భారత్‌లో (India) గత కొన్ని నెలలుగా ఇంధన ధరలపై (Fuel Price) చర్చలు కొనసాగుతున్నాయి. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు తగ్గినప్పటికీ, దేశంలో మాత్రం ఇంధనం ధరలు చాలా నెలలుగా అత్యధికంగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) భారతదేశంలో పెట్రోల్ ధరను రూ.5, డీజిల్ ధరను రూ.10 మేర తగ్గించింది. దీంతో వాహనదారులకు కొంత ఉపశమనం లభించింది. రాష్ట్రాలు కూడా ఇంధనంపై విధిస్తున్న వ్యాట్‌ను (VAT) తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దీంతో వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కొంతవరకు తగ్గాయి. అయితే దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 100 కంటే ఎక్కువగానే ఉన్నాయి.
భారత్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే దేశం కాదు. ఫ్యూయెల్‌ను మన దేశం దిగుమతి చేసుకుంటుంది. దీంతో వినియోగదారులకు అందేసరికి దీని ధర వివిధ పన్నులతో కలిపి చాలా ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా ఏదైనా ఉత్పత్తిని స్థానికంగా తయారు చేసే దేశాల్లో, దాని ధర తక్కువగా ఉంటుంది. ఆ ఉత్పత్తిని దిగుమతి చేసుకునే దేశాల్లో మాత్రం ధరలు ఎక్కువగానే ఉంటాయి. ఇంధనం విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే ఇంధన ధరలను ఉత్పత్తి ఖర్చులతో పాటు అనేక ఇతర అంశాలు ప్రభావితం చేయగలవు. దీంతో వివిధ దేశాల్లో ఫ్యూయెల్ ఖర్చులు ఒకేలా ఉండవు.
Business Idea: వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఐడియా మీకోసమే
* ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయి?
ఇటీవల పెట్రో ధరల పెంపు అంశం దేశంలోని చాలా మందిని కలవరపెడుతోంది. నవంబరు ప్రారంభం వరకు ఆల్ టైమ్ గరిష్ట ధరలతో ప్రజలు పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేశారు. అయితే చాలా పెద్ద మొత్తంలో ధరలు ఉండటంతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా పన్నులను తగ్గించినా ప్రజలకు ఆశించినంత ఉపశమనం లభించలేదనే చెప్పుకోవాలి. కానీ కేవలం భారతదేశంలోనే పెట్రోల్ ధర ఎక్కువగా ఉందనే ప్రచారం సరైనదికాదు. కొనుగోలు శక్తి వంటి ఇతర అంశాలను పక్కన పెడితే ఇతర దేశాల్లో పెట్రోల్‌కు చెల్లించే ధర ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో పెట్రోల్ ధర అత్యధికంగా ఉన్న దేశం హాంకాంగ్. ఆ దేశంలో పెట్రోల్‌ను ఉపయోగించే వారు ఒక లీటర్‌కు $2.618 (సుమారు రూ. 196.55) చెల్లిస్తున్నారు.
తరువాతి స్థానంలో నెదర్లాండ్స్ ఉంది. అత్యధిక పెట్రోల్ ధరల జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఆ దేశం.. ఒక లీటర్ పెట్రోల్‌కు $2.256 లేదా రూ. 169.37 వసూలు చేస్తోంది. ఈ జాబితాలో ఇజ్రాయెల్ మూడో స్థానంలో నిలుస్తోంది. ఆ దేశంలో ఒక లీటరు పెట్రోల్ ధర $2.212 లేదా రూ.166.07గా ఉంది. నార్వే, ఫిన్లాండ్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, డెన్మార్క్, UK, గ్రీస్, ఐస్లాండ్, స్వీడన్.. వంటి దేశాల్లోనూ పెట్రోల్ ధరలు భారీగానే ఉన్నాయి.
* ఈ దేశాల్లో తక్కువ ధరలు..
ప్రపంచంలో అత్యంత చౌకగా పెట్రోల్ లభిస్తున్న దేశం వెనిజులా. ఈ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ ధర $0.025 లేదా రూ.1.88 మాత్రమే. తరువాతి స్థానంలో సిరియా ఉంది. ఇక్కడ ఒక లీటర్ పెట్రోల్ ధర $0.060 లేదా రూ.4.50. చౌకైన పెట్రోల్ ధరల పరంగా అంగోలా మూడో స్థానంలో నిలిచింది. ఈ దేశంలో ఒక లీటర్ పెట్రోల్ ధర $0.274 లేదా రూ. 20.57గా ఉంది. అంగోలా, అల్జీరియా, కువైట్, నైజీరియా, తుర్క్‌మెనిస్తాన్, కజకిస్తాన్, మలేషియా, ఇరాక్ వంటి ఇతర దేశాల్లో కూడా పెట్రోల్ చౌకగా లభిస్తుంది.
* భారతదేశం పరిస్థితి ఏంటి?
నవంబర్ 29 నాటికి భారత్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించిన తర్వాత, వరుసగా 26వ రోజు పెట్రోల్ ధర మారకుండా, స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 103.97కి తగ్గింది. మంగళవారం కూడా ధర అలాగే ఉంది. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 109.98గా ఉంది. మెట్రోపాలిటన్ నగరాల్లో ఇదే అత్యధికం. కోల్‌కతాలో ఆదివారం లీటర్ పెట్రోల్ ధర రూ.104.67గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.40గా ఉంది.
Railway Alert: ఓమిక్రాన్ భయం... మళ్లీ అప్రమత్తమైన భారతీయ రైల్వే
ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే, భారతదేశంలో కూడా పెట్రోల్‌పై వేర్వేరు పన్నులు, సుంకాలు అమల్లో ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంధనంపై అందే రాబడి ముఖ్యమైన ఆదాయ వనరుగా చెప్పుకోవచ్చు. రూపాయి- డాలర్ మారకం విలువతో పాటు ఇంధనం దిగుమతి ఖర్చులు కూడా మన దేశంలో ఫ్యూయెల్ కాస్ట్‌ను ప్రభావితం చేస్తాయి. ఇప్పటికీ UK, జపాన్, స్విట్జర్లాండ్, ఇటలీ, జర్మనీ వంటి దేశాల కంటే భారతదేశంలో పెట్రోల్ ధర చౌకగా ఉంది. అయితే చైనా, పాకిస్థాన్, యూఏఈ, బంగాదేశ్, భూటాన్ వంటి దేశాల కంటే భారత్‌లో లీటర్ పెట్రోల్ ధర ఎక్కువగానే ఉంది.
globalpetrolprices.com ప్లాట్‌ఫాం ద్వారా ప్రపంచ దేశాల్లో ఇంధనం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇందులో ఉన్న సమాచారం ఆధారంగా చూస్తే, పెట్రోల్ ధర అత్యధికంగా ఉన్న జాబితాలో హాంకాంగ్ మొదటి స్థానంలో ఉంది. మొత్తం 168 దేశాల ర్యాంకింగ్స్‌లో వెనిజులా చివరి స్థానంలో ఉంది. మనదేశంలో పెట్రోల్ ధర సగటున రూ.105 వరకు ఉన్నట్లు ఇందులో పొందుపరిచారు. ఈ జాబితాలో భారత్ 56వ స్థానంలో నిలిచింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.