Corona: ఈ ప్రపంచంలో కరోనా గురించి తెలియనిది ఇతనొక్కడికే.. అదృష్టం ఆ రూపంలో..

జోసెఫ్ ఫ్లావిల్ (Image : Twitter)

అతడు కోమాలోకి వెళ్లిన వారం రోజులకే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 విజృంభించింది. ఫలితంగా, నెలల పాటు ప్రపంచం స్థంభించిపోయింది. దాదాపు 10 నెలల పాటు కోమాలో ఉన్న జోసఫ్ ఫ్లావిల్ ఎట్టకేలకు ఇప్పుడు కోలుకొని మేల్కొన్నాడు.

  • News18
  • Last Updated :
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట చైనాలో బయటపడ్డ ఈ వైరస్ క్రమంగా అన్ని దేశాలకు పాకింది. కరోనా సోకి లక్షలాది మంది తమ ప్రాణాలను కోల్పోయారు. దీని కారణంగా మానవ జీవన విధానమే మారిపోయింది. కరోనా తెచ్చిన మార్పులను ప్రతి ఒక్కరం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. లాక్డౌన్లు, మాస్క్ లు, శానిటైజర్లతో 2020 ఏడాదంతా గడిచిపోయింది. అయితే, ఇంగ్లండ్ కు చెందిన ఒక యువకుడు మాత్రం వీటన్నింటికీ దూరంగా ఉన్నాడు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును.. ఇంగ్లండ్‌లోని స్టాఫోర్డ్‌షైర్‌కు చెందిన జోసఫ్ ఫ్లావిల్ అనే 19 ఏళ్ల కుర్రాడు 2020 మార్చి 1న కారు ప్రమాదంలో కోమాలోకి వెళ్లాడు. అతడు కోమాలోకి వెళ్లిన సమయంలో యూకేలో కేవలం 23 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి.

అయితే ఆ సమయంలో కరోనా అనేది ఇంకా విస్తృతమవ్వలేదు. అతడు కోమాలోకి వెళ్లిన వారం రోజులకే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 విజృంభించింది. ఫలితంగా, నెలల పాటు ప్రపంచం స్థంభించిపోయింది. దాదాపు 10 నెలల పాటు కోమాలో ఉన్న జోసఫ్ ఫ్లావిల్ ఎట్టకేలకు ఇప్పుడు కోలుకొని మేల్కొన్నాడు. ఇప్పుడు అతనికి ప్రపంచమంతా కొత్తగా కనిపిస్తోంది. కరోనా గురించి ఏమీ తెలియని జోసెఫ్ కు ఎలా వివరించాలని అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

దీనిపై జోసఫ్ అత్త కేట్ యార్బో మాట్లాడుతూ "దాదాపు 10 నెలల తర్వాత జోసఫ్ కోమా నుండి బయటపడ్డాడు. దీని పట్ల మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే, కరోనా గురించి అతనికి ఏమాత్రం తెలియదు. దీన్ని గురించి ఎలా వర్ణించాలో మాకు అర్థం కావడం లేదు." అని అన్నారు. జోసఫ్ ఫావిల్ క్రికెట్, హాకీ క్రీడల్లో ఛాంపియన్. అతడు కోమాకు ముందే ‘‘డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ యూత్ అచీవ్మెంట్ అవార్డు’’ను గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం 2020 మే నెలలోనే బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను సందర్శించాల్సి ఉంది. అయితే, 2020 మార్చి 1న కారులో ప్రయాణిస్తుండగా వేగంగా ఒక వాహనం వచ్చి ఢీకొట్టడంతో అతని తల వెనుక భాగంలో గాయమై కోమాలోకి వెళ్లాడు. వెంటనే అతన్ని సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌లోని ఆసుపత్రికి తరలించారు.

జోసెఫ్ ఫ్లావిల్ (ఫైల్) (Image : Twitter)


10 నెలల తర్వాత కోమా నుంచి బయటపడ్డ యువకుడు..

కరోనా మార్గదర్శకాలు అమల్లో ఉన్నందున, ఆసుపత్రిలో ఉన్న జోసెఫ్ ఫ్లావిల్ను సంరక్షణకు తన తల్లి షారన్ ఫ్లావిల్ ను తప్ప ఇతరులను అనుమతించలేదు. అతని తల్లి కూడా సోషల్ డిస్టన్స్ పాటిస్తూ దూరం నుంచే సంరక్షించాల్సి వచ్చింది. ఇప్పుడు, కోమా నుంచి అతడు కోలుకోవడంతో అతని కుటుంబ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, యూకేలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమవ్వడంతో మరోసారి లాక్డౌన్ విధించారు. అక్కడ ఇంకా కరోనా నిబంధలను సడలించలేదు.

అయితే, ఇవేవీ తెలియని ఫ్లావిల్కు కరోనా గురించి ఎలా వివరించాలనే ఆందోళనలో ఉన్నారు అతని కుటుంబ సభ్యులు. నర్సులు పీపీఈ కిట్లు ధరించడం, సోషల్ డిస్టన్స్ పాటించడం, మాస్క్లు ధరించడం, శానిటైజర్స్ వాడటం వంటి వన్నీ అతనికి ఒక సైన్స్ ఫిక్షన్ చిత్రం చూస్తూ కూర్చున్నట్లు ఉండవచ్చు అని డాక్టర్లు పేర్కొంటున్నారు. అతనికి ఈ విషయాలను వివరించడం కష్టమైన పని కాబట్టి, కేవలం వార్తా పత్రికలు, సోషల్ మీడియా ద్వారానే అతడు వీటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
Published by:Srinivas Munigala
First published: