అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, రాబోయే ఎన్నికలు.. వెరసి కమలం సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో (Budget) ఆకర్షణలు, ఆర్భాటాలకు పోలేదు. సుస్థిర అభివృద్ధికే పెద్దపీట వేశారు. విద్య, నైపుణ్యాలకు సంబంధించి గతంలో కంటే మంచి ప్రాధాన్యం ఇచ్చారు. అందులో భాగంగానే పీఎం వికాస్ (PM VIKAS) అనే పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రకటించారు. పీఎం వికాస్‌లో భాగంగా చేతి వృత్తులు, సంప్రదాయ వృత్తుల్లో నైపుణ్యం ఉన్న వారిని ప్రోత్సహించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్మలమ్మ తెలిపారు. ఆయా వృత్తుల్లోని వాళ్లు ఇప్పటి అవసరాలకు తగ్గట్లు సాంకేతికత అందిపుచ్చుకోవడంతో పాటు రుణ సదుపాయం, వివిధ రూపాల్లో మద్దతు ఇచ్చేందుకు పీఎం వికాస్ ఉపయోగపడుతుందని వివరించారు.
* విశ్వకర్మ అంటే ఏంటి?
సనాతన హిందూ సంప్రదాయం ప్రకారం ఈ ప్రపంచాన్ని సృష్టించింది విశ్వకర్మ అని విశ్వసిస్తారు. ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో విశ్వకర్మ జయంతి నిర్వహిస్తారు. తరతరాలుగా చేతి వృత్తులు చేసుకునే వారిని విశ్వకర్మలుగానే భావిస్తారు. ఇప్పటివరకు వీరికి సరైన గుర్తింపు లభించలేదని, పీఎం వికాస్ పథకంతో లక్షల సంఖ్యలో ఉన్న హస్త కళాకారులకు మేలు జరగునుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
* వివిధ రాష్ట్రాల్లోని వర్గాలు
దేశంలోని చాలా రాష్ట్రాల్లో విశ్వకర్మ వర్గానికి చెందిన వాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఈ వర్గం కింద వచ్చే వారు ఎవరంటే.. ఆచార్, ఆచారి, ఆచారి థాచర్, ఆచారీ, ఆచార్య, అక్కసాలే, అర్కసల్లి, ఆసారి, ఆసారి ఒడ్డి, అసుల, ఔసుల్ లేదా కమ్సాలి, బాధేల్, బాడిగర్చ బగ్గా, బైలపాత్ర, బైలుకమ్మర, భడివడ్ల్, భరద్వాజ, బిధాని, బిశ్వకర్మ, బోగారా, బోస్, బ్రహ్మలు, చారి, చాటువేది, చెట్టియన్, చిక్కమనేస్, చిపెగారా, చోళుడు, చౌదరి, దాస్, దేవగన్, దేవకమ్లాకర్, ధీమాన్, ధోలే, ద్వివేది, గజ్జర్, గీడ్, గెజ్జిగర్, గిజ్జేగార, గిల్, గుజ్జర్, జాంగర్, జాంగిడ్, కల్సి, కమర్, కంభర, కమ్మలన్, కమ్మలర్, కమ్మర, కమ్మరి, కమ్మియార్, కసలా, కంసాలి, కంచరి, కంచుగారు, కన్నాలన్, కన్నాలర్, కన్నార్ వంటి సుమారు 140 విశ్వకర్మ వర్గాలు దేశం మొత్తం మీద ఉన్నాయి. వీరందరికీ లబ్ధి చేకూరనుంది. దీంతో పాటు ఉపాధి కల్పనకు ఇంకొన్ని మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు.
* 157 నర్సింగ్ కళాశాలలు
2014 నుంచి నెలకొల్పిన 157 వైద్య కళాశాలలకు అనుసంధానంగా 157 కొత్త నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఫార్మాసూటికల్స్‌లో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ICMR ల్యాబ్‌ల్లో సౌకర్యాలు పెంచుతామన్నారు. మూడేళ్లలో 47 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చేలా పాన్ ఇండియా నేషనల్ అప్రెంటిస్‌షిప్ పథకం ప్రారంభించనున్నట్లు వివరించారు.
ఇది కూడా చదవండి : యూపీఎస్సీ నుంచి భారీగా నోటిఫికేషన్.. 1105 పోస్టులు భర్తీ.. పూర్తి వివరాలివే..!
* స్కిల్ సెంటర్ల ఏర్పాటు
ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా దేశంలోని యువతకు శిక్షణ ఇచ్చేలా 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ ప్రకటించారు. వీటితో పాటు రాబోయే మూడేళ్లలో 740 ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో చదువుతున్న 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు చదువు చెప్పేందుకు 38,800 మంది టీచర్లు, సహాయ సిబ్బందిని తీసుకోనున్నట్లు వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2023, Career and Courses, EDUCATION, JOBS