YES Bank Crisis: యెస్ బ్యాంక్‌పై మారటోరియం విధిస్తూ ఆర్బీఐ గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. యెస్ బ్యాంకు బోర్డును రద్దు చేసిన ఆర్బీఐ...ఖాతాదారులు నెలకు రూ.50,000 మాత్రమే ఒక్కో ఖాతా నుంచి నగదు ఉపసంహరణకు వీలుకల్పిస్తూ ఆదేశాలిచ్చింది. ప్రజా ప్రయోజనాలు, బ్యాంకు డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ నిర్ణయంతో శుక్రవారం ఉదయం యెస్ బ్యాంక్ షేర్ భారీగా నష్టపోయింది. ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో యెస్ బ్యాంక్ షేర్ విలువ ఏకంగా 82 శాతం మేర నష్టపోయింది. కొద్ది సేపటి క్రితం సెన్సెక్స్‌లో యెస్ బ్యాంక్ షేర్ విలువ రూ.25.50 నష్టపోయి రూ.11.50 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఆర్బీఐ ఆదేశాలకు ముందు గురువారం యెస్ బ్యాంకు షేర్ విలువ రూ.36.85 వద్ద ముగిసింది.
గత ఏడాది ఏప్రిల్ మాసం నుంచే యెస్ బ్యాంక్ షేర్ విలువ క్రమంగా తిరోగమనబాటపట్టింది. గత ఏడాది ఏప్రిల్ రెండో తేదీన యెస్ బ్యాంక్ షేర్ విలువ 280.30గా ఉండగా...క్రమంగా క్షీణిస్తూ రూ.10 స్థాయికి పడిపోవడం విశేషం. తాజా పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ యెస్ బ్యాంకు షేరు లక్ష్యాన్ని రూ.1గా అంచనా కట్టింది. నష్టాల భయంతో బ్యాంకులో వాటాలను దాదాపు సున్నా విలువతో మదుపర్లు కొంటారని అంచనావేసింది.బ్యాంకింగ్ రంగ షేర్లన్నీ భారీగా విలువ కోల్పోయాయి. యెస్ బ్యాంక్ షేర్లను ఎస్బీఐ కొంటుందన్న ప్రచారం నేపథ్యంలో ఆ షేర్లు కూడా పతనమయ్యాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సెస్ బ్యాంక్ తదితర బ్యాంకుల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 1500 పాయింట్ల మేర నష్టపోవడంతో దాదాపు రూ.5 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. కొద్దిసేపటి క్రితం సెన్సెక్స్ 1169 పాయింట్ల నష్టంతో 37,302 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ కూడా 362 పాయింట్ల నష్టంతో 10,907 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కరోనా భయాలకు తోడు యెస్ బ్యాంకులో తాజా పరిణామాలు స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rbi, Stock Market, YES BANK