news18-telugu
Updated: September 12, 2020, 5:13 PM IST
కంగనా రనౌత్ Photo : Twitter
Kangana Ranaut: కంగనా రనౌత్ ఎపిసోడ్‌తో విమానయాన సంస్థ ఇండిగోకు మొట్టికాయలు పడ్డాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏయివేషన్ ఆ సంస్థకు చీవాట్లు పెట్టింది. రెండు వారాలు నిషేధం విధిస్తామని హెచ్చరించింది. అసలు విషయానికి వస్తే ఇటీవల కంగనా రనౌత్ చండీగఢ్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలోనే వచ్చింది. ఆ విమానంలో కంగనా వస్తుందని తెలుసుకున్న మీడియా ఛానల్స్ ప్రతినిధులు కూడా భారీ ఎత్తున అదే విమానంలో టికెట్లు కొన్నారు. తమ తమ టీవీ ఛానల్స్, అలాగే, పత్రికలకు ఇంటర్వ్యూల కోసం ప్రయత్నాలు చేశారు. ఇంటర్వ్యూల హడావిడిలో వారు కరోనా నిబంధనలు పాటించలేదు. కేంద్ర విమానయాన నిబంధనల ప్రకారం విమానాల్లో ప్రయాణించే వారు మాస్క్‌లు, ఫేస్ కవర్లు తప్పనిసరిగా ధరించాలి. కానీ, ఆ విమానంలోని వారు అవేవీ చేయలేదు. ఈ విషయం డీజీసీఏ దృష్టికి వచ్చింది. దీంతో ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఇండిగోను డీజీసీఏ ఆదేశించింది. అదే సమయంలో అన్ని విమానయాన సంస్థలకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ఏ విమానయాన సంస్థ అయినా సరే కోవిడ్ నిబంధనలు పాటించకపోతే వారి మీద రెండు వారాల పాటు నిషేధం విధిస్తామని హెచ్చరించింది. కేంద్రం విధించిన కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ఇకపై ఏం చేయబోతున్నారో చెప్పాలంటూ ఇండిగోకు లేఖ రాస్తూ, 15 రోజుల గడువులోగా సమాధానం చెప్పాలని కోరింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
September 12, 2020, 5:13 PM IST