ప్రధాని మోదీకి 12 మంది విపక్ష నేతల లేఖ.. కరోనా కట్టడికి ఇవన్నీ చేయాల్సిందే..

ప్రధాని నరేంద్ర మోదీ(ఫైల్ ఫొటో)

కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను నిలిపివేసి.. ఆ నిధులను కరోనా వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరాకు ఉపయోగించాలని కోరారు. బడ్జెట్‌లో వ్యాక్సినేషన్ కోసం కేటాయించిన రూ.35వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు

 • Share this:
  కరోనా కట్టడి గురించి విపక్ష నేతలు ప్రధాని మోదీకి కీలక సూచనలు చేశారు. పలు పార్టీలకు చెందిన 12 మంది నేతలకు ఆయనకు లేఖ రాశారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను అందులో వివరించారు. 18 ఏళ్లు పైబడిన వారిందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కొత్త పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా నిర్మాణ పనులను నిలిపివేసి.. ఆ నిధులను కరోనా వ్యాక్సినేషన్,  ఆక్సిజన్ సరఫరాకు ఉపయోగించాలని కోరారు. బడ్జెట్‌లో వ్యాక్సినేషన్ కోసం కేటాయించిన రూ.35వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానికి లేఖ రాసిన వారిలో కాంగ్రెస్ నేత సోనియా గాంధీ, మాజీ ప్రధాని దేవెగౌడ, బెంగాల్ సీఎ మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి.రాజా, జమ్మూకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఉన్నారు.

  విపక్ష నేతల డిమాండ్లు:
  వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలి.

  దేశీయంగా, అంతర్జాతీయంగా అవకాశమున్న ప్రతి చోటు నుంచి వ్యాక్సిన్ సమకూర్చుకోవాలి.

  వ్యాక్సినేషన్‌‌కు బడ్జెట్‌లో కేటాయించిన రూ.35వేల కోట్ల వెంటనే విడుదల చేయాలి.

  సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పనులను నిలిపివేసి ఆ నిధులను వ్యాక్సినేషన్, ఆక్సిజన్ కొనుగోలుకు కేటాయించాలి.

  దేశంలోని పేద ప్రజలందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలి.

  నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.6వేల నిరుద్యోగ భృతి అందజేయాలి.

  కొత్త వ్యవసాయ చట్టాలను రద్దుచేసి కరోనా సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవాలి.
  Published by:Shiva Kumar Addula
  First published: