Home /News /business /

WORLDS RICHEST MAN IS GETTING READY FOR TRYST WITH SPACE HERES HOW HE WILL FLY THERE AND WHAT IT WILL TAKE MK GH

Jeff Bezos: మరికొన్ని గంటల్లో అంతరిక్షంలోకి వెళ్లనున్న జెఫ్ బెజోస్.. ప్రయాణం ఎలా సాగనుంది...

జెఫ్ బెజోస్

జెఫ్ బెజోస్

అంతరిక్ష ప్రయాణాలను మనుషులకు చేరువ చేయడం, ఇందుకు అయ్యే ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రయోగాలు చేపట్టింది. ఇందులో భాగంగా పునర్వినియోగానికి పనికొచ్చే రాకెట్లను రూపొందించింది. బెజోస్ యాత్రకు సన్నాహకంగా ఇప్పటికే పలు ప్రయోగాలను బ్లూ ఆరిజిన్ విజయవంతంగా నిర్వహించింది. మరి కొన్ని గంటల్లో ఈ బృందం రోదసిలోకి అడుగు పెట్టనుంది.

ఇంకా చదవండి ...
అంతరిక్ష విహారాన్ని సులభతరం చేసేందుకు ప్రపంచ కుబేరులు ప్రయత్నిస్తున్నారు. అసలు పనులను వదులుకొని మరీ.. కొందరు కోటీశ్వరులు తమ అభిరుచి అయిన అంతరిక్ష యాత్రల కోసం ప్రత్యేకంగా సంస్థలను స్థాపించారు. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ వంటి కుబేరులు ఈ రంగంపై దృష్టి సారించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఇప్పటికే రిచర్డ్ బ్రాన్సన్ తన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ సాయంతో అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. తాజాగా అమెజాన్ వ్యవస్థాపకుడు అయిన జెఫ్ బెజోస్ వంతు వచ్చింది.

బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థ ఇప్పటికే న్యూ షెపర్డ్ అనే వ్యోమ నౌకను సిద్ధం చేసింది. బెజోస్ సోదరులతో పాటు మరో ఇద్దరు కలిసి మరికొన్ని గంటల్లో అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అంతరిక్ష ప్రయాణాలను మనుషులకు చేరువ చేయడం, ఇందుకు అయ్యే ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా బ్లూ ఆరిజిన్ సంస్థ ప్రయోగాలు చేపట్టింది. ఇందులో భాగంగా పునర్వినియోగానికి పనికొచ్చే రాకెట్లను రూపొందించింది. బెజోస్ యాత్రకు సన్నాహకంగా ఇప్పటికే పలు ప్రయోగాలను బ్లూ ఆరిజిన్ విజయవంతంగా నిర్వహించింది. మరి కొన్ని గంటల్లో ఈ బృందం రోదసిలోకి అడుగు పెట్టనుంది.

బెజోస్ అంతరిక్షంలోకి ఎందుకు వెళ్తున్నారు?
భూ వాతావరణం నుంచి దూరంగా వెళ్లి, సబ్ ఆర్బిటాల్ స్పేస్‌ నుంచి భూమి అందాలను చూడటంతో పాటు అక్కడ కొన్ని నిమిషాల పాటు జీరో గ్రావిటీని అనుభూతి చెందడమే యాత్ర లక్ష్యం. అనంతరం ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వ్యవస్థల ద్వారా బెజోస్‌ బృందం ఉండే క్యాప్సూల్‌ భూమిని చేరుకుంటుంది. సొంత సంస్థ అయిన బ్లూ ఆరిజిన్ రూపొందించిన మొట్టమెదటి మానవ సహిత వ్యోమనౌకలో బెజోస్ బృందం ప్రయాణించనుంది. ఈ సంస్థ ద్వారా అంతరిక్షయానం చేపట్టనున్న మొదటి మిషన్ కూడా ఇదే కావడం విశేషం.

ఈ వ్యోమనౌకను ఇప్పటికే 15 సార్లు పరీక్షించారు. అయితే మనుషులు లేకుండానే ఈ ప్రయోగాలు చేపట్టారు. జూలై 20న ఈ వ్యోమనౌకలో బెజోస్ బృందం అంతరిక్షంలో విహరించనుంది. ఇదే వ్యోమనౌక మరో రెండు రికార్డులను తన పేరుతో లిఖించనుంది. అంతరిక్షంలోకి వెళ్లిన అత్యంత పిన్న వయస్కుడితో పాటు ఎక్కవ వయసున్న వ్యక్తులను న్యూ షెపర్డ్ స్పేస్‌లోకి తీసుకెళ్లనుంది.

బెజోస్ సోదరులతో పాటు ఈ వ్యోమనౌకలో ప్రయాణించడానికి ఒక బెర్తు కోసం బ్లూ ఆరిజిన్ సంస్థ బహిరంగ వేలం నిర్వహించింది. అందులో సుమారు 28 మిలియన్ డాలర్లతో ఒక వ్యక్తి సీటు దక్కించుకున్నారు. కానీ షెడ్యూల్ సమస్యల కారణంగా యాత్ర నుంచి సదరు ప్రయాణికుడు తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో 18 ఏళ్ల ఆలివర్ డెమెన్‌కు న్యూ షెపర్డ్‌ మొదటి ప్రయాణంలో చోటు దక్కింది. నాలుగో బెర్తును 82 ఏళ్ల అమెరికన్ ఏవియేషన్ నిపుణురాలైన వాలీ ఫంక్‌కు బ్లూ ఆరిజిన్ కేటాయించింది. ఆమె గతంలో అంతరిక్ష ప్రయాణానికి శిక్షణ పొందారు. కానీ యాత్ర చేపట్టలేకపోయారు. ఈ ప్రయాణంతో.. అంతరిక్షంలోకి వెళ్లనున్న అతిపిన్న వ్యక్తిగా డెమన్, అత్యంత వృద్ధురాలిగా వాలీ ఫంక్ రికార్డు సృష్టించనున్నారు.

న్యూ షెపర్డ్ ప్రత్యేకతలేంటి?
బెజోస్ బృందాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్లే న్యూ షెపర్డ్ స్పేస్ క్రాఫ్ట్ అనేది రాకెట్-అండ్-క్యాప్సూల్‌ను కలిగి ఉన్న వ్యోమనౌక. ఇది ఆరుగురు ప్రయాణికులను భూ ఉపరితలం నుంచి 62 మైళ్ల (100 కి.మీ) కంటే ఎక్కువ ఎత్తుకు.. అంటే సబ్ ఆర్బిటాల్ స్పేస్‌కు మోసుకెళ్లగలదు. ఇది పునర్వినియోగానికి వీలుండే సబ్ ఆర్బిటాల్ రాకెట్ సిస్టమ్ కావడం విశేషం. ఇది వ్యోమగాములు, రిసెర్చ్ పేలోడ్‌లను కర్మాన్ లైన్ (అంతర్జాతీయంగా గుర్తించిన అంతరిక్ష సరిహద్దు) కంటే ఎక్కువ ఎత్తుకు తీసుకెళ్లగలదు.

ఈ రాకెట్ మొత్తం 60 అడుగుల వరకు పొడవు ఉంటుంది. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి అమెరికన్ అయిన అలెన్ షెపర్డ్ పేరుమీదుగా ఈ రాకెట్‌కు ‘న్యూ షెపర్డ్’ అనే పేరు పెట్టారు. బ్లూ ఆరిజిన్ ‘న్యూ గ్లెన్‌’ పేరుతో మరో రాకెట్‌ను అభివృద్ధి చేసింది. అమెరికన్ వ్యోమగామి జాన్ గ్లెన్ పేరు మీదుగా, దానికి ఆ పేరు పెట్టారు. న్యూ గ్లెన్ ఏకంగా 270 అడుగుల పొడవు ఉంటుంది. ఇది పెద్ద పేలోడ్లను కక్ష్యలోకి తీసుకెళ్లగలదు. న్యూ షెపర్డ్, న్యూ గ్లెన్ రెండూ నిలువుగా టేకాఫ్, నిలువుగా ల్యాండింగ్ అవుతాయి. వీటిని అనేకసార్లు అంతరిక్షయానానికి ఉపయోగించవచ్చని బ్లూ ఆరిజిన్ పేర్కొంది.

ఈ అంతరిక్ష యాత్ర సురక్షితమేనా?
న్యూ షెపర్డ్ రాకెట్‌, దాని సేఫ్టీ సిస్టమ్‌ను బ్లూ ఆరిజిన్ 2012 నుంచి పరీక్షిస్తోంది. ఈ ప్రయోగాలు వరుసగా 15 సార్లు విజయవంతమయ్యాయి. అందువల్ల బెజోస్ బృందం చేపట్టనున్న ఈ అంతరిక్ష యాత్రపై ఎలాంటి భద్రతాపరమైన అనుమానాలు అవసరం లేదు. అయితే ఏకంగా సంస్థ అధినేత మొట్టమొదటి ప్రయాణంలో పాల్గొంటున్నందున బ్లూ ఆరిజన్ కొన్ని ప్రత్యేకమైన భద్రత సదుపాయాలు కల్పించింది.

ఈ ఆటేమెటెడ్ క్యాప్సూల్‌లో పైలట్‌లు ఎవరూ ఉండరు. అయితే ప్రయాణంలో ఏదైనా సమస్య తలెత్తితే.. వారు ప్రయాణించే క్యాప్సూల్‌ను బూస్టర్ లేదా రాకెట్‌ నుంచి దూరంగా నెట్టివేసే ‘క్రూ ఎస్కేప్ సిస్టం’ ఇందులో ఉంది. ఈ ఎస్కేప్ సిస్టమ్‌ను సైతం మూడుసార్లు విజయవంతంగా పరీక్షించారు. అనుకోని ప్రమాదంలో క్యాప్సూల్ రాకెట్ నుంచి విడిపోతే.. అది సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయ్యే వ్యవస్థ సైతం ఉంది.

రిచర్డ్ బ్రాన్సన్ యాత్రకు, బెజోస్ యాత్రకు తేడాలేంటి?
వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ కంపెనీ అధినేత అయిన రిచర్డ్ బ్రాన్సన్, మరో ఐదుగురు సిబ్బంది జూలై 12న అంతరిక్ష యాత్ర చేపట్టారు. ప్రైవేట్ స్పేస్ కంపెనీ ద్వారా అంతరిక్షంలోని వెళ్లిన మొదటి వ్యక్తిగా బ్రాన్సన్ రికార్డు సృష్టించారు. కానీ బ్రాన్సన్ సంస్థ రూపొందించిన వ్యవస్థ.. బ్లూ ఆరిజిన్ ఉపయోగించిన విధానానికి చాలా భిన్నంగా ఉంటుంది. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఉపయోగించినది రాకెట్ కాదు. అందులో రెండు విమానాలు కలిసి ఉన్నాయి. ఒక సూపర్ సోనిక్ విమానం ద్వారా ఈ అంతరిక్ష ప్రయాణం విజయవంతమైంది.

కానీ బ్లూ ఆరిజన్ అభివృద్ధి చేసిన క్యాప్సూల్ మాత్రం వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ప్లేన్ కంటే పెద్దగా ఉండనుంది. అంతేకాకుండా న్యూ షెపర్డ్ వినియోగించే లిక్విడ్ హైడ్రోజన్ లేదా లిక్విడ్ ఆక్సిజన్ రాకెట్ ఇంజిన్ ద్వారా ఓజోన్ పొరకు ఎలాంటి నష్టం వాటిల్లదని, వాతావరణంపై ఎలాంటి ప్రభావం పడదని బ్లూ ఆరిజిన్ తెలిపింది. ఈ విషయంలో తాము వర్జిన్ గెలాక్టిక్ కంటే మెరుగ్గా ఉన్నట్లు సంస్థ సిబ్బంది విశ్లేషిస్తున్నారు.
Published by:Krishna Adithya
First published:

Tags: Jeff Bezos

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు