Zomato Layoffs : ప్రపంచవ్యాప్తంగా బడా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటం(Lay offs), ఆర్థిక మాంద్యంపై ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. అమెజాన్, ఫేస్బుక్, ట్విట్టర్ సహా అనేక గ్లోబల్ టెక్ దిగ్గజాలు భారీ తొలగింపులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో ఇండియన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటో(Zomato) కూడా చేరింది. ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 3 శాతం మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఖర్చులను తగ్గించుకోవడానికి, బిజినెస్‌ను లాభదాయకంగా మార్చాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. జొమాటో సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా శుక్రవారం సంస్థ నుంచి వైదొలిగిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. జొమాటో, లే ఆఫ్ ప్రకటనలోని పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అన్ని విభాగాలపై లే ఆఫ్ ప్రభావం
జొమాటో కంపెనీలోని వివిధ విభాగాలలో ఉద్యోగులను బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరుతున్నట్లు, కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో 3 శాతం మందిని తగ్గించేందుకు సిద్ధమైనట్లు ఇటీవల లైవ్‌మింట్ రిపోర్ట్ పేర్కొంది. లే ఆఫ్‌ల ప్రభావం కంపెనీలోని చాలా విభాగాలపై కనిపించనుందని.. టెక్నాలజీ, ప్రొడక్ట్, మార్కెటింగ్ వంటి డిపార్ట్మెంట్లు తొలగింపుల వల్ల ప్రభావితమయ్యాయని తెలిపింది. ఈ వివరాలను పరిస్థితిపై విస్తృతమైన అవగాహన ఉన్న వ్యక్తి తెలియజేసినట్లు పేర్కొంది. కంపెనీ ప్రతినిధి లేఆఫ్స్‌ను రెగ్యులర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ చర్యలుగా అభివర్ణించారని, 3 శాతం కంటే తక్కువ మందినే తొలగిస్తున్నట్లు చెప్పారని రిపోర్ట్ వివరించింది.
Gujarat Bjp: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ సంచలన నిర్ణయం..ఏడుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్..నామినేషన్ వేయడమే కారణం!
2020 మే నెలలో.. ఫుడ్ డెలివరీ యాప్ కరోనావైరస్ కారణంగా వ్యాపారంలో తిరోగమనం ఎదుర్కొంది. ఈ కారణంగా దాదాపు 520 మంది ఉద్యోగులను, దాదాపు 13 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు తాజా తొలగింపుల తర్వాత జొమాటోలో దాదాపు 3,800 మంది ఉద్యోగులు ఉంటారు. ఇప్పటికే ఖర్చులను తగ్గించుకోవడానికి అమెజాన్ , ట్విట్టర్ , మైక్రోసాఫ్ట్, ఇతర పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగించగా.. ఇండియన్ కంపెనీలు కూడా ఈ విషయంపై దృష్టి పెట్టాయి.
జొమాటో సహ వ్యవస్థాపకుడి రాజీనామా
జొమాటో సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా కూడా కంపెనీ నుంచి తప్పుకొన్నారు. గుప్తా నిష్క్రమణ గురించి జొమాటో వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో.. MG(మోహిత్ గుప్తా) కొన్ని సంవత్సరాలుగా తనకు సోదరుడు, స్నేహితుడిగా ఉన్నారని, కంపెనీలో అద్భుతమైన సేవలు అందించారని పేర్కొన్నారు. వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు చేర్చడంలో కీలకంగా వ్యవహరించారని, కంపెనీని లాభాల్లో నిలిపారని తెలిపారు. అన్నింటికంటే మించి, ఇంత పెద్ద, సంక్లిష్టమైన వ్యాపారాన్ని నిర్వహించగలిగేలా కొన్ని సంవత్సరాలపాటు శిక్షణ ఇచ్చారని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.