news18-telugu
Updated: November 11, 2020, 2:32 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి ఎంతగానో ప్రభావితం చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సంవత్సం కరోనావైరస్, కోవిడ్19, లాక్డౌన్ అనే పదాల వాడకం పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. ఎన్నో నిబంధనలను అమలు చేశాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ అనే పదం వాడకం ఎన్నో రెట్లు పెరిగినట్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హార్పర్ కోలిన్స్ (Harper Collins) పబ్లిషర్స్ చెబుతోంది. ఆ సంస్థ ‘లాక్డౌన్’ను వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించింది. 2020 సంవత్సరానికి గానూ పది పదాలను ‘వర్డ్స్ ఆఫ్ ద ఈయర్’గా కోలిన్స్ సంస్థ గుర్తించింది. వీటిలో ఆరు పదాలు కరోనా మహమ్మారికి సంబంధించినవే కావడం విశేషం. కరోనావైరస్, సోషల్ డిస్టెన్సింగ్, సెల్ఫ్ ఐసోలేట్, ఫర్లాఫ్ (furlough), లాక్డౌన్, కీ వర్కర్ (key worker)... ఈ ఆరు పదాలు వర్డ్స్ ఆఫ్ ద ఈయర్ జాబితాలో ఉన్నాయి. ‘కీ వర్కర్’ పదం వాడకం 60 రెట్లు పెరిగినట్లు కోలిన్స్ తెలిపింది.
నిర్వచనం కూడా...2020లో ప్రపంచంపై మహమ్మారి ఆధిపత్యం చెలాయించిందని కోలిన్స్ సంస్థ లాంగ్వేజ్ కన్సల్టెంట్ హెలెన్ న్యూస్టెడ్ చెబుతున్నారు. ‘మనం చేసే పని, చదువుల నుంచి సామాజిక భావనల వరకు ప్రతీ అంశాన్ని కరోనా ప్రభావితం చేసింది. చాలా దేశాలు రెండవ దశ లాక్డౌన్ విధించే స్థాయికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘లాక్డౌన్’ పదానికి వచ్చిన గుర్తింపును గొప్పగా భావించే సందర్భం కాదు ఇది’ అని హెలెన్ తెలిపారు. కోలిన్స్ సంస్థ లాక్డౌన్ పదాన్ని.. ‘ప్రయాణాలు, సామాజిక కార్యక్రమాలు, బహిరంగ కార్యకలాపాలపై ఆంక్షలు విధించడం’ అని నిర్వచించింది.
నిరసనలకు కూడా గుర్తింపు..
కోలిన్స్ డిక్షనరీలో కరోనావైరస్ ను ‘COVID-19 సహా శ్వాసకోశ సమస్యలు, అంటు వ్యాధులకు కారణమయ్యే RNAసహిత వైరస్ సమూహంలో ఒకటి’గా నిర్వచించారు. వైరస్‌తో పాటు ఇతర సామాజిక, రాజకీయ పరిణామాలు కూడా కోలిన్ పదాల జాబితాలో ప్రతిభింబించాయి. ఈ పదాలను ఇప్పటికే ఇంగ్లీష్ డిక్షనరీ ఆన్లైన్ ఎడిషన్లలో చేర్చారు. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి నిరసనగా ‘బ్లాక్ లైవ్స్ మేటర్’ పేరుతో వెల్లువెత్తిన నిరసనలను డిక్షనరీలో చేర్చారు. సోషల్ మీడియాలో BLM హ్యాష్‌ట్యాగ్‌ను ఈ సంవత్సరం ఎక్కువగా ఉపయోగించారు. ఈ పదం వాడకం 581 శాతం పెరిగిందని కోలిన్స్ పబ్లిషర్స్ చెబుతోంది.
సోషల్ మీడియాలో వాడేవి కూడా...
సోషల్ మీడియా ప్రభావం వల్ల డిక్షనరీలో చేరే పదాల సంఖ్య పెరుగుతోంది. ఈ సంవత్సరం కోలిన్స్ కొత్తగా "టిక్‌టాకర్" పదాన్ని కూడా డిక్షనరీలో చేర్చింది. ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘టిక్‌టాక్’లో కంటెంట్‌ను పంచుకునే వారి గురించి వివరిస్తుంది. "Mukbang" పేరుతో దక్షిణ కొరియాలో వీడియో బ్లాగర్లు ఎక్కువ మొత్తంలో తింటూ వీడియోలు చేసే ట్రెండింగ్‌ను కూడా కోలిన్స్ డిక్షనరీలో చేర్చింది. బ్రిటన్ రాజ కుటుంబం నుంచి ప్రిన్స్ హ్యారీ, అతడి భార్య మేఘన్ బయటకు వచ్చిన సందర్భాన్ని సూచించే "Megxit" పదం కూడా ఈ సంవత్సరం కోలిన్స్ గుర్తించిన పదాల జాబితాలో ఉంది. "Brexit" నుంచి కొత్తగా మెగ్జిట్ రూపొందింది. బ్రెగ్జిట్‌ను 2016లో కోలిన్స్ గుర్తించింది. ఈ పదానికి బ్రిటిష్ డిక్షనరీల్లో ఎంతో ప్రాధాన్యం ఉంది.
Published by:
Nikhil Kumar S
First published:
November 11, 2020, 2:30 PM IST