కరోనా వైరస్ ప్రపంచానికి జడపదార్ధంలా పట్టుకొని వదలడం లేదు. ఇప్పటికే ఫస్ట్, సెకండ్, థర్డ్‌వేవ్‌ల నుంచి బయటపడ్డ ప్రపంచ జనాభాను మరోసారి కరోనా వైరస్ కేసులు భయపెడుతున్నాయి. కరోనా వైరస్ పుట్టిన దేశంలో చైనా(China)లోనే మరోసారి కేసులు విజృంభించడం చూస్తుంటే ప్రమాదఘంటికలు మోగుతున్నట్లుగా అనిపిస్తోంది. చాలా రోజులుగా పదుల సంఖ్యకే పరిమితమైన కరోనా కేసుల సంఖ్య(Positive cases)చైనాలో మళ్లీ విచ్చలవిడిగా పెరిగిపోయాయి. సరిగ్గా మూడు వారాల క్రితం వరకు రోజుకు 100లోపే నమోదైన పాజిటివ్ కేసులు(Positive Cases) ఒక్కసారిగా 24గంటల్లో 1300 కేసులు దాటేయడంతో అక్కడి జనంలో ప్రాణభయం మొదలైంది. శుక్రవారం ఒక్కరోజే 1369 కొత్త కేసులు (1369 Positive Cases)నమోదైనట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక చైనాలో 12ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతున్నట్లుగా నిర్ధారించారు. చైనాలోని ఈశాన్య నగరమైన చాంగ్‌చున్(Changchun)లో వైరస్ విజృంభణ ఎక్కువగా ఉంది. దీంతో శుక్రవారం నుంచి అక్కడ లాక్‌డౌన్ విధించారు. మహమ్మారి మరోసారి ఉగ్రరూపం ప్రదర్శిస్తుందేమోనన్న భయంతో సుమారు 90లక్షల మంది జనాభా కలిగిన చాంగ్‌చున్‌లో షాపులు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలు మూసివేశారు. రవాణా వ్యవస్థను కూడా నిలిపివేయడం జరిగింది. తప్పని పరిస్థితి అయితే ఎవరూ ఇంట్లో నుంచి బయటకు రావద్దొని అధికారులు ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది.
మళ్లీ బుసలు కొడుతున్న కరోనా వైరస్..
మరోవైపు కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు నగరంలో ప్రతి చోట కరోనా పరీక్షలు చేస్తున్నారు. షాంఘైతో పాటు మరికొన్ని ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్‌ని కఠినంగా అమలు చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. వైరస్ పుట్టినిల్లు చైనా కావడంతో ఇక్కడ కరోనా కట్టడికి జీరో కోవిడ్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒక్క కేసు నమోదైనా లక్షల సంఖ్యలో పరీక్షలు చేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాంటి ఒక్కసారిగా 24గంటల వ్యవధిలో వెయ్యికిపైగా పాజిటివ్ కేసులు నమోదవడంతో టెస్టుల సంఖ్యను మరింత పెంచారు.
మళ్లీ చైనాలోనే విజృంభణ..
షాంఘైలోని కొన్ని ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలను మూసివేసి తాళాలు వేశారు. విద్యార్దులు, టీచర్లను సురక్షితంగా ఉంచేందుకు అందులో బంధీలుగా ఉంచి మరి టెస్ట్‌లు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రెస్టారెంట్‌లు మాల్స్‌లో కూడా కస్టమర్లకు టెస్ట్‌లు పూర్తయ్యే వరకు లోపలికి వచ్చిన వాళ్లను బయటకు పంపడం లేదనే కథనాలు పేర్కొంటున్నాయి. జూన్ నెలలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని డబ్యూహెచ్‌వో ఇప్పటికే అప్రమత్తం చేసిన నేపధ్యంలో చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో భయం మొదలైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Corona alert