Oxygen Crisis: ఆక్సీజన్ అందక రాత్రికి రాత్రే 20 మంది మృతి.. ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు

ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీలోని చాలా ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి. తాము అడిగింనంత ఆక్సీజన్‌ను ప్రభుత్వం సరఫరా చేయలేకపోతోందని వాపోతున్నారు. ఢిల్లీ ప్రభుత్వమేమో తమ చేతుల్లో ఏమీ లేదని.. అంతా కేంద్రం చేతుల్లోనే ఉందని చెబుతోంది

  • Share this:
    దేశ రాజధాని ఢిల్లీలో మరణ మృదంగం కొనసాగుతోంది. ఆక్సీజన్ లేక కరోనా రోగులు పిట్టల్లా రాలుతున్నారు. ప్రాణ వాయువు సకాలంలో అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి ఆక్సీజన్ అందక 20 మంది పేషెంట్లు చనిపోయారు. రాత్రికి రాత్రే అంతక మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ డీకే బలూజా తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో 200 మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. అందులో 160 మందికి ఆక్సీజన్ సపోర్టుతో ట్రీట్‌మెంట్ అందుతోంది. 35 మంది ఐసీయూలో ఉన్నారు. ఐతే శుక్రవారం సాయంత్రం 05.30 ఆస్పత్రికి ఆక్సీజన్ రావాల్సి ఉంది. కానీ సకాలంలో సరఫరా చేయలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత ట్యాంకర్లు వచ్చాయి. అప్పుడు కేటాయించిన దానిలో 40శాతం మాత్రమే అందింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆక్సీజన్ కొరతతో 20 మంది రోగులు కన్నుమూశారు.

    ''ఎవరూ ఎలాంటి హామీ ఇవ్వలేదు. సాధ్యమైనంత ప్రయత్నం చేస్తామని మాత్రమే చెబుతున్నారు. ఆస్పత్రిలో ఆక్సీజన్ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోగులను ఎలా కాపాడగలం.'' అని డాక్టర్ డీకే బలూజా పేర్కొన్నారు. ఇదొక్కటే కాదు.. ఢిల్లీలోని చాలా ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి. తాము అడిగింనంత ఆక్సీజన్‌ను ప్రభుత్వం సరఫరా చేయలేకపోతోందని వాపోతున్నారు. ఢిల్లీ ప్రభుత్వమేమో తమ చేతుల్లో ఏమీ లేదని.. అంతా కేంద్రం చేతుల్లోనే ఉందని చెబుతోంది. వారు పంపిస్తేనే.. మేం ఆస్పత్రులకు సరఫరా చేయగలమని వెల్లడించింది.

    దేశంలో ఆక్సీజన్ కొరత, కరోనా విజృంభణపై.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆక్సీజన్ గురించి ప్రధాని మోదీతో ఢిల్లీ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలుచేశారు. ఢిల్లీలో ఆక్సీజన్ కొరతలేదని.. ఆక్సీజన్ కావాలంటే ఎవరిని సంప్రదించాలో స్పష్టత ఇవ్వాలని అడిగారు. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వస్తున్న ట్యాంకర్లను ఆపేస్తున్నారని.. దీని గురించి ఎవరికి కేంద్ర ప్రభుత్వంలో ఎవరికి ఫిర్యాదు చేయాలో చెప్పండని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజల దుర్భర పరిస్ధితులను కేంద్రం అర్ధం చేసుకోవాలని.. ఆస్పత్రులకు సరిపడా ఆక్సీజన్‌ను పంపించాలని విజ్ఞప్తి చేశారు.

    ఆక్సీజన్‌ను సకాలంలో తరలించేందుకు రైల్వే, ఎయిర్ ఫోర్స్ సాయం తీసుకుంటున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు అన్ని రాష్ట్రాలు కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కాగా, ఢిల్లీ ఆస్పత్రుల వద్ద రోగుల బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. సకాలంలో వైద్య చికిత్స అందక చాలా మంది తమ కుటుంబ సభ్యుల ముందే కన్నుమూస్తున్నారు. మరికొందరైతే ఆస్పత్రిలో బెడ్స్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: