Corona Vaccine: కరోనా వాక్సిన్‌పై కేంద్రం కీలక ప్రకటన.. ఎప్పుడొస్తుందంటే..

వచ్చే ఏడాది జులై కల్లా 40 కోట్ల నుంచి 50 కోట్ల కోవిడ్ వాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్ష వర్ధన్ తెలిపారు.

news18-telugu
Updated: October 4, 2020, 5:50 PM IST
Corona Vaccine: కరోనా వాక్సిన్‌పై కేంద్రం కీలక ప్రకటన.. ఎప్పుడొస్తుందంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. ఇంకా భారీగానే కేసులు నమోదువుతున్నాయి. ఎక్కువ కోవిడ్ కేసులు నమోదైన దేశాల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో యావత్ ప్రపంచంతో పాటు భారత ప్రజలు కూడా కోవిడ్ వాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. మహమ్మారిని తరిమికొట్టే టీకాలు త్వరగా ప్రజలకు అందుబాటులోకి రావాలని అందరూ కోరుతున్నారు. ఈ క్రమంలో కరోనా వాక్సిన్ భారత ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది జులై కల్లా 40 కోట్ల నుంచి 50 కోట్ల కోవిడ్ వాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్ష వర్ధన్ తెలిపారు.

ఆదివారం ట్విటర్ వేదికగా నిర్వహించిన సండే సంవాద్‌లో పాల్గొన్న హర్ష వర్ధన్.. ''కరోనా వైరస్‌కు టీకాలు సిద్ధమైన వెంటనే దేశవ్యాప్తంగా అందరికీ సమానంగా పంపిణీ చేయడం కోసం ప్రభుత్వం విశ్రాంతి లేకుండా పనిచేస్తోంది. దేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. టీకాలకు సంబంధించి అన్ని రకాల అంశాలపై పరిశోధించడానికి ఉన్నత స్థాయి నిపుణుల బృందం ఉంది. వచ్చే ఏడాది జులై కల్లా దాదాపు 400 నుంచి 500 మిలియన్ల కొరోనా వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దాదాపు 25 కోట్ల మందికి మనం సరఫరా చేయడానికి వీలుపడుతుంది.'' అని పేర్కొన్నారు.

భారత్‌లో ముఖ్యంగా మూడు వ్యాక్సిన్‌లు ట్రయల్ దశలో ఉన్నాయి. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ (Covaxin), జైడుస్ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డీ (Zycov-d) వాక్సిన్‌లు రెండో దశ ట్రయల్స్ దశలో ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వీటిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక ఆక్స్‌పర్డ్-ఆస్ట్రాజెనికా వాక్సిన్‌పై పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒప్పందం చేసుకుంది. ఆ వాక్సిన్ ట్రయల్స్‌తో పాటు ఉత్పత్తికి వీటి మధ్య అంగీకారం కుదిరింది. ఒకవేళ ఆక్స్‌పర్డ్ వాక్సిన్ మార్కెట్లోకి వస్తే వాటిని భారత్‌లో సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుంది. ఇక రష్యా ఉత్పత్తి చేసిన స్పుత్నిక్-vపై మాత్రం ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కాగా, భారత్‌లో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఓ దశలో ప్రతిరోజు లక్ష కేసులు నమోదయ్యేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. నిత్యం 70వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 75829 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65లక్షల 49వేలు దాటింది. నిన్న 940 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య లక్షా 1వెయ్యీ 782కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.6 శాతంగా ఉండగా ప్రపంచ దేశాలలో అది 2.95 శాతంగా ఉంది.

ఇండియాలో కొత్తగా 82260 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తం రికవరీల సంఖ్య 55లక్షల 9వేల 966కి చేరింది. దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి... 84.1 శాతానికి చేరింది. ఇదో మంచి పరిణామం. ఇండియాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 9లక్షల 37వేల 625 ఉన్నాయి. ఇండియాలో నిన్న 11,42,131 శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించారు. మొన్నటి కంటే అవి 9456 ఎక్కువ. మనదేశంలో ఇప్పటి వరకు చేసిన మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 7కోట్ల 89 లక్షల 92వేల 534కి చేరింది.
Published by: Shiva Kumar Addula
First published: October 4, 2020, 5:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading