సామాజిక బాధ్యతలో భాగంగా చాలా మంది ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తుంటారు. ఈ కోవకే చెందుతారు కామత్ బ్రదర్స్(Kamath Brothers). జెరోధా స్టాక్ బ్రోకింగ్(Zerodha Stock Broking) ప్లాట్‌ఫామ్ వ్యవస్థాపకులైన నిఖిల్ కామత్(Nikhil Kamath), నితిన్ కామత్ సోదరులు యంగ్ ఇండియన్ బిలియనీర్స్ లిస్ట్‌లో ఎప్పుడూ ఉంటారు. అయితే వీరి సంపాదన పెరుగుతున్నా కొద్దీ, విరాళాలు కూడా పెంచడం విశేషం. 2021-22లో వీరు ఏకంగా రూ.100 కోట్లు వితరణగా ఇచ్చారు. ఈ సోదరులు 2021-22 కాలంలో తమ డొనేషన్స్‌ను ఏకంగా 300శాతం పైగా పెంచి, దాతృత్వ కార్యకలాపాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచిన యువతగా గుర్తింపు పొందారు.
* టాప్ టెన్‌లో చోటు..
ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రఫీ (దాతృత్వం)-2022 జాబితా గురువారం విడుదలైంది. ఈ లిస్ట్‌లో జెరోధా సహ వ్యవస్థాపకులు నితిన్ కామత్, నిఖిల్ కామత్ 9వ స్థానం దక్కించుకున్నారు. 36 ఏళ్ల నిఖిల్ కామత్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు.
* స్వల్ప కాలంలోనే యూనికార్న్ కంపెనీగా..
స్టాక్‌మార్కెట్‌తో పరిచయం ఉన్న వారికి జెరోధా కంపెనీ గురించి కచ్చితంగా తెలిసే ఉంటుంది. 2010లో స్టార్టప్‌గా మొదలైన ఈ సంస్థ, అనతికాలంలోనే యూనికార్న్ కంపెనీగా మారింది. కనీసం డిగ్రీ కూడా చదవని నితిన్ కామత్ ఈ కంపెనీకి సీఈవో కావడం విశేషం. 2010లో కామత్ సోదరులు జెరోధా కంపెనీ ఏర్పాటు చేసి ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేశారు. నలభై ఏళ్ల వయస్సు వచ్చేసరికి అన్నదమ్ములిద్దరూ ఇండియాలో సెల్ఫ్ మేడ్ బిలినీయర్లుగా ఎదిగారు. టాప్ 10 యంగెస్ట్ బిలీనియర్స్ ఆఫ్ ఇండియాలోనూ చోటు దక్కించుకున్నారు.
* వచ్చే మూడేళ్లలో రూ.750కోట్ల వితరణ
సామాజిక అంశాలపై దాతృత్వ విరాళాన్ని (శాతం పరంగా) ఏటేటా భారీగా పెంచుతున్న వారిలో కామత్ సోదరులు టాప్ ప్లేస్‌లో ఉన్నారు. 2022-21లో వీరి విరాళం ఏకంగా 308 శాతం పెరిగిందని హురున్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది. కామత్ సోదరులు తమ సంపదలో నాలుగింట ఒక వంతు దాతృత్వంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రాబోయే మూడేళ్లలో ఏకంగా రూ. 750 కోట్ల విరాళాలు ప్రకటించే యోచనలో ఉన్నారు.
* రెయిన్‌మాటర్ ఫౌండేషన్ స్థాపన
క్లైమెట్ ఛేంజ్ సొల్యూషన్స్, లైవ్‌ల్లీహుడ్ వంటి అంశాలపై ఈ సోదరులు ఎక్కువగా దృష్టిసారిస్తున్నారని, భవిష్యత్‌లో వీటిపైనే ఎక్కువగా విరాళాలు ప్రకటించే అవకాశం ఉందని హురున్ ఇండియా పేర్కొంది. కామత్ సోదరులు 100 మిలియన్ డాలర్స్‌తో రెయిన్‌మాటర్ ఫౌండేషన్‌ను స్థాపించారు. క్లైమెట్ ఛేంజ్ సొల్యూషన్స్‌పై క్షేత్ర స్థాయిలో పనిచేసే వ్యక్తులు, సంస్థలు, కంపెనీలకు ఇది అన్ని రకాలుగా సపొర్ట్‌గా ఉంటుంది. అలాగే అటవీ పెంపకం, పర్యావరణ పునరుద్ధరణ వంటి అంశాలపై ఈ సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
* మొదటి స్థానంలో శివ్ నాడార్
ఎడెల్‌గివ్ హురున్ ఇండియా ఫిలాంత్రఫీ(దాతృత్వం)-2022 జాబితాలో టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నారు శివ్ నాడార్. ఈయన హెచ్‌సీఎఎల్ వ్యవస్థాపకుడు. 2021-22 కాలంలో శివ్ నాడార్ రూ.1161 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ లిస్ట్‌లో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ రెండో స్థానం దక్కించుకున్నారు. ఈయన రూ.484 కోట్లు విరాళంగా ఇచ్చారు. గౌతమ్ అదానీ రూ.190 కోట్ల వితరణతో ఈ జాబితాలో ఏడో ప్లేస్‌లో నిలిచారు. భారత్‌లో మొత్తంగా 15 మంది రూ.100 కోట్లకు పైగా వార్షిక విరాళాలు ఇవ్వగా, మరో 20 మంది రూ. 50 కోట్లకు పైగా, ఇంకో 43 మంది రూ. 20 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారని హురున్ ఇండియా రిపోర్ట్ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.