Used Car loan: సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలుకు లోన్ తీసుకుంటున్నారా? రూ.5 లక్షల లోన్‌పై ఎంత EMI చెల్లించాలో తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు గత కొన్నేళ్లుగా పెరిగిపోయాయి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత చాలామంది ప్రజా రవాణా కంటే సొంత వాహనాలకు మొగ్గు చూపుతున్న వేళ, సెకండ్ హ్యాండ్ కార్ల గురించి ఆరా తీసేవారి సంఖ్య పెరుగుతోంది.

  • Share this:
ఈ రోజుల్లో ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి ప్రజలు సైతం సొంత కారు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు. గత కొన్నేళ్లుగా రోడ్లపైకి వస్తున్న కొత్త కార్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకున్న తరువాతే కొత్త కారు కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. అత్యుత్తమ ఫీచర్లతో టాప్-ఎండ్ మోడల్ కోసం చూడటానికి బదులుగా మీ బడ్జెట్‌కు సరిపోయే కారును ఎంచుకోవాలని చెబుతున్నారు. అవసరమైతే ఉపయోగించిన కారు లేదా సెకండ్ హ్యాండ్ కారును సైతం ఎంచుకోవచ్చు. ఇవి మీ ఆర్థిక పరిస్థితులను దెబ్బతీయకుండా కోరికలను నెరవేరుస్తాయి.

భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు గత కొన్నేళ్లుగా పెరిగిపోయాయి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత చాలామంది ప్రజా రవాణా కంటే సొంత వాహనాలకు మొగ్గు చూపుతున్న వేళ, సెకండ్ హ్యాండ్ కార్ల గురించి ఆరా తీసేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి బ్యాంకులు అందిస్తున్న లోన్లు, వడ్డీ రేట్ల వివరాలు తెలుసుకుందాం.

లోన్లు ఎలా ఇస్తారు?
వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు సెకండ్ హ్యాండ్ కార్ల కోసం తక్కువ వడ్డీతో లోన్లు అందిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన నియమ నిబంధనలు బ్యాంకులను బట్టి మారుతుంటాయి. సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలుకు లోన్ తీసుకోవాలి అనుకునే వారు రుణదాతల అర్హత ప్రమాణాలను పాటించాలి. కొన్ని బ్యాంకులు మూడు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న సెకండ్ హ్యాండ్ కార్లకు మాత్రమే రుణాలు ఇస్తాయి. మరికొన్ని ఆర్థిక సంస్థలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న కార్లకు లోన్ ఆఫర్ చేస్తాయి. బ్యాంకులు ఆమోదించిన రుణం కారు విలువలో 75- 85 శాతం వరకు ఉండాలి. మిగిలిన మొత్తాన్ని డౌన్ పేమెంట్‌గా చెల్లించాలి. ఇలా ప్లాన్ చేసుకుంటే ఇతర ఆర్థిక లక్ష్యాలు ప్రభావితం కాకుండానే కారు కొనుగోలు చేయవచ్చు.

ఎంత వడ్డీ వర్తిస్తుంది?
సెకండ్ హ్యాండ్ కారు లోన్ వడ్డీ రేట్లు 11 నుంచి 16 శాతంగా ఉంటాయి. లోన్ రీ- పేమెంట్ వ్యవధి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. దీంతో పాటు కొంత మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాలి. ఈ లోన్‌పై వర్తించే వడ్డీ రేటు EMIలను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ఉపయోగించిన కారు రుణాల వడ్డీ రేట్లు కొత్త కారు రుణాల కంటే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తక్కువ వ్యవధితో లోన్‌ ఎంచుకోవడం మంచిది. సెకండ్ హ్యాండ్ కార్ కోసం చూసేవారు అర్హత, రుణ మొత్తం, వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు మొదలైన వాటితో సహా కీలకమైన అంశాల గురించి పూర్తిగా ఆరా తీయాలి.

ఎంత ఈఎంఐ చెల్లించాలి?
మన దేశంలోని 20 ప్రముఖ బ్యాంకులు సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుకు లోన్లు అందిస్తున్నాయి. మూడు సంవత్సరాల కాలపరిమితితో తీసుకున్న రూ. 5 లక్షల లోన్లకు ఎంత మేరకు EMI వర్తిస్తుందనే వివరాలను బ్యాంక్ బజార్ వెల్లడించింది. ఈ లోన్లపై వివిధ బ్యాంకులు 7.3 శాతం నుంచి 14.4 శాతం వడ్డీ రేటును విధిస్తున్నట్లు బ్యాంక్ బజార్ డేటా ద్వారా తెలుస్తోంది. ఇందుకు రూ.15,507 నుంచి రూ.17,186 వరకు ఈఎంఐ వర్తిస్తుంది. దీనికి ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలు అదనంగా వర్తిస్తాయి. లోన్ ఆధారంగా వడ్డీ రేటు ఎక్కువగా ఉండవచ్చు.
Published by:Krishna Adithya
First published: