news18-telugu
Updated: August 31, 2018, 1:34 PM IST
ప్రతీకాత్మక చిత్రం
మీరు స్టేషన్లో రైలు కోసం ఎదురుచూస్తుంటారు. కానీ ట్రైన్ రావడానికి ఇంకా సమయం ఉంది. అప్పటివరకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ కాస్త సమయంలో ఇంటికి కావాల్సిన సరుకులు అక్కడే స్టేషన్లో కొంటే టైమ్ కలిసొస్తుంది. అంతే కాదు... అలా కొన్న సరుకుల్ని నేరుగా ఇంటికి డెలివరీ చేస్తే... ఆ సర్వీస్ ఇంకా అద్భుతం కదా. దీన్నే వర్చువల్ షాపింగ్ అంటారు. ఎక్కడైనా సూపర్ మార్కెట్‌కు వెళ్లినా హోమ్ డెలివరీ చేస్తారు కదా... దానికీ దీనికి తేడా ఏంటన్న అనుమానం మీరు రావచ్చు. వర్చువల్ షాపింగ్‌లో అక్కడ మీకు సరుకులు కనిపించవు. కేవలం వాటి బొమ్మలు, ధరలు మాత్రమే ఉంటాయి. మీరు బిల్లింగ్ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ప్రొడక్ట్స్‌ని మీరే స్కాన్ చేసి ఆర్డర్ చేస్తే సరిపోతుంది. ఇప్పటికే ఈ వర్చువల్ షాపింగ్ విదేశాల్లో బాగా క్లిక్కయింది. ఇండియాలోనే తొలిసారిగా కోల్‌కతా మెట్రోలో ప్రారంభం కాబోతోంది. ఐఐఎం-కోల్‌కతాకు చెందిన ముగ్గురు ఎంబీఏ విద్యార్థుల ఆలోచన ఇది. కోల్‌కతా మెట్రోకు 90% ఆదాయం ట్రెయిన్ ఫేర్స్తో వస్తోంది. మరిన్ని ఆదాయమార్గాలను పెంచే చర్యల్లో భాగంగా వర్చువల్ షాపింగ్ ఆలోచన తెరపైకి వచ్చింది.

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని కోల్‌కతా మెట్రో స్టేషన్లో ఇండియాలోనే తొలి వర్చువల్ గ్రాసరీ స్టోర్ ఏర్పాటు చేయాలన్నది మా ప్రతిపాదన. డిజిటల్ బిల్‌బోర్డులపై ఉత్పత్తుల ఫోటోలు ఉంటాయి. క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఆర్డర్ చేయొచ్చు. ఎక్కువగా నిత్యావసర సరుకులే ఉంటాయి.
— అలన్ షాజీ, ఐఐఎం-సీ పూర్వ విద్యార్థి
త్వరలోనే స్టేషన్లో వర్చువల్ గ్రాసరీ స్టోర్స్ ఏర్పాటు చేస్తామని కోల్‌కతా మెట్రో అధికార ప్రతినిధి కూడా చెప్పారు. మెట్రో స్టేషన్లలో చాలావరకు స్థలం నిరుపయోగంగా ఉందని, దాన్ని వినియోగించుకుంటామన్నారు. కోల్‌కతాలోని 20 మెట్రో స్టేషన్లలో 68,478 చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉందని అంచనా. ఈ స్థలాన్ని ఉపయోగించుకుంటే రూ.20 కోట్ల ఆదాయం పొందొచ్చని లెక్కలేస్తున్నారు.
Published by:
Santhosh Kumar S
First published:
August 31, 2018, 1:02 PM IST