Wedding Loans: పెళ్లి కోసం అప్పులు.. బ్యాంకుల్లో భారీగా పెరిగిన లోన్స్.. కరోనా కాలంలో తప్పట్లేదు మరి..

ప్రతీకాత్మక చిత్రం

Wedding loans: సెకండ్ వేవ్ నేపథ్యంలో ఎక్కువగా రుణాలు తీసుకోవడానికి ప్రధాన కారణం పెళ్లిళ్ళే అని అధ్యయనంలో తేలింది. ఇతర అవసరాల కోసం తీసుకున్న రుణాల కంటే పెళ్లి తరహా రుణాలకే ఎక్కువ డిమాండ్ ఏర్పడడం విశేషం.

  • Share this:
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన లక్షలాది ప్రజలకు రోజువారీ ఖర్చులను భరించడం కూడా భారమైపోయింది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ సమయంలోనే ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. చాలా కుటుంబాల్లో వైద్య చికిత్స కోసం పెట్టిన ఖర్చులు పోగా చిల్లిగవ్వ కూడా మిగల్లేదు. దాంతో చాలామంది రిటైల్ కస్టమర్లు రుణాలను తీసుకుంటున్నారు. తాజాగా భారతీయుల రుణాలకు సంబంధించి చేపట్టిన ఓ అధ్యయనం ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది. ప్రముఖ డిజిటల్ లోన్స్ ప్లాట్ ఫామ్ ఇండియాలెండ్స్ భారత యువతపై (20-35 ఏళ్ల వయసున్న వారిపై) ఒక అధ్యయనం నిర్వహించింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఎక్కువగా రుణాలు తీసుకోవడానికి ప్రధాన కారణం పెళ్లిళ్ళే అని ఈ అధ్యయనంలో తేలింది.

ఇతర అవసరాల కోసం తీసుకున్న రుణాల కంటే పెళ్లి తరహా రుణాలకే ఎక్కువ డిమాండ్ ఏర్పడడం విశేషం. ఫస్ట్ వేవ్ సమయంలో వివాహ రుణాల (వెడ్డింగ్ లోన్స్) శాతం 22%గా ఉందని అధ్యయనం వెల్లడించింది. కానీ సెకండ్ వేవ్ సమయంలో పెళ్లి కోసం తీసుకునే రుణాలు 33 శాతానికి పెరిగాయని తెలిపింది. దీంతో కరోనా సమయంలో అన్ని ఇతర రుణాల కంటే పెళ్లి రుణాలే ఎక్కువగా ఉన్నాయని ఇండియాలెండ్స్ నివేదించింది.

ఇక వ్యాపారం కోసం తీసుకునే రుణాల శాతం కూడా పెరిగింది. సెకండ్ వేవ్ సమయంలో బిజినెస్ లోన్స్ 16 నుంచి 23 శాతానికి పెరిగింది. గృహ అవసరాల నిమిత్తం తీసుకునే రుణాల శాతం గణనీయంగా తగ్గింది. ఇంటి అవసరాల నిమిత్తం తీసుకునే రుణాల శాతం 40 నుంచి 24 శాతానికి పడిపోయింది. దీన్నిబట్టి ప్రజలు అంతగా అవసరం లేని రుణాలు తీసుకోవడానికి సుముఖత చూపలేదని తెలుస్తోంది.

ఇండియాలెండ్స్ ప్లాట్ ఫామ్ అంతర్జాతీయ యువత దినోత్సవం సందర్భంగా వారి రుణాల గురించి సమాచారం సేకరించింది. ఈ అధ్యయనాన్ని ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, జైపూర్, అహ్మదాబాద్, పూణే నగరాలలో స్వయం ఉపాధి పొందిన, జీతాలకు పనిచేసే భారత యువతపై నిర్వహించింది. ఈ అధ్యయనం 2020 ఆగస్టు నుంచి జూలై 2021 వరకు కొనసాగింది. ఈ స్టడీలో మొత్తం 11 వేల మంది యువత పాల్గొన్నారు. పెళ్లి, వ్యాపారం, విద్య, ప్రయాణం, గృహ, వైద్య, ద్విచక్ర వాహనం, ఇంకా ఇతర ప్రధాన విభాగాలలో యువత తీసుకున్న రుణాల వివరాలను అధ్యయనం సేకరించింది.
Published by:Shiva Kumar Addula
First published: