త్వరలోనే కేంద్ర ప్రభుత్వం జనరల్ ఎలక్షన్‌లకు ముందు తమ చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో చివరి బడ్జెట్‌పై(Budget) సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొవిడ్ అనంతరం కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ రాజకీయ సమీకరణాలు, ద్రవ్యోల్బణం ప్రభావం చూపాయి. ఇన్ని సమీకరణాల మధ్య కేంద్రం ఎలాంటి బడ్జెట్ రూపొందిస్తుందో? అని అందరూ ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 6న ముగిసే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఉభయ సభల్లో ఆర్థిక సర్వేను(Survey) కూడా ప్రవేశపెట్టనున్నారు. కొందరు ప్రభుత్వ అధికారుల సమాచారం మేరకు ANI వార్తా సంస్థ ఈ వివరాలను తెలియజేసింది.
రాష్ట్రపతి ప్రసంగంతో మొదలు
పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగంతో సెషన్ ప్రారంభమవుతుంది. గత ఏడాది ఆగస్ట్‌లో అత్యున్నత పదవిని స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి చేయనున్న మొదటి ప్రసంగం అవుతుంది. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ప్రధాని మోదీ 2.0 ప్రభుత్వం, సీతారామన్ ఐదో బడ్జెట్ కావడం విశేషం. ఏప్రిల్- మే 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పూర్తి బడ్జెట్ కూడా కావడం గమనార్హం. బడ్జెట్ సెషన్ మొదటి భాగం ఫిబ్రవరి 10 వరకు కొనసాగుతుందని కొన్ని ప్రభుత్వ వర్గాలు ఏఎన్‌ఐకి తెలిపాయి.
బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం
వివిధ మంత్రిత్వ శాఖల గ్రాంట్ల డిమాండ్లను స్టాండింగ్ కమిటీలు పరిశీలించిన విరామం తర్వాత, బడ్జెట్ సెషన్ రెండవ భాగం మార్చి 6న ప్రారంభమై ఏప్రిల్ 6న ముగిసే అవకాశం ఉందని తెలిపారు. బడ్జెట్ సెషన్ మొదటి భాగంలో, ఉభయ సభలు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సవివరమైన చర్చను నిర్వహిస్తాయి, తర్వాత కేంద్ర బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనుండగా, కేంద్ర బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారు.
బడ్జెట్ సెషన్ రెండో భాగంలో, ప్రభుత్వ శాసనసభ ఎజెండాతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలకు గ్రాంట్‌ల డిమాండ్‌లపై ప్రధాన చర్చ జరుగుతుంది. ఈ సెషన్‌లో భాగంగా ద్రవ్య బిల్లు అయిన యూనియన్ బడ్జెట్‌ను ఆమోదిస్తారు. ఇటీవల సీతారామన్ మాట్లాడుతూ.. తన రాబోయే బడ్జెట్ పబ్లిక్ స్పెండింగ్‌ను పెంచేలా ఉంటుందని, మునుపటి బడ్జెట్‌ల తరహాలనే ఈ బడ్జెట్ కూడా ఉంటుందని తెలిపారు. COVID-19 మహమ్మారి నుంచి బయటపడిన ఆర్థిక వ్యవస్థకు సపోర్ట్‌గా ఆర్థిక మంత్రి భారీ ప్రజా వ్యయ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు.
ఇండియా వృద్ది అంచనాను తగ్గించిన ఆర్థిక సంస్థలు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తో సహా అనేక సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను 6.8 శాతానికి లేదా అంతకంటే తక్కువగా అంచనా వేశాయి. ఈ క్రమంలో బడ్జెట్ 2023-24ను కేంద్రం తీసుకురానుంది. RBI 2022-23కి రియల్ GDP వృద్ధిని 6.8 శాతంగా అంచనా వేసింది. మూడో త్రైమాసికంలో 4.4 శాతం, నాలుగో త్రైమాసికంలో 4.2 శాతంగా తెలిపింది. స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి 2023-24 ఏప్రిల్-జూన్ కాలానికి 7.1 శాతం, తదుపరి త్రైమాసికంలో 5.9 శాతంగా అంచనా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.