హోమ్ /వార్తలు /బిజినెస్ /

Car Safety: ఎయిర్‌బ్యాగ్స్‌ ఉన్నా కారులో సీట్‌బెల్ట్ పెట్టుకోకపోతే ఇక అంతే సంగతులు.. ఎందుకో తెలుసా?

Car Safety: ఎయిర్‌బ్యాగ్స్‌ ఉన్నా కారులో సీట్‌బెల్ట్ పెట్టుకోకపోతే ఇక అంతే సంగతులు.. ఎందుకో తెలుసా?

(Photo: Global NCAP)

(Photo: Global NCAP)

Car Safety: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణం సీటు బెల్ట్ ప్రాముఖ్యతను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. కారులో ప్రయాణిస్తున్న వారు సీటు బెల్ట్‌ ధరించకపోతే.. ఎయిర్‌ బ్యాగ్‌ ఉన్నా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం కొత్త కారును కొనుగోలు చేస్తున్నవారు సేఫ్టీ ఫీచర్లకు (Safety Features) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) కూడా నిర్ణీత సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేసింది. ఇంతకుముందు ఎక్కువ మైలేజీ ఇచ్చే కారును కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపేవారు. ఇప్పుడు అదే స్థాయిలో సేఫ్టీ ఫీచర్లకు ప్రాధాన్యం పెరిగింది. ఈ పరిణామాలను గుర్తించిన కార్ల తయారీ సంస్థలు.. ఇండియన్ మార్కెట్‌లోకి అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లతో కార్లను లాంచ్‌ చేస్తున్నాయి. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మరణం సీటు బెల్ట్ ప్రాముఖ్యతను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. మిస్త్రీ 5-స్టార్ యూరో ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్-రేటెడ్ కారులో మరణించారు, అయితే ప్రమాదం జరిగిన సమయంలో వెనుక సీటు బెల్ట్ లేకుండా ప్రయాణించినట్లు సమాచారం.

* ప్రభుత్వ నిబంధనలు

2019 జులై నుంచి భారతదేశంలో డ్రైవర్ వైపు ఎయిర్‌బ్యాగ్‌లు (Airbags) తప్పనిసరి అనే రూల్ వచ్చింది. ముందు ప్రయాణికుల వైపు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పకుండా ఉండాలనే రూల్ 2021 ఏప్రిల్ నుంచి అమలవుతోంది. దీంతో సేఫ్టీ ఫీచర్ల విషయంలో భారత ప్రభుత్వ మార్గదర్శకాలను నిపుణులు మెచ్చుకుంటున్నారు.

* ఎయిర్‌బ్యాగ్స్‌ రూల్స్

కారులో సేఫ్టీ ఫీచర్‌ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేవి ఎయిర్‌ బ్యాగ్‌లు. రోడ్డు ప్రమాదాల సమయంలో తీవ్రంగా గాయపడకుండా ఇవి కాపాడతాయి. ఇప్పుడు వస్తున్న దాదాపు అన్ని కార్లలో ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉంటున్నాయి. ధరతో సంబంధం లేకుండా అన్ని కార్లలో డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లను భారత ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అయితే కారులో ఉన్నవారు సీటు బెల్టులు ధరించకపోతే ఎయిర్‌ బ్యాగ్స్ వల్ల ప్రయోజనం ఉండదని వినియోగదారులు గుర్తించాలి.

* సీటు బెల్ట్‌ ధరించకపోతే ప్రమాదం

కారులో ప్రయాణిస్తున్న వారు సీటు బెల్ట్‌ ధరించకపోతే.. ఎయిర్‌ బ్యాగ్‌ ఉన్నా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే సీట్‌ బెల్ట్‌ తప్పకుండా వినియోగించాలి. వెనుక సీటు ప్రయాణికులకు కూడా ఇదే వర్తిస్తుంది. వారికి కూడా త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్‌లు వస్తున్నాయి, వాటిని ఎల్లప్పుడూ ధరించాలి.

ఇది కూడా చదవండి : రైలు ఆలస్యమైతే మీరు ఈ సర్వీస్ ను ఫ్రీగా పొందవచ్చు.. అది మీ హక్కు..!

* సీట్‌ బెల్ట్‌లోనే ఎయిర్‌ బ్యాగ్‌

కారులో ప్రయాణించేవారిని సురక్షితంగా ఉంచడానికి, సీట్‌బెల్ట్‌లు, ఎయిర్‌బ్యాగ్‌లను తీసుకొచ్చారు. వీటి రెండింటి ద్వారానే ప్రయాణికులకు భద్రత లభిస్తుంది. రెండింట్లో ఏదో ఒకటే వినియోగిస్తే ప్రమాదాలు సంభవించినప్పుడు ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు సేఫ్టీ ఫీచర్లు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు.. కారులో ఏ స్థానంలో ఉన్నవారిని అక్కడే ఉంచడానికి, డ్యాష్‌బోర్డ్ వంటి వాటికి ఢీకొని ప్రాణాంతకమైన గాయాల బారిన పడకుండా ఉండటానికి రూపొందించారు.

సీట్‌బెల్ట్ ఒక వ్యక్తిని సీటులోనే ఉండేలా చేస్తుంది. ఎయిర్‌బ్యాగ్ తల, ఛాతీని ఫార్వర్డింగ్ ప్రభావం నుంచి కుషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. కొన్ని హై స్పెసిఫికేషన్లు ఉన్న కార్లు మోకాలి ఎయిర్‌బ్యాగ్‌లు, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తాయి. ఇవి సైడ్ ఇంపాక్ట్ నుంచి రక్షించడానికి ఉపయోగపడతాయి. కారు భద్రతకు సంబంధించి వచ్చిన తాజా ఆవిష్కరణలలో.. Mercedes-Benz S-క్లాస్ వంటి కార్లలో సీట్‌ బెల్ట్‌లోనే ఎయిర్‌బ్యాగ్‌ వస్తోంది. అయితే మిగతా ఎన్ని సేఫ్టీ ఫీచర్లు ఉన్నా, సీటు బెల్టు ధరించకపోతే ప్రమాదాన్ని తప్పించుకోలేరు. సైరస్ మిస్త్రీ ఘటన ఇదే విషయాన్ని మరోసారి నిరూపించింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Airbags, Auto, Car accident, New cars

ఉత్తమ కథలు