దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వేలాది మందిని బలితీసుకుంటోంది. పచ్చని కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపుతోంది. మహమ్మారి ధాటికి చాలా మంది తమ అయినవాళ్లని కోల్పోయారు. కానీ కరోనా కాటుకు చేసిన విషాదాల్లో ఇది మాత్రం మాటలకు అందదు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అప్పటివరకు తల్లిదండ్రులు, నానమ్మ, అమ్మమ్మ తాతయ్యలతో సరదాగా గడిపిన వాడు వారంతా కరోనాకు బలవడంతో అనాథగా మారాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని శివకోడు గ్రామానికి చెందిన సివిల్ కాంట్రాక్టర్ మేడిచర్ల వి.సుధీర్రాయ్ తన భార్య శ్వేత హరిత, తల్లి ఉమామహేశ్వరి, కుమారుడు సాయి సత్య సహర్షతో కలిసి ఉంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో సుధీర్ రాయ్ దంపతులకు కరోనా సోకింది. దీంతో శ్వేత సోదరుడు రాజీవ్ వారిని ఆస్పత్రిలో చేర్చి మేనల్లుడైన సహర్షను చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న సుధీర్ రాయ్, మే 9న శ్వేత హరిత, మే 4న ఉమామహేశ్వరి మృతి చెందారు.
కానీ ఈ విషయాన్ని రాజవీ.. సహర్షకు చెప్పకుండా.. ఆస్పత్రిలో ఉన్నారని త్వరలో వచ్చేస్తారని చెప్తూ వస్తున్నాడు. మరోవైపు కిర్లంపూడి మండలం రామచంద్రపురంలో ఉంటున్న సహర్ష తాతయ్య, అమ్మమ్మలు ఇటీవల కరోనాతో మరణించారు. వీరంతా స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యానికి దాదాపు రూ.28 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. 40 రోజుల వ్యవధిలో ఐదుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన సహర్ష ఒంటరివాడయ్యాడు. ప్రస్తుతం సహర్ష రామండ్రిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్య మృతి చెందారన్న విషయం తెలియక వారు వస్తారన్న ఆశతో ఎదురుచూస్తున్నాడు.
విషయం తెలుసుకున్న రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. సహర్ష ఇంటికి వెళ్లి బాలుడ్ని పరామర్శించారు. ప్రస్తుతం మేనమామ రాజీవ్... సహర్ష బాధ్యతను తీసుకున్నారు. ఒకే ఇంట్లో ఐదుగురు కరోనాతో మృతి చెందడం బాధాకరమన్న ఎంపీ.. ప్రైవేట్ ఆస్పత్రికి చెల్లించిన డబ్బులు కూడా తిరిగి ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షలు సహర్ష పేరుమీద బ్యాంకులో డిపాజిట్ చేయిస్తామన్నారు. అలాగే సహర్షను కేంద్రీయ విద్యాలయంలో చేర్పిస్తానని.. అతడు అంగీకరిస్తే ఈ ఏడాదే చేరేలా ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. బాలుడికి అలరించేందుకు అతడితో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. చిన్నవయసులోనే అయిన వారందరిని కోల్పోయిన సహర్షకు దేవుడు మరింత ధైర్యం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.