2020-2021 ఆర్థిక సంవత్సరానికి 2021-2022 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్‌ను పన్ను చెల్లింపుదారులు డిసెంబర్, 31లోగా దాఖలు చేయాల్సి ఉంది. కొందరు పన్ను చెల్లింపుదారులు తమ అకౌంట్లను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అయినప్పటికీ వీరు కూడా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈసారి అందరితో పాటు ఈ తరహా పన్ను చెల్లింపుదారులు కూడా డిసెంబర్ 31లోగా ఐటీఆర్ ఫైల్ దాఖలు చేయాలని ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఒకవేళ ఈ వర్గానికి చెందిన పన్ను చెల్లింపుదారులు 31 డిసెంబర్, 2021లోపు తమ ఐటీఆర్‌ను ఫైల్ చేయకపోతే ఏం జరుగుతుందో? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
గడువు తేదీ కూడా ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీనా?
గడువు తేదీ (due date - డ్యూ డేట్), చివరి తేదీ (last date) మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ పన్ను చెల్లింపుదారులు మాత్రం డ్యూ డేట్ అనేదే లాస్ట్ డేట్ అని అనుకుంటారు. గడువు తేదీ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేయడం అస్సలు కుదరదనే భావనలో ఉంటారు. కానీ ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఉండే గడువు తేదీ, చివరి తేదీ రెండు వేర్వేరు. గడువు తేదీ దాటాక కూడా మీరు చివరి తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు.
ఆడిట్ చేయవలసిన అవసరం లేని పన్ను చెల్లింపుదారులందరికీ యేటా ఐటీఆర్ సమర్పించడానికి గడువు తేదీ జూలై 31 వరకు ఉంటుంది. చివరి తేదీ డిసెంబర్ 31 వరకు ఉంటుంది. దీని ప్రకారం పన్ను చెల్లింపుదారులు డ్యూ డేట్ లోపు కాకపోయినా చివరి తేదీలోగా ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. అయితే ఈసారి కరోనా దృష్ట్యా అటువంటి పన్ను చెల్లింపుదారుల కోసం 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు, చివరి తేదీలను వరుసగా డిసెంబర్ 31, 2021, 31 మార్చి 2022 వరకు పొడిగించడం జరిగింది.
గడువు తేదీలోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఏం జరుగుతుంది?
ఒకవేళ మీరు మీ ప్రస్తుత ఐటీఆర్‌ను పొడిగించిన గడువు తేదీలోగా అంటే 31 డిసెంబర్ 2021లోగా ఫైల్ చేయకపోతే మీరు 31 మార్చి 2022లోపు దాఖలు చేయొచ్చు. కానీ ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన ఏవైనా నష్టాలను మీరు ఫార్వార్డ్ చేసే హక్కును కోల్పోతారు. ఈ నష్టాలను ప్రస్తుత సంవత్సర ఆదాయంలో సెట్ చేయడం కూడా సాధ్యం కాదు. అందువల్ల డ్యూ తేదీలోగా రిటర్న్స్ ఫైల్ చేయడం చాలా మంచిది.
ఒకవేళ మీరు చెల్లించే పన్నులు మీ పన్ను బాధ్యత కంటే ఎక్కువగా ఉండి.. చెల్లించిన అదనపు పన్నులకు వాపసు పొందే అర్హత ఉంటే.. ఆలస్యం చేసినందుకుగాను చెల్లించిన అదనపు పన్నుపై వడ్డీని పొందే హక్కును మీరు కోల్పోతారు. ఒకవేళ మీరు చెల్లించే పన్నులు మీ మొత్తం పన్ను బాధ్యత కంటే తక్కువగా ఉన్నట్లయితే, అటువంటి లోటుకు ఆలస్య తేదీ వరకు వడ్డీ చెల్లించాలి.
గడువు తేదీ తర్వాత మీ ఐటీఆర్ ఫైల్ చేస్తే ఏం జరుగుతుంది?
పైన పేర్కొన్న ఇబ్బందులతో పాటు మీరు మరికొన్ని పరిణామాలను చవి చూడాల్సి ఉంటుంది. పన్ను వర్తించే మీ ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉండి.. గడువు తేదీ తర్వాత ఐటీఆర్ సబ్‌మిట్ చేసినట్లయితే.. మీరు మీ ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో తప్పనిసరిగా రూ.5 వేల ఫ్లాట్ ఆలస్య రుసుమును చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ మీ ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్నట్లయితే ఆలస్య రుసుముగా రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది.
చివరి తేదీలోగా కూడా ఐటీఆర్‌ను ఫైల్ చేయని పక్షంలో ఏం జరుగుతుంది?
పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను పొడిగించిన గడువు తేదీలోగా అంటే చివరి తేదీ 31 మార్చి 2022లోగా ఫైల్ చేయని పక్షంలో.. ఆదాయపు పన్ను శాఖ కనీసం 50% పన్నుకు సమానమైన జరిమానాను విధించవచ్చు. పన్ను శాఖ నోటీసులకు స్పందించి మీరు మీ ఐటీఆర్‌ను ఫైల్ చేసే తేదీ వరకు ఆదాయపు పన్నుపై వడ్డీ కలిసి ఉంటుంది.
గడువు తేదీలోగా మీరు మీ ఐటీఆర్‌ను ఫైల్ చేయకపోతే, మీపై ప్రాసిక్యూషన్ ప్రారంభించి, మిమ్మల్ని కటకటాల వెనక్కి నెట్టే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. మూడేళ్ల నుంచి ఏడేళ్ల జైలు శిక్ష ప్రభుత్వం విధించవచ్చు. ప్రతి సందర్భంలోనూ డిపార్ట్‌మెంట్ మీపై ప్రాసిక్యూషన్‌ను ప్రారంభించగలదని కాదు కానీ ఎగవేత కోరిన పన్ను మొత్తం రూ. 10,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రమే ఆదాయ శాఖ ప్రాసిక్యూషన్ ప్రారంభించగలదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.