సామాన్య ప్రజలు సైతం అంతరిక్షంలో పర్యటించే రోజులు రాబోతున్నాయి. రోదసీలోకి వెళ్ళాలంటే ఇకపై పెద్ద చదువులు చదివి వ్యోమగామి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతరిక్షంలో విహరించాలన్న చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునే సమయం ప్రతి ఒక్కరికి రానే వచ్చింది. ప్రస్తుతం అపరకుబేరులు మాత్రమే అంతరిక్షయానం చేయగలరనే భావన అందరిలో ఉంది. కానీ అతి సాధారణ ప్రజలు సైతం అంతరిక్షంలోకి వెళ్లి రావచ్చు. అది కూడా ఉచితంగానే..! అయితే ఈ సువర్ణావకాశం చేజిక్కించుకోవాలంటే అదృష్టం ఉండాలి. ఒక ప్రత్యేకమైన లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన వారు ఉచితంగా అంతరిక్షంలో కాసేపు సమయం గడిపి రావొచ్చు. మరి అటువంటి లక్కీ డ్రాలు ఆఫర్ చేస్తున్న స్పేస్ కంపెనీలు ఏంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం. అలాగే, డబ్బులు తీసుకొని అంతరిక్షంలో తీసుకెళ్లే కంపెనీల గురించి కూడా తెలుసుకుందాం.
1. వర్జిన్ గెలాక్టిక్ లక్కీ డ్రా:
రిచర్డ్ బ్రాన్సన్ సొంత కంపెనీ అయిన వర్జిన్ గెలాక్టిక్ 2 టికెట్లు ఉచితంగా ఇచ్చేందుకు లక్కీ డ్రా నిర్వహిస్తోంది. లక్కీడ్రాలో విజేతగా నిలిచిన ఒక వ్యక్తికే 2 టికెట్స్ ఇచ్చేస్తారు. విజేత తన రెండో టికెట్ తో తన స్నేహితులను లేదా బంధువులను తనతో పాటు తీసుకురావచ్చు. అయితే వీరు తొలి వర్జిన్ గెలాక్టిక్ కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ లో ప్రయాణించాల్సి వుంటుంది. వర్జిన్ గెలాక్టిక్ ఏజెన్సీ తన తొలి కమర్షియల్ ఫ్లైట్ ని 2022లో అంతరిక్షంలోకి పంపించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే లక్కీడ్రా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమయింది. సెప్టెంబర్ 1 నాటికి లక్కీడ్రా ప్రక్రియ ముగుస్తుంది. సెప్టెంబర్ 29న విజేత ఎవరో ప్రకటిస్తారు. ఈ లక్కీడ్రాలో భారతీయులు కూడా రిజిస్టర్ కావచ్చు.
2. జారెడ్ ఇస్సాక్‌మాన్ లక్కీ డ్రా.
స్పేస్ఎక్స్ సంస్థకి కస్టమర్ అయిన 37 ఏళ్ల బిలియనీర్ జారెడ్ ఇస్సాక్‌మాన్ 3-4 రోజుల పాటు అంతరిక్షంలో యాత్ర చేయబోతున్నానని ప్రకటించారు. ఇస్సాక్‌మాన్ స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన 4 సీట్ల క్రూ డ్రాగన్ తో పాటు ఒక అంతరిక్ష నౌకను ప్రయోగించే రాకెట్‌ను అద్దెకు తీసుకున్నారు. ఐతే ఆ అంతరిక్ష నౌకలో రెండు సీట్లను ఒక పిల్లల క్యాన్సర్ ఆసుపత్రికి ఇస్తానని ప్రకటించారు. ఆ రెండు సీట్లలో క్యాన్సర్ ఆసుపత్రి నుంచి ఇద్దరు అంతరిక్షయానం చేస్తారు. మూడవ సీటులో ఇస్సాక్‌మాన్ కూర్చుంటారు. ఇక మిగిలిన నాలుగవ సీట్ కోసం ఒక లక్కీడ్రా నిర్వహిస్తున్నారు. లక్కీడ్రాలో విజేతగా నిలిచిన ఎవరైనా సరే ఉచితంగా ఇస్సాక్‌మాన్ తో కలసి అంతరిక్షంలో 4 రోజుల సమయం గడపవచ్చు.
3. నాసా, ఆక్సియం ప్రైవేట్ వ్యోమగామి:
ఆక్సియం స్పేస్ కంపెనీ యాక్స్-1 పేరిట ప్రైవేటు వ్యోమగాములను ఆకాశంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యింది. ఇందుకోసం వ్యోమగాములు 55 మిలియన్ డాలర్లు చెల్లించి సీట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ యాత్రకు సంబంధించి అన్ని టికెట్స్ బుక్ అయ్యాయి. ఈ వ్యోమనౌకా జనవరి 2022లో అంతరిక్షంలోకి వెళ్లనుంది. అయితే, దీని తర్వాత యాక్స్-2 మిషన్ పేరిట ప్రైవేటు వ్యోమగాములను రోదసిలోకి తీసుకెళ్లేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ మిషన్ కి సంబంధించి రెండు టికెట్స్ ఇంకా బుక్ కాలేదు. ఆ టికెట్స్ పొందాలనుకుంటే ఆక్సియం అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోండి. టికెట్ ధర 55 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉండొచ్చు.
4. డియర్ మూన్ ప్రాజెక్ట్:
అంతరిక్షంలోకి వెళ్లి కేవలం భూమి చుట్టూ తిరిగి రావటం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు కొందరు ఇష్టపడరు. అయితే అటువంటి వారికోసం జపనీస్ బిలియనీర్ యుసాకు మేజావా స్పేస్ఎక్స్తో కలిసి ఒక అద్భుతమైన మిషన్ ప్లాన్ చేస్తున్నారు. ఆయన ప్లాన్ చేసే మిషన్ ద్వారా చంద్రుని చుట్టూ తిరిగి రావచ్చు. అయితే ప్రస్తుతం సామాన్య ప్రజలకు టికెట్స్ ఆఫర్ చేయడం లేదు. కానీ త్వరలోనే ఈ ప్రాజెక్టు ద్వారా సామాన్య ప్రజలు సైతం చంద్రుని చుట్టూ విహరించే అవకాశం రావచ్చని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending