డెలివ‌రీ ఉమెన్‌ల నియామ‌కంపై Zomato దృష్టి.. మహిళా ప్రాతినిధ్యం పెంచుతామంటున్న సంస్థ

ప్రతీకాత్మకచిత్రం

బెంగ‌ళూరు, పూణె, హైద‌రాబాద్ త‌దిత‌ర న‌గ‌రాల‌తోపాటు అన్నిచోట్లా మహిళలను త‌మ డెలివ‌రీ టీమ్‌లోకి చేర్చుకోవాల‌ని జొమాటో భావిస్తోంది. దీంతోపాటు వారికి ఆత్మ‌ర‌క్ష‌ణ ప‌ద్ధ‌తుల‌లోనూ శిక్ష‌ణ ఇచ్చేందుకు జొమాటో చ‌ర్య‌లు తీసుకుంది.

  • Share this:
ఫుడ్ డెలివ‌రీ దిగ్గ‌జం జొమాటో త‌న డెలివ‌రీ టీమ్‌లో మ‌హిళ‌ల శాతం పెంచాల‌ని నిర్ణ‌యించింది. 2021 చివ‌రి నాటికి త‌న డెలివ‌రీ బృందాల‌లో 10శాతం మ‌హిళా భాగ‌స్వామ్యం ఉండేలా ఈ కంపెనీ ప్ర‌ణాళిక ర‌చిస్తోంది. జొమాటోలో ప్ర‌స్తుతం కేవ‌లం 0.5శాతం మాత్ర‌మే డెలివ‌రీ గ‌ర్ల్స్ ప‌నిచేస్తున్నారు. బెంగ‌ళూరు, పూణె, హైద‌రాబాద్ త‌దిత‌ర న‌గ‌రాల‌తోపాటు అన్నిచోట్లా మహిళలను త‌మ డెలివ‌రీ టీమ్‌లోకి చేర్చుకోవాల‌ని జొమాటో భావిస్తోంది. దీంతోపాటు వారికి ఆత్మ‌ర‌క్ష‌ణ ప‌ద్ధ‌తుల‌లోనూ శిక్ష‌ణ ఇచ్చేందుకు జొమాటో చ‌ర్య‌లు తీసుకుంది.

మ‌హిళా భాగ‌స్వాములంద‌రికీ ప‌రిశుభ్ర‌త‌, భ‌ద్ర‌తాప‌ర‌మైన సామ‌గ్రిని ఈ శిక్ష‌ణ‌లో జొమాటో భాగం చేసింది.మ‌హిళా భాగ‌స్వాముల ర‌క్ష‌ణ‌కు జొమాటో అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.. ఇందులో భాగంగా రాత్రివేళ చేసే ఫుడ్ డెలివ‌రీల‌ను కాంటాక్ట్‌లెస్‌గా మార్చింది. అలాగే వీరికోసం 24గంట‌లూ ప‌నిచేసే హెల్ప్‌లైన్ ను ఏర్పాటుచేసింది. జొమాటో మ‌హిళా భాగ‌స్వాములు అత్య‌వ‌స‌ర వేళ‌ల్లో వారి యాప్‌లోని ఎస్ఒఎస్ బ‌ట‌న్ నొక్కితే వారెక్క‌డున్న‌ది లోకేష‌న్ షేర్ చేయ‌డంతోపాటు స‌మీపంలోని డెలివ‌రీ భాగ‌స్వాములు, సెంట్ర‌ల్ రైడ‌ర్ స‌పోర్ట్ ల‌భించే ఏర్పాటు చేసింది.

‘ఈ దిశ‌గా ఈరోజు తొలి అడుగు వేశాం. ప‌దిశాతం మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం పెంచాల‌ని మాకు మేముగా ల‌క్ష్యాన్ని పెట్ట‌కున్నాం. 2021 చివ‌రినాటికి ఈ ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌నుకుంటున్నాం..మా డెలివ‌రీ బృందాల‌లోకి మ‌రింత‌మంది మ‌హిళ‌ల‌ను తీసుకోవాల‌నుకుంటున్నాం. అయితే ఇలాంటి ఉద్యోగాల‌కు మ‌హిళ‌ల‌ను తీసుకోవ‌డం అంత సులువైన విష‌య‌మేమీ కాదు.. ఎందుకంటే మ‌న ఆలోచ‌న‌లు, ప‌ద్ధ‌తులు మారాలి.. అప్పుడే ఇటువంటి రంగాల‌లోకి మ‌హిళ‌ల‌ను తీసుకురాగ‌లం’ అని జొమాటో స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడు దీపీంద‌ర్ గోయ‌ల్ త‌న బ్లాగ్‌లో పేర్కొన్నారు.

మ‌హిళా భాగ‌స్వాముల‌ను పెంచాల‌నే జొమాటో ఆలోచ‌నకు ఆ సంస్థ రెస్టారెంట్ భాగ‌స్వాములు కూడా మ‌ద్ద‌తు ప‌లికారు. అలాగే డెలివ‌రీ ఉమెన్‌ల‌కు త‌మ రెస్టారెంట్ల‌లో ప్ర‌త్యేక వాష్‌రూమ్‌ల వంటి ప్రాథ‌మిక సౌక‌ర్యాలు అందించ‌నున్నాయి. డెలివ‌రీ ఉమెన్స్ కు ఈ రెస్టారెంట్ల‌లో భ‌ద్ర‌త‌, సౌక‌ర్యాల‌పై రేటింగ్ ఇచ్చే అవ‌కాశం కూడా జొమాటో క‌ల్పించింది. గ‌ర్ల్ వ‌ప‌ర్ ట్యాగ్‌తో జొమాటో త‌న ఆలోచ‌న‌ల‌ను హైలెట్ చేస్తోంది. ఇక‌పై డెలివ‌రీ బాయ్స్ అనే ప‌దానికి అర్థం మార‌నుంది. ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ అంటే ఇదే క‌దా!
Published by:Krishna Adithya
First published: