తాజా బడ్జెట్లో కస్టమ్ డ్యూటీ తగ్గింపుల వల్ల పెట్టుబడుల్లో బంగారానికి డిమాండ్ పెరుగుతుందా లేదా అని ఇన్వెస్టర్లు విశ్లేషించుకుంటున్నారు. కేంద్ర ప్రభుతం 2021 బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాలు బంగారంలో పెట్టుబడులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. తాజా బడ్జెట్లో ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను తగ్గించింది. ప్రస్తుతం ఇంపోర్ట్ డ్యూటీ 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింది. కానీ దిగుమతులపై ప్రత్యేకంగా 2.5 శాతం సెస్‌ను కూడా విధించారు. ఈ మార్పుల తర్వాత బంగారం దిగుమతులపై 10.75 శాతం వరకు ట్యాక్స్ విధించే అవకాశం ఉంది. వీటన్నింటిని బట్టి చూస్తే బంగారం ధరలు కొంత వరకు తగ్గే అవకాశం ఉందని జ్యువెలర్స్ సంఘాలు చెబుతున్నాయి. దీనివల్ల బంగారానికి డిమాండ్ కూడా పెరగవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇంపోర్ట్ డ్యూటీల తగ్గింపు వల్ల గతేడాదితో పోలిస్తే బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. 2020లో కోవిడ్ కూడా ఈ రంగంపై ప్రతికూల ప్రభావం చూపింది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రారంభం కావడం, సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపిస్తుండటం వల్ల బంగారినికి డిమాండ్ 2019 నాటికి లేదా అంతకంటే ఎక్కువ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని జ్యువెలర్స్ యజమానులు చెబుతున్నారు.
మన దేశంలో బంగారం రేట్లు రూపాయి-డాలర్ ఎక్స్చేంజ్ వ్యాల్యూపై ఆధారపడి ఉంటాయి. మనం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. అందువల్ల రూపాయి విలువ తగ్గిపోతే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. గత ఏడాదిని ప్రామాణికంగా తీసుకున్నప్పుడు.. బంగారంతో పోలిస్తే రూపాయి విలువ 11 శాతానికి పైగా క్షీణించింది. బంగారం ఫియట్ అసెట్ కాదు. కరెన్సీ విలువలో తగ్గుదల ప్రభావం బంగారంపై ఉండదు. ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ విలువ తగ్గుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బంగారాన్ని పెట్టుబడి మార్గంగా ఎంచుకోవడం వల్ల లబ్ధి పొందవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకునే ఆర్థిక పరిణామాల కారణంగా రోజువారీ బంగారం రేట్లలో మార్పులు సాధారణమేనని భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్, దాని సమర్థత, ప్రపంచ ఆర్థిక రికవరీపై పూర్తి స్పష్టత వచ్చేవరకు బంగారం ధరలపై స్పష్టమైన అవగాహన రావడం కష్టమేనని కొంతమంది చెబుతున్నారు. కేవలం ధరల తగ్గుదల కారణంగానే బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశాలు లేవని నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నందున ఆభరణాలు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. దీని వల్ల కూడా బంగారం కొనుగోళ్లు కొంత వరకు పెరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.