ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato) కంపెనీ వచ్చే నెల నుంచి గురుగ్రామ్‌లో ప్రయోగాత్మకంగా ఇన్‌స్టంట్‌గా పేర్కొంటున్న 10 నిమిషాల ఫుడ్ డెలివరీ సర్వీస్‌ను (10 Minutes Food Delivery Service) అందుబాటులోకి తీసుకురానుంది. జొమాటో చేసిన ఈ ప్రకటనతో వివిధ వర్గాల నుంచి సంస్థ పైలట్ ప్రోగ్రామ్ గురించి చాలా ప్రశ్నలు, సందేహాలు వ్యక్తం చేశాయి. ఈ గందరగోళాన్ని తీర్చేందుకు ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో.. 10 నిమిషాల డెలివరీ సిస్టమ్ ఎలా పని చేస్తుందో వివరించడానికి ప్రయత్నించింది.
అయితే ఇటీవల చెన్నై ట్రాఫిక్ పోలీసులు ఆహారపదార్థాలు తరలించే సమయంలో డెలివరీ బాయ్స్ రోడ్డు భద్రతపై చర్చించేందుకు జొమాటో, స్విగ్గీ సంస్థలతో సమావేశమయ్యారు. అదే విధంగా చెన్నైలోని ట్రాఫిక్ పరిస్థితుల దృష్ట్యా 10 నిమిషాల్లో ఫుడ్ డెలివరీపై కూడా జొమాటో సంస్థను చెన్నై ట్రాఫిక్ పోలీసులు ప్రశ్నించారు. దీనిపై జొమాటో వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ చెన్నై ట్రాఫిక్ పోలీసులకు వివరణ ఇచ్చారు.
10 నిమిషాల్లో ఆహార పదార్థాలు డెలివరీ చేసే ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు దీపేందర్ గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి తమ జాబితాలో చెన్నై నగరం లేదని, ఇక్కడ ఇన్‌స్టాంట్ డెలివరీని తీసుకొచ్చే ఉద్దేశం లేదని తెలిపారు. ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా ఇన్‌స్టాంట్ డెలివరీని పరిశీలిస్తున్నామని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చాలా మార్పులు కూడా చేసే అవకాశం ఉందని చెప్పారు.
మార్చి 25వ తేదీన స్విగ్గీ, జొమాటో నిర్వాహకులతో చెన్నై నగర ట్రాఫిక్ పోలీసులు సమావేశమైనట్లు సమాచారం. దీనికి సంబంధించి చెన్నై ట్రాఫిక్ పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో..‘ప్రస్తుతం ఫుడ్ డెలివరీ బాయ్స్ నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే ఘటనలు తగ్గాయి. వరుసగా సమావేశాలు నిర్వహించిన నిబంధనలను వివరించడంతో ఇది సాధ్యమైంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకుండా, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించకుండా భవిష్యత్తులో ఈ-కామర్స్ సంస్థల డెలివరీలు చేయడంపై చర్చించాం.’ అని పేర్కొన్నారు.
10 నిమిషాల డెలివరీ సిస్టమ్ ఎలా పని చేస్తుందో వివరించడానికి జొమాటో ప్రయత్నించింది. ఈ కంపెనీ 10 నిమిషాల ప్రక్రియను మూడు దశలుగా విభజించింది. అవి వంటగదిలో తయారీ సమయం, ప్రయాణించిన సగటు దూరం, ప్రయాణించిన సగటు సమయం. ప్రామాణిక 30 నిమిషాల డెలివరీలో 15 నుంచి 20 నిమిషాలు సరాసరి ప్రిపరేషన్ సమయంతో పోలిస్తే.. 10 నిమిషాల డెలివరీ సిస్టమ్‌లో వంటగది తయారీ సమయం సగటున 3 నుంచి 4 నిమిషాలు ఉంటుందని జొమాటో వివరించింది. ఎక్కువ మంది ఆర్డర్ చేసే, వేగంగా అమ్ముడవుతున్న మెనూలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని వివరించింది.
అదే విధంగా స్టాండర్డ్ 30 నిమిషాల డెలివరీలో ఎగ్జిక్యూటివ్ ప్రయాణించే దూరం సగటున ఐదు నుంచి ఏడు కిలోమీటర్లు ఉంటుందని, 10 నిమిషాల డెలివరీలో ఎగ్జిక్యూటివ్‌లు ప్రయాణించే సగటు దూరం కిలోమీటరు నుంచి 2 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలిపింది. ఇది డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు ప్రయాణించే సగటు సమయాన్ని 3 నుంచి 6 నిమిషాలకు తగ్గిస్తుంది, 30 నిమిషాల డెలివరీలో ప్రయాణించే సగటు సమయం 15 నుంచి 20 నిమిషాలు ఉంటుంది. డెలివరీ భాగస్వాములకు ఈ సమయ పరిమితి గురించి తెలియజేయలేదనే కారణంతో, ఆలస్యమైన డెలివరీలకు ఎటువంటి పెనాల్టీలు విధించరు. 10 నిమిషాలు, 30 నిమిషాల డెలివరీలకు ఆన్-టైమ్ డెలివరీలకు ఎటువంటి ప్రోత్సాహకాలు కూడా ఉండవు. నిర్దిష్ట వినియోగదారుల స్థానాలకు మాత్రమే 10 నిమిషాల డెలివరీ సేవలను ప్రారంభిస్తామని జొమాటో వివరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai, Food delivery, Online food delivery, Traffic police, Zomato