కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం భారత్ లోనూ కొనసాగిస్తోంది. ఆఫ్రికా దేశాల నుంచి ప్రయాణించిన పెద్దలతోపాటు పిల్లలకూ కొత్త రకం మహమ్మారి సొకినట్లు నిర్ధారణ అయింది. మన దేశంలో తొలిసారిగా మూడున్నరేళ్ల చిన్నారి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా రెండో వేవ్ లో పెద్దలతోపాటు యువతనూ పెద్ద సంఖ్యలో పొట్టనపెట్టుకున్న డెల్టా వైరస్ కంటే ఐదు రెట్లు ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వాయువేగంతో వ్యాపిస్తుండటం, దాని వల్ల చిన్నపిల్లలూ తీవ్రంగా ప్రభావితం అవుతారనే అంచనాలు, కొత్త వేరియంట్ వల్ల భారత్ లో ఫిబ్రవరి నాటికి కచ్చితంగా మూడో వేవ్ తలెత్తుతుందనే హెచ్చరికల నేపథ్యంలో భయాందోళనలను పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం ఒక ఎత్తయితే, మూడున్నరేళ్ల చిన్నారికి పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు..
ఇండియాలో ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిచిన చిన్నారి కేసు మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. ఆ రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే కొత్తగా ఏడు కేసులు నమోదుకాగా, అందులో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. పుణెలోని వైరాలజీ ఇనిస్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం మహారాష్ట్రలో కొత్తగా ఏడు కేసులు రాగా, అందులో ముంబై నుంచి మూడు, పింప్రీ చించ్వాడాలో నాలుగు కేసులు ఉన్నాయి.
మూడున్నరేళ్ల చిన్నారితోపాటు ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిన ఏడుగురూ టాంజానియా, బ్రిటన్, సౌతాఫ్రికా, నైజీరియాల నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. ఒమిక్రాన్ బారినపడ్డ ఈ ఏడుగురిలో నలుగురు ఇప్పటికే కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు ఉండటం గమనార్హం. కొత్తవాటితో కలిపి మహారాష్ట్రలో మొత్తం కేసులు 17కు చేరగా, రాజస్థాన్ 9. గుజరాత్ 3, కర్ణాటక 2, ఢిల్లీలో1 కేసుతో ఇండియా ఒమిక్రాన్ కౌంట్ 32కు పెరిగింది.
ఒమిక్రాన్ వ్యాప్తి మెల్లగా పెరుగుతోన్న క్రమంలో కేంద్రం ఇటీవలే రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే క్షేత్రస్థాయిలో అవి అసలే అమలు కావడంలేదని నీతి ఆయోగ్(ఆరోగ్యం) సభ్యుడు వీకే పాల్ వాపోయారు. దేశంలో మాస్కులు ధరించే విషయంలో నిర్లక్ష్యం కనబడుతోందని, టీకాలు, మాస్కులు తప్పనిసరి అని అందరూ గుర్తించాలన్నారు. కాగా, దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిన మూడున్నరేళ్ల చిన్నారి సహా 32 మంది ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉందని, అందరిలోనూ స్వల్ప లక్షణాలే ఉన్నాయని, మొత్తం కొవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ శాతం 0.04శాతమేనని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అగర్వాల్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid, India, Maharashtra, Omicron, Omicron corona variant