దేశ వాణిజ్య రంగంలో ‘పంప్ అండ్ డంప్’ స్కామ్ (Pump and Dump Scam) సంచలనం సృష్టించింది. సాధన బ్రాడ్‌కాస్ట్, తదితర మీడియా సంస్థలు ఈ ‘పంప్ అండ్ డంప్’ స్కామ్‌కి పాల్పడి భారీ మొత్తంలో ఆర్జించాయి. చివరికి సెబీ చేతికి దొరికిపోయాయి. దీంతో ఈ ‘పంప్ అండ్ డంప్’ స్కామ్ గురించి ఇన్వెస్టర్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. మరి, ఈ ‘పంప్ అండ్ డంప్’ స్కామ్ అంటే ఏంటి? ఈ స్కామ్‌ని ఏ విధంగా అమలు చేస్తారు? అనే విషయాలను తెలుసుకుందాం.
* ‘పంప్ అండ్ డంప్’ అంటే?
ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ ప్లాట్‌ఫాంలలో ప్రసారమయ్యే కంటెంట్‌ని చూసి స్ఫూర్తి పొందేవారు ఎక్కువ. దీనినే ఆసరాగా చేసుకుని ఈ ‘పంప్ అండ్ డంప్’ స్కామ్‌కి తెరలేపారు. తమ కంపెనీలకు సంబంధించిన షేర్‌ల గురించి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా నకిలీ ప్రచారాన్ని కల్పిస్తారు. కంపెనీ షేర్లను కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో అధిక రిటర్న్‌లను పొందవచ్చని వీడియోల ద్వారా నమ్మిస్తారు. దీనినే మార్కెట్ పరిభాషలో ‘పంప్’గా వ్యవహరిస్తాం.
యూట్యూబ్ వీడియోల ద్వారా ఇన్వెస్టర్లను ఉసిగొల్పి షేర్‌లను కొనుగోలు చేయిస్తారు. ఇన్వెస్టర్లు కొనుగోలు చేసే సమయంలో షేర్ విలువను అధికంగా చూపిస్తారు. ఫలితంగా అధిక విలువకు షేర్‌ని విక్రయిస్తారు. అనంతరం షేర్ వాల్యూని తగ్గించి ఆ భారాన్ని ఇన్వెస్టర్లపై మోపుతారు. ఇలా అధిక వాల్యూకి షేర్‌ని విక్రయించి స్టాక్‌హోల్డర్లు లాభపడుతారు. దీనినే ‘డంప్’ అని పిలుస్తాం. ఇలా దురుద్దేశ పూర్వకంగా షేర్ వాల్యూని అధికంగా చూపించి ఇన్వెస్టర్లతో కొనుగోలు చేయించే మోసపూరిత ప్రణాళికను ‘పంప్ అండ్ డంప్’ స్కామ్‌గా అభివర్ణిస్తారు.
ఇది కూడా చదవండి :ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఇలాంటి హాట్ డీల్ మళ్లీ రాదు భయ్యా!
* సెబీ ఎలా గుర్తించింది?
‘పంప్ అండ్ డంప్’ స్కామ్‌కి పాల్పడిన సాధన బ్రాడ్‌కాస్ట్ తదితర సంస్థలకు చెందిన షేర్ వాల్యూ గతేడాది ఏప్రిల్-జూన్ మధ్యలో అసాధారణంగా పెరిగిపోవడాన్ని సెబీ గుర్తించింది. దీనిపై సెబీ పరిశీలన చేయగా.. ఈ యూట్యూబ్ ‘పంప్ అండ్ డంప్’ స్కామ్ వెలుగులోకి వచ్చింది. భారీ ఎత్తున మోసపూరిత వీడియోలను అప్‌లోడ్ చేసి ఇన్వెస్టర్లను ప్రభావితం చేశాయని సెబీ గుర్తించింది. అనంతరం వీటిని మోసపూరిత సంస్థలుగా సెబీ పేర్కొంది.
* వీటిపై నిషేధం
మోసపూరిత ప్రకటనల ద్వారా ఇన్వెస్టర్లను మోసం చేసిన 31 కంపెనీలను సెబీ సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి తొలగించింది. మోసపూరితంగా ఈ కంపెనీ అధినేతలు ఆర్జించిన రూ.41.85 కోట్లను సెబీ సీజ్ చేసింది. ప్రముఖ యాక్టర్ అర్షద్ వార్సితో పాటు అతడి భార్య మరియా గోరెట్టి, యూట్యూబర్ మనీష్ మిశ్రా, సాధన బ్రాడ్‌కాస్ట్ ప్రమోటర్లు, వరుణ్ మీడియాలను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి సెబీ తొలగించింది. అయితే, వీరు యూట్యూబ్ ‘పంప్ అండ్ డంప్’ స్కామ్‌కి పాల్పడినట్లు సెబీ పేర్కొంది.
* ఇన్వెస్టర్లు జాగ్రత్త
ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం తీవ్రమైందని చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. యూట్యూబ్ ‘పంప్ అండ్ డంప్’ స్కామ్ ద్వారా ఇన్వెస్టర్లను మోసం చేసిన ఘటనతో ఔత్సాహిక ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పెట్టుబడి పెట్టేందుకు సిద్ధం కావాలని చెబుతున్నారు. అనూహ్యంగా కంపెనీ విలువ పెరిగిందంటే కాస్త అనుమానించాలని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sebi, Share price, Youtube