరగడం పట్ల వాల్ష్ ఆందోళనన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన తరువాత ఆమెలో గుర్తించిన లక్షణాలు మెదడు పొరకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల వల్లే వచ్చినట్టు ఆయన చెబుతున్నారు. ఈ సమస్యకు చికిత్స చేయకపోతే ఆమె ముక్కు నుంచి మెడడు వరకు వెళ్లగలిగే బ్యాక్టీరియా నుంచి ప్రాణానికి ప్రమాదం ఏర్పడొచ్చని ఆయన తెలిపారు. గాలి పుర్రెలోకి ప్రవేశించి మెదడుపై అధిక ఒత్తిడిని కలిగించే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. కరోనా పరీక్ష ప్రోటోకాల్ ప్రకారం, ముక్కు రంధ్రం కింది వైపు భాగం నుంచే టెస్ట్ శాంపిల్స్ సేకరించాలి. దాన్ని పైకి గట్టిగా నొక్కితే ఇలాంటి సమస్యలే ఏర్పడతాయి. ఇది చాలా అరుదైన సంఘటన అయినప్పటికీ వాలంటీర్లకు కరోనా పరీక్షల శిక్షణ ఇవ్వాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తుందని వాల్ష్ చెప్పారు.
Published by:Sumanth Kanukula
First published:

అగ్ర కథనాలు