WhatsApp: కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సేతు యాప్ విషం కక్కిన వాట్సప్..నెటిజన్ల ఆగ్రహం..

(ప్రతీకాత్మక చిత్రం)

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్‌ సైతం యూజర్‌ డేటాను తీసుకుంటోందని వాట్సాప్‌ కోర్టుకు వివరించింది. దీంతోపాటు రిపబ్లిక్‌ టీవీకి చెందిన యాప్‌ కూడా తమ యాప్‌ కంటే ఎక్కువ యూజర్‌ సమాచారాన్ని పొందుతోందని చెప్పుకొచ్చింది.

  • Share this:
యూజర్ డేటా ప్రైవసీ... చాలా రోజుల నుండి దేశంలో జరుగుతోన్న చర్చ. ఇందులో ప్రముఖంగా కనిపిస్తోంది వాట్సాప్‌. ఫేస్‌బుక్‌కు చెందిన ఈ యాప్‌ ఇటీవల ప్రైవసీ పాలసీని మార్చింది. కొంతమేరకు డేటాను ఫేస్‌బుక్‌తో పంచుకుంటాం అంటూ కొన్ని నిబంధనలు పెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీనిపై ఆఖరికి ప్రభుత్వం, ఢిల్లీ హైకోర్టు కూడా స్పందించాయి. ప్రైవసీ పాలసీని యాక్సెప్ట్‌ చేసే హక్కు వినియోగదారుడిదే అని తేల్చి చెప్పింది. దీంతో వాట్సాప్‌ తన పాలసీ రోల్‌ అవుట్‌ తేదిని మే 15కు మార్చింది. ఈ తేదీ దగ్గరపడిన నేపథ్యంలో వాట్సాప్‌ దిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇప్పుడు ఆ పిటిషన్‌లో పేర్కొన్న అంశాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

భారతదేశానికి చెందిన చాలా మొబైల్స్‌ యాప్స్‌ యూజర్‌ డేటాను తీసుకుంటున్నాయంటూ ఆ పిటిషన్‌లో వాట్సాప్‌ ప్రస్తావించింది. అందులో మన జనాలు ఎక్కువగా వినియోగించే జొమాటో, బిగ్‌ బాస్కెట్‌, ఓలా, కూ, ట్రూ కాలర్‌ లాంటి యాప్స్‌ ఉన్నాయి. దీంతోపాటు టెక్‌ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, జూమ్‌ను కూడా వాట్సాప్‌ పిటిషన్‌లో ప్రస్తావించింది. తమకంటే ఆ యాప్సే ఎక్కువ సమాచారం సేకరిస్తున్నాయని చెప్పింది. ఆ విధంగా తమ ప్రైవసీ పాలసీ మీద వస్తున్న ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది వాట్సాప్‌. ఈ మేరకు మే5న వాట్సాప్‌ దిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్‌ వేసిందట. కాస్త ఆలస్యంగా ఈ విషయం బయటికొచ్చింది.

ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్‌ సైతం యూజర్‌ డేటాను తీసుకుంటోందని వాట్సాప్‌ కోర్టుకు వివరించింది. దీంతోపాటు రిపబ్లిక్‌ టీవీకి చెందిన యాప్‌ కూడా తమ యాప్‌ కంటే ఎక్కువ యూజర్‌ సమాచారాన్ని పొందుతోందని చెప్పుకొచ్చింది. అంతేకాదు తమ కొత్త ప్రైవసీ పాలసీని ప్రజల ముందుకు తీసుకురావడానికి హైకోర్టు అంగీకరించకపోతే... దేశంలో తమ సేవలకు అంతరాయం కలిగే అవకాశమూ ఉందని చెప్పుకొచ్చింది వాట్సాప్‌. అయితే ఇప్పుడు వాట్సాప్‌ లేవనెత్తిన అంశాలను దిల్లీ హైకోర్టు ఎలా తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆయా యాప్స్‌ విషయంలోనూ దిల్లీ హైకోర్టు విచారణకు ఆదేశిస్తే వాటి ప్రైవసీ పాలసీలోని చాలా అంశాలు చర్చకు వస్తాయి.

అయితే ఈ క్రమంలో వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ విషయం ఇంకొన్నాళ్లు ఆగుతుంది. వాట్సాప్‌ న్యాయస్థానానికి చెప్పినట్లు దాని వల్ల వాట్సాప్‌ సేవలు మన దేశంలో అగిపోయే అవకాశమూ ఉంది. దీంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడే ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. వాట్సాప్‌ ప్రైవసీ పాలసీ విషయంలో మంకుపట్టుపడితే వినియోగదారులు వేరే యాప్స్‌ వైపు కచ్చితంగా వెళ్తారు. ఇప్పటికే సిగ్నల్‌ లాంటి మెసేజింగ్‌ యాప్‌లను యూజర్లు స్టాండ్‌బైగా వాడుతున్నారు కూడా. చూద్దాం మరి న్యాయస్థానం ఏమంటుందో, వాట్సాప్‌ ఏం చేస్తుందో!
Published by:Krishna Adithya
First published: