Home /News /business /

WHATS NEXT FOR JEFF BEZOS SPACE CLIMATE AND MEDIA MAY ALL FIGURE MK GH

Jeff Bezos: అమెజాన్ సీఈఓగా వైదొలిగిన జెఫ్ బెజోస్.. ఇప్పుడేం చేయ‌నున్నారు?

జెఫ్ బెజోస్

జెఫ్ బెజోస్

Jeff Bezos: అంత‌రిక్షంలో క‌నీసం ఓ మూడు, నాలుగు మిలియ‌న్ల మంది ప్ర‌జ‌ల‌కు స‌రిప‌డా పార్కులు, హోట‌ళ్ళు, కాల‌నీలు నిర్మించాల‌న్న‌ది బెజోస్ క‌ల‌. ఇందుకోసం ఆయ‌న బ్లూ ఆరిజిన్ అనే స్పేస్ కంపెనీని స్థాపించాడు.

జెఫ్ బెజోస్‌... ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆన్‌లైన్ వ్యాపార దిగ్గ‌జం అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓగా ఆయన సుప్ర‌సిద్ధుడు. అమెజాన్ సీఈఓ బాధ్యతల నుంచి బెజోస్ తాజాగా వైదొలిగారు. ఆయన వార‌సుడిగా ఆండీ జెస్సీ ఇప్ప‌టికే నియ‌మితుల‌య్యారు. 1.7 ట్రిలియ‌న్ డాలర్లు విలువ చేసే అమెజాన్ కంపెనీ సీఈఓగా నిష్ర్క‌మిస్తున్న బెజోస్.. అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్ కాబోతున్నారు. ఆ కంపెనీలో అతిపెద్ద‌ వాటాదారుగానూ కొన‌సాగ‌నున్నారు. ఓ పాతికేళ్ళ కింద‌ట టెక్ కంపెనీల‌కు కేంద్ర‌మైన సియాటెల్‌లో ఆయ‌న ఓ గ్యారెజీలో అమెజాన్‌ను స్థాపించారు. తాను పెంచిపోషించిన కంపెనీలోని కీల‌క‌ బాధ్య‌త‌ల‌నుంచి దిగిపోతున్న 57 ఏళ్ళ జెఫ్ బెజోస్.. 13 లక్ష‌ల‌మంది అమెజాన్ ఉద్యోగుల‌ను ఫెలో అమెజానియ‌న్స్‌గా సంబోధిస్తుంటారు. సంస్థ బాధ్యతల నుంచి వైదొలుగుతున్న సందర్భంగా.. త‌న స‌రికొత్త ప్ర‌యాణం గురించి ఉత్స‌హాంగా ఉన్న‌ట్టు బెజోస్ తెలిపారు.

ఈ నిరంత‌ర ఆలోచ‌నాప‌రుడు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త విష‌యాల‌పై దృష్టిసారిస్తుంటారు. కొత్త ఉత్ప‌త్తులు, కొత్త సంస్థ‌లు ఇలా ఏదైనా కొత్త‌గా చేయ‌డ‌మే జెఫ్ బెజోస్‌కు ఇష్టం. ఆయ‌నిప్పుడు అంత‌రిక్షంలోకి అడుగుపెట్టాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. అంత‌రిక్షంలో క‌నీసం ఓ మూడు, నాలుగు మిలియ‌న్ల మంది ప్ర‌జ‌ల‌కు స‌రిప‌డా పార్కులు, హోట‌ళ్ళు, కాల‌నీలు నిర్మించాల‌న్న‌ది బెజోస్ క‌ల‌. ఇందుకోసం ఆయ‌న బ్లూ ఆరిజిన్ అనే స్పేస్ కంపెనీని స్థాపించాడు.

బ్లూ ఆరిజిన్.. ఏరో స్పేస్ కంపెనీ
హైస్కూల్ చ‌దువులో తొలి ర్యాంకులో నిలిచిన బెజోస్ 1982లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సంద‌ర్భంలో మియామి హెరాల్డ్ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో.. ఆనాడే త‌న స్పేస్ కంపెనీ గురించి తెలిపాడంటే బెజోస్‌కు ఎంత‌టి ముందుచూపుందో అర్థం చేసుకోవ‌చ్చు. 18 ఏళ్ళ వ‌య‌సులో ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బెజోస్ మాట్లాడుతూ.. ‘స్పేస్ హోట‌ల్స్‌, అమ్యూజ్‌మెంట్ పార్కులు, కాల‌నీల‌ను క‌ట్టాల‌న్న‌ది నా కోరిక‌. క‌నీసం 20, 30 ల‌క్ష‌ల‌ మందికి అంత‌రిక్షంలో ఈ సౌక‌ర్యాల‌ను అందుబాటులోకి తీసుకురావాల‌నుకుంటున్నా’ అని చెప్పారు.

యుక్త వ‌య‌సులో తాను చెప్పిన మాట‌ల‌ను నిజం చేయ‌డానికి బెజోస్ బ్లూ ఆరిజిన్ అనే ఏరోస్పేస్ కంపెనీని స్థాపించారు. ‘భూమి మ‌నంద‌రి ఉమ్మ‌డి ఆస్తి. దీన్ని కాపాడుకోవ‌డం మ‌నంద‌రి బాధ్య‌త‌. భూమిపై నుంచి కొంద‌రినైనా అంత‌రిక్ష ఆవాసాల‌కు త‌ర‌లించ‌డ‌మే నా ధ్యేయ‌’మ‌ని చెప్పే బెజోస్ జులై 20న త‌న సోద‌రుడు మార్క్‌తో క‌లిసి న్యూషెప‌ర్డ్ స్పేస్ క్యాప్సుల్‌లో అంత‌రిక్ష ప్ర‌యాణానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ‘నాకు ఐదేళ్ళ వ‌య‌సున్న‌ప్ప‌టి నుంచి అంత‌రిక్షానికి వెళ్లాలనే కోరిక ఉండేది’ అంటూ బెజోస్ త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో తెలిపారు. తన సోద‌రుడు, మంచి మిత్రుడు అయిన మార్క్‌తో క‌లిసి ఈ సాహ‌స యాత్ర చేయ‌బోతున్నానని బెజోస్ చెప్పారు.

వాషింగ్ట‌న్ పోస్ట్ దిశ మార్చాడు
వాషింగ్ట‌న్ పోస్ట్.. అమెరికాలో ప్ర‌సిద్ధి చెందిన ప‌త్రిక‌. ఇప్పుడీ ప‌త్రికకు ఎక్కువ స‌మ‌యం కేటాయించాల‌ని బెజోస్ భావిస్తున్నారు. బెజోస్‌కు ఈ ప‌త్రిక‌కు సంబంధం ఏమిట‌నుకుంటున్నారా? 2013లో 250 మిలియ‌న్ డాల‌ర్ల‌కు ఈ ప‌త్రిక‌ను బెజోస్‌ సొంతం చేసుకున్నారు. అప్ప‌టికే ఆ ప‌త్రిక ప్ర‌భ క్షీణిస్తోంది. భ‌విష్య‌త్తు అగ‌మ్య‌గోచ‌రంగా మారుతున్న వేళ బెజోస్ రంగ ప్ర‌వేశం చేశారు. వాషింగ్ట‌న్ పోస్ట్‌ను డిజిట‌ల్ ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశారు. అమెజాన్‌లోని కిండ్లేలోనూ ఈ ప‌త్రిక ల‌భ్య‌మ‌య్యేలా చేశాడు. డిజిట‌ల్ బాట ప‌ట్టాక వాషింగ్ట‌న్ పోస్ట్ దిశ మారింది. ‘నిజానికి నాకు వార్తా ప‌త్రిక‌ల వ్యాపారం గురించి ఏమీ తెలియ‌దు. కానీ నాకు ఇంట‌ర్నెట్ గురించి కొంచెం తెలుసు’ అని చెప్పే బెజోస్ వాషింగ్ట‌న్ పోస్ట్‌ను నెటిజ‌న్ల మ‌న‌సులో నిల‌ప‌డంలో విజ‌యం సాధించాడు.

విరాళాల మోత‌..
అప‌ర‌ కుబేరుడైన బెజోస్ సంపద 199 బిలియన్ డాల‌ర్ల కంటే ఎక్కువగానే ఉంటుంది. మంచి పనుల కోసం ఆయ‌న తరచుగా విరాళాలు ఇస్తుంటారు. అయితే వారెన్‌ బ‌ఫెట్‌, బిల్‌గేట్స్ క‌లిపి ఏర్పాటుచేసిన గివింగ్ ప్లెడ్జ్‌లో సంత‌కం చేయ‌నిది బెజోస్ ఒక్క‌రే. ప్ర‌పంచ‌లోని కుబేరులంద‌రూ త‌మ సంప‌ద‌లో క‌నీసం స‌గ‌మైనా దాతృత్వ కార్యక్ర‌మాల‌కు విరాళాలుగా ఇవ్వాల‌న్న‌ది ఈ గివింగ్ ప్లెడ్జ్ ఆంత‌ర్యం. దీనిపై సంత‌కం చేయ‌క‌పోయినా బెజోస్ త‌న దాతృత్వాన్ని చాటుతూనే ఉన్నారు.

2018లో త‌న సంప‌ద‌లో ఒక‌శాతం.. అంటే రెండు బిలియ‌న్ డాల‌ర్ల‌ను ‘బెజోస్ డే వ‌న్ ఫండ్‌’కు విరాళం ఇచ్చారు. దీని ద్వారా ఇళ్ళు లేనివారికి అల్పాదాయ‌ వ‌ర్గాల‌ చిన్నారుల చ‌దువుకు స‌హాయ‌ప‌డుతున్నారు. అలాగే ప‌ది బిలియ‌న్లతో బెజోస్ ‘ఎర్త్ ఫండ్’ను ఏర్పాటు చేశారు. వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల‌ను, సంక్షోభాల‌ను ఎదుర్కోవ‌డానికి ఈ ఫండ్ ద్వారా సైంటిస్టుల‌ను, యాక్టివిస్టుల‌ను ప్రోత్స‌హిస్తున్నారు.

‘వాతావ‌ర‌ణ మార్పులే భూమికి అతిపెద్ద స‌వాలు. వాతావ‌ర‌ణ మార్పులు తీసుకువ‌చ్చే అన‌ర్థాల‌పై పోరాడేందుకు అంద‌రం ఏక‌మ‌వ్వాలి. భూమిని ర‌క్షించుకోవాలి. భూమి స‌హ‌జత్వాన్ని కాపాడుకోవ‌డానికి ప‌నిచేసే సైంటిస్టుల‌కు,యాక్టివిస్టుల‌కు, ఎన్జీవోలకు ఎర్త్ ఫండ్ ఆర్థికంగా అండ‌గా నిలుస్తుంది. భూమిని మ‌నం ర‌క్షించుకోవాలి. ఇది ఉమ్మ‌డిగా జ‌ర‌గాల్సిన ప‌ని. పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీల దాకా ప్ర‌పంచ‌దేశాలు, సంస్థ‌లు, వ్య‌క్తులు ఇలా అంద‌రూ ఏక‌మైతేనే మ‌నం భూమిని వాతావ‌ర‌ణ మార్పుల నుంచి ర‌క్షించుకోగ‌ల‌ం’ అని బెజోస్ తెలిపారు.

అంత శ‌క్తిమంతుడిని కాను!
ఈ సృజ‌నాత్మ‌క వ్యాపార దిగ్గ‌జం కాలు పెట్టిన ప్ర‌తిచోట విజ‌య‌ప‌తాకం ఎగుర‌వేశారు. ఇన్ని చేసినా త‌న‌ను తాను శ‌క్తిమంతుడిగా భావించ‌రు బెజోస్‌. ‘నాకు తెలిసి నేనేమీ అంత శ‌క్తిమంతుడిని కాదు. నాకు తెలిసింద‌ల్లా కొత్త‌వాటిని ప్రారంభించ‌డం, వాటికోసం నా శ‌క్తియుక్తుల‌ను కేటాయించ‌డ‌మే’ అంటారు.

అమెజాన్‌ లాంటి కంపెనీని స్థాపించారు. వాషింగ్ట‌న్ పోస్ట్‌ను డిజిటలైజ్ చేశారు. ఏరోస్పేస్ కంపెనీ ప్రారంభించారు. త‌న సంప‌ద‌ను విరాళంగా ఇచ్చి దాతృత్వం చాటుకుంటున్నారు. ఇన్ని విషయాల్లో ప్రసిద్ధి చెందిన బెజోస్ ప్ర‌యాణంలో.. త‌రువాత మైలురాయి ఏంటనేది తెలియాల్సి ఉంది. అయితే ఆయన ముందు ఇప్పటికే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ క్రమంలో.. త్వ‌ర‌లో అంత‌రిక్షంలోనూ మాన‌వాళి జెండా రెప‌రెప‌లాడేందుకు రంగం సిద్ధం చేస్తున్న జెఫ్ బెజోస్‌కు ఆల్ దిబెస్ట్ చెపుదాం.
Published by:Krishna Adithya
First published:

Tags: Jeff Bezos

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు