స్టాక్ మార్కెట్లో ఈరోజు ఎక్కడ చూసినా జొమాటో ఐపీఓ లిస్టింగ్ గురించే చర్చ. జొమాటో ఐపీఓ స్టాక్ మార్కెట్లో బంపర్ లిస్టింగ్ అయింది. గ్రే మార్కెట్ ప్రీమియంను బట్టి రూ.96 నుంచి రూ.99 మధ్య స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుందని అంచనా వేశారు. కానీ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో 52.63 శాతం ప్రీమియంతో రూ.116 దగ్గర, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో 51.32 శాతం ప్రీమియంతో రూ.115 దగ్గర లిస్ట్ అయి జొమాటో సంచలనం సృష్టించింది. అంతేకాదు... ఓ దశలో అప్పర్ సర్క్యూట్ అయిన రూ.138 తాకడం విశేషం. జొమాటో ఐపీఓ షేర్లు అలాట్ అయినవారికి ఈరోజు లాటరీ తగిలినట్టే. జొమాటో షేర్లను రూ.76 చొప్పున సొంతం చేసుకున్నారు. ఉదయం 11.30 గంటలకు జొమాటో షేర్లు రూ.124.80 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.
ఇక జొమాటో కంపెనీ మరో సంచలనం సృష్టించింది. ఏకంగా రూ.లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటింది. రూ.1,08,067.35 మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో రికార్డులు సృష్టించింది. ఐఓసీ, బీపీసీఎల్, శ్రీ సిమెంట్స్ లాంటి కంపెనీలను దాటేసింది. జొమాటో ఈ ఐపీఓ ద్వారా రూ.9,375 కోట్లు సేకరించింది. జూలై 14 నుంచి 16 మధ్య సబ్స్క్రిప్షన్స్ జరిగాయి. 38.25 రెట్లు ఎక్కువగా ఇన్వెస్టర్లు సబ్‌స్క్రైబ్ చేయడం విశేషం. ఇక గత 13 ఏళ్లల్లో రూ.5,000 కన్నా ఎక్కువగా వచ్చిన ఐపీఓల్లో 38.25 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిన మొదటి ఐపీఓ ఇదే. జూలై 27న లిస్ట్ కావాల్సిన జొమాటో ఐపీఓ జూలై 23న లిస్ట్ కావడం మరో విశేషం. 20-25 శాతం ప్రీమియంతో లిస్ట్ అవుతుందని అనుకుంటే 50 శాతం పైనే ప్రీమియంతో లిస్ట్ అయి ఇన్వెస్టర్లకు లాభాల వర్షం కురిపించింది జొమాటో.
ఫుడ్ డెలివరీ సెగ్మెంట్లో మొదటి కంపెనీ లిస్ట్ కావడం, మార్కెట్ సెంటిమెంట్ పాజిటీవ్‌గా ఉండటం, ఇన్వెస్టర్ల నుంచి మంచి డిమాండ్ ఉండటం, మార్కెట్ షేర్ స్థిరంగా పెరుగుతూ ఉండటం లాంటి కారణాలతో జొమాటో షేర్లు బంపర్ లిస్టింగ్ అయ్యాయి. జొమాటో కంపెనీ 2010లో ప్రారంభమైంది. రెస్టారెంట్లను కస్టమర్లను డెలివరీ పార్ట్నర్ సాయంతో ఒకే ప్లాట్‌ఫామ్ పైకి తీసుకొస్తున్న టెక్నాలజీ కంపెనీ ఇది. 2021 మార్చి నాటికి జొమాటో 525 పట్టణాల్లో అడుగుపెట్టింది. 3,89,932 యాక్టీవ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇండియాలోనే కాదు... 23 దేశాల్లో జొమాటో సేవలు అందిస్తోంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.